MS Dhoni: ధోని స్కెచ్ గీస్తే ప్రత్యర్థి మైండ్ బ్లాంకే.. మరో సారి నిరూపితమైందిలా.. వైరల్ వీడియో

గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో విజయ శంకర్, రషీద్ ఖాన్ క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో ఇద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడుతున్నారు. ఒకానొక దశలో గుజరాత్ చేదిస్తుందేమో అన్నట్టుగా వీరి ఆట తీరు కనిపించింది.

  • Written By: BS Naidu
  • Published On:
MS Dhoni: ధోని స్కెచ్ గీస్తే ప్రత్యర్థి మైండ్ బ్లాంకే.. మరో సారి నిరూపితమైందిలా.. వైరల్ వీడియో

MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుత విజయం సాధించింది. ప్లే ఆఫ్ చేరడమే కష్టం అనుకున్న జట్టు ఏకంగా ఫైనల్ కు చేరి తన సత్తాను చాటింది. లీగ్ దశలో అప్రతిహత విజయాలతో టేబుల్ టాప్ లో ఉండి ప్లే ఆఫ్ కు చేరిన గుజరాత్ టైటాన్స్ జట్టు.. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో చేతులెత్తేసింది. చెన్నై జట్టు అద్భుత విజయం సాధించడం వెనుక కెప్టెన్ మాస్టర్ మైండ్ ధోని వ్యూహాలు దాగి ఉన్నాయి.

ఐపీఎల్ లో చెన్నై విజయవంతమైన జట్టుగా ప్రయాణం సాగిస్తోంది. ఆ జట్టు పదో సారి ఫైనల్ కు చేరింది. ఇప్పటి వరకు నాలుగు సార్లు కప్ సాధించిన చెన్నై జట్టు.. ఐదోసారి టోర్నీ విజేతగా నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన చెన్నై జట్టు.. టైటిల్ చేజిక్కించుకునేందుకు మరో అడుగు దూరంలో ఉంది. ఈ విజయం వెనక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని వ్యూహాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చెన్నై కెప్టెన్ ధోని తన వ్యూహంతో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యేలా చేసిన తీరు అద్భుతం అనే చెప్పాలి. గుజరాత్ కీలక వికెట్ కోల్పోవడంతోపాటు వరుస వికెట్లు చేజార్చుకుని ఓటమిపాలయ్యింది.

ధోనీ వ్యూహాలకు చిత్తయిన గుజరాత్ టైటాన్స్ జట్టు..

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని వ్యూహాలు అద్భుత ఫలితాన్నిచ్చాయి. మ్యాచ్ లో ఎంత ఒత్తిడిలో ఉన్నా.. ఎంత ఉత్కంఠగా మారినా తాను మాత్రం కూల్ గా ఉంటూ తన ఆలోచనలతో ప్రత్యర్థికి చెక్ పెడుతుంటాడు ధోని. అటువంటి సన్నివేశమే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన కీలక పోరులో చోటు చేసుకుంది. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 22 పరుగులకు సాహా రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. దీంతో టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. అనంతరం ఒక ఫోర్ కొట్టి దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఉన్న పాండ్యా.. ధోని మెరుపులాంటి ఆలోచనకు అవుట్ అయ్యాడు. తీక్షన బౌలింగ్ వేస్తున్న సమయంలో ఎడమ వైపు ఉన్న జడేజాను ధోని కుడి వైపునకు రప్పించి ఫీల్డింగ్ లో మార్పులు చేశాడు. దీంతో ధోనీ వ్యూహంలో భాగంగా తర్వాత బంతిని ఆఫ్ సైడ్ వేయడంతో షాట్ కొట్టిన పాండ్యా జడేజాకు చిక్కాడు. దీంతో గుజరాత్ కీలక వికెట్ కోల్పోవడంతోపాటు కష్టాల్లోకి వెళ్ళింది. అనంతరం వరుసగా వికెట్లు కోల్పోయి చివరకు 20 ఓవర్లలో 157 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో చెన్నై 15 పరుగులు తేడాతో విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది.

ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కీలక సూచనలు..

గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో విజయ శంకర్, రషీద్ ఖాన్ క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో ఇద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడుతున్నారు. ఒకానొక దశలో గుజరాత్ చేదిస్తుందేమో అన్నట్టుగా వీరి ఆట తీరు కనిపించింది. ఈ తరుణంలో పలువురు ఫీల్డర్లు తడబాటుకు గురైన విషయాన్ని ధోని గుర్తించాడు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేస్తూ ధోని కనిపించాడు. కూల్ గా ఉండాలని, టెన్షన్ ఫీల్ కావద్దని సూచిస్తూ ధోని కనిపించాడు. ధోని చేసిన ఈ సూచనల తర్వాత భారీ షాట్ కు ప్రయత్నించిన విజయ శంకర్ ను అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ బాట పట్టించాడు రుతురాజ్ గైక్వాడ్. దీంతో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సునాయాసంగా విజయం సాధించింది. ఎప్పటికప్పుడు తన వ్యూహాలతో ప్రత్యర్థికి ముకుతాడు వేయడంతోపాటు.. జట్టులోని ఆటగాళ్ల ఒత్తిడిని గుర్తించి వారిని ప్రశాంతంగా ఉండేలా చేయడంలోను ధోని సిద్ధహస్తుడు. ఇవన్నీ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజయవంతమైన జట్టుగా ఐపీఎల్ లో ముందుకు నడిపిస్తున్నాడు మహేంద్ర సింగ్ ధోని.

https://twitter.com/JioCinema/status/1661056959481798656?s=20

సంబంధిత వార్తలు