IPL 2024 MS Dhoni – Ruth Raj Gaikwad : ఐపీఎల్ లో వరుస విజయాలు సాధిస్తూ కోల్ కతా నైట్ రైడర్స్ సంచలనం సృష్టిస్తోంది. పాయింట్లు పట్టికలోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ జట్టుకు చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టు శనివారం చెక్ పెట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 137 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా, తుషార్ దేశ్ పాండే చెరో 3 వికెట్లు సాధించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు 17.4 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. చెన్నై కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ 58 బంతుల్లో 67 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. చెన్నై జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఐదు సంవత్సరాల తర్వాత అతడు కెప్టెన్ హోదాలో అర్థ సెంచరీ సాధించడం విశేషం. ఈ నేపథ్యంలోనే రుతు రాజ్ గైక్వాడ్ కు సంబంధించిన చర్చ జరుగుతోంది.
రెండు సంవత్సరాల క్రితం నుంచే మొదలుపెట్టాడు
ఐపీఎల్ చరిత్రలో చెన్నై అత్యంత విజయవంతమైన జట్టు. ఐదుసార్లు ట్రోఫీ దక్కించుకుంది. చాలాసార్లు ప్లే ఆఫ్ దశకు వెళ్ళింది. రెండు సంవత్సరాలు నిషేధానికి గురైంది కాబట్టి 5 ట్రోఫీలతో సరిపుచ్చుకుంది.. ఆడే అవకాశం గనుక ఉంటే ముంబై రికార్డును ఎప్పుడో బద్దలు కొట్టేది. చెన్నై జట్టు ఐదుసార్లు ధోని నాయకత్వంలోనే విజేతగా నిలిచింది. అయితే ఈ సీజన్లో అతడు కెప్టెన్సీ ని రుతు రాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. ఐపీఎల్ 17వ సీజన్ మ్యాచ్ ప్రారంభానికి ముందే అతడు ఈ నిర్ణయం తీసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అకస్మాత్తుగా ధోని నిర్ణయం తీసుకోవడం పట్ల చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ ధోని దీనికి సంబంధించి గ్రౌండ్ మ్యాప్ రెండు సంవత్సరాల క్రితం నుంచే మొదలుపెట్టాడట.
ధోని సూచనలు పాటించాడు
ప్రస్తుతం ధోనీ వయసు 40ల్లో ఉంది.. మైదానంలో ఒకప్పటిలాగా చురుకుగా కదల లేకపోతున్నాడు. మెరుపు వేగంతో పరుగులు తీయలేకపోతున్నాడు. టీమిండియా కు అతడు ఎప్పుడో గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ లో మాత్రం ఆడుతున్నాడు. చెన్నై జట్టుకు “తల”లాగా కొనసాగుతున్నాడు. ఐదుసార్లు విజేతను చేశాడు. తన చేతలతో, అద్భుతమైన కెప్టెన్సీ తో అత్యంత విలువైన జట్టుగా మార్చాడు. అలాంటప్పుడు ఆ జట్టును అలా వదిలేయలేడు కదా.. అందుకే తన తర్వాత చెన్నై జట్టుకు సారథిగా రుతు రాజ్ గైక్వాడ్ ను ఎంచుకున్నాడు. 2022 నుంచే అతడికి తర్ఫీదు ఇవ్వడం మొదలుపెట్టాడు. గైక్వాడ్ తో పెద్దగా మాట్లాడకపోయినప్పటికీ.. అతని ఆట తీరును పరిశీలించేవాడు. మైదానంలోనే సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. అయితే వాటిని గైక్వాడ్ అలానే పాటించేవాడు.
నమ్మకం కుదిరింది
అలా గైక్వాడ్ తన సూచనలు సలహాలు పాటించడంతో ధోనికి కూడా నమ్మకం కుదిరింది. అంతే అప్పటినుంచి గైక్వాడ్ పై మరింత శ్రద్ధ పెట్టాడు. 2022లో కెప్టెన్సీ గురించి గైక్వాడ్ తో ధోని తన మనసులో ఉన్న మాటను చెప్పేశాడు. ఒకటి లేదా రెండు సంవత్సరాల తర్వాత చెన్నై జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉండు అని గైక్వాడ్ తో ధోని అన్నాడు. తను అన్నట్టుగానే 2024లో ఐపీఎల్ 17వ సీజన్ లో బెంగళూరు తో ప్రారంభ మ్యాచ్ కు ముందే ధోని తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే చాలామంది అప్పటికప్పుడు ధోని ఈ నిర్ణయం తీసుకున్నాడనుకున్నారు. కానీ కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో రుతు రాజ్ గైక్వాడ్ తన కెప్టెన్సీ వెనుక అసలు విషయాన్ని వెల్లడించడంతో.. అవాక్కయ్యారు. ధోని మాస్టర్ బ్రెయిన్ ను అందరూ కొనియాడుతున్నారు.