Homeజాతీయ వార్తలుPrajwal Revanna : శీలానికి వెల కడతారా.. ఇదేనా కాంగ్రెస్ మార్క్ న్యాయం?

Prajwal Revanna : శీలానికి వెల కడతారా.. ఇదేనా కాంగ్రెస్ మార్క్ న్యాయం?

Prajwal Revanna : కీలు ఎరిగి వాతపెట్టాలి. రోగమెరిగి వైద్యం చేయాలి. అంతేతప్ప ఎక్కడపడితే అక్కడ వాత పెడితే గాయమవుతుంది. ఎలాగూ మందులున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారం కూడా ఇలానే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలోని హసన్ పార్లమెంట్ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వ్యవహారం ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది. వందలాది మంది మహిళలతో అతడు నడిపిన రాసలీలలు.. వాటిని చిత్రించిన తీరు.. అవి మీడియాలో ప్రసారమైన వైనం.. సంచలనంగా మారింది. ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ మనవడు. పైగా హసన్ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడు. ఆ పార్లమెంట్ పరిధిలో అతడు ఏం చెబితే అదే న్యాయం. అతడు ఏం వల్లిస్తే అదే ధర్మం. మాట మాట్లాడేందుకు లేదు. ఎదురు మాట్లాడితే బతికే పరిస్థితి లేదు. చివరికి ప్రజాప్రతినిధి భార్యలను సైతం అతడు చెరిచాడు.. చేసిందే చండాలం అనుకుంటే.. దానిని కెమెరాలో చిత్రించాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, వందలాదిమంది అతడి చేతిలో మానాన్ని పోగొట్టుకున్నారు. అతడు ఆ వీడియోలతో బెదిరించినప్పుడల్లా లొంగిపోయారు. చివరికి అతని పాపం పండింది.. చేసిన దారుణానికి జైలు శిక్ష అనుభవించాల్సింది పోయి, దేశం దాటి వెళ్ళిపోయాడు..

ఇలాంటి తరుణంలో ఆ నీచుడికి, నికృష్టుడికి కఠిన శిక్ష పడాలి. అప్పుడే ఇంకో రాజకీయ నాయకుడు.. అలాంటి పని చేయడానికి భయపడతాడు. అయితే ఇలాంటి చర్యలు తీసుకోకుండా… పొలిటికల్ మైలేజ్ కోసం కాంగ్రెస్ పార్టీ తాపత్రయ పడుతుండడం అసలైన విషాదం. ఈ కేసులో బాధితులుగా ఉన్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందట.. ఆర్థిక సాయం ఎలా చేస్తుంది?, ఇప్పటికే ఆ బాధిత మహిళల ముఖాలను మీడియా సిగ్గూశరం లేకుండా చూపించేసింది. పరువు పోయిందనే బాధతో చాలామంది మహిళలు తమ ఊళ్లను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తమ ఇళ్లకు తాళం వేశారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. బంధువులకు ముఖం ఎలా చూపించుకోవాలో తెలియక, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి బాధిత మహిళలకు అందాల్సింది ఆర్థిక సహాయం కాదు.. న్యాయం చేస్తామనే భరోసా.. అండగా ఉంటామనే ధైర్యం.. అవి ఇవ్వకపోగా.. పార్లమెంటు ఎన్నికల ముందు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతుండడం కలచివేతకు గురిచేస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వపరంగా సిట్ ఏర్పాటు చేసినప్పుడు.. ప్రజ్వల్ తండ్రి అరెస్టుతోనే ఆగిపోకుండా.. ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమంది ఉన్నారో బయటికి లాగాలి. అందర్నీ జైలుకు పంపాలి. అవసరమైతే వారిని ప్రత్యక్ష రాజకీయాలలో లేకుండా చేయాలి. ప్రభుత్వం తలుచుకుంటే ఇది పెద్ద విషయం కాదు. అలాగని న్యాయవ్యవస్థను చేతిలోకి తీసుకోమని చెప్పడం లేదు. ప్రజల చేత ఎన్నికైన వారు.. ప్రజలనే చెరుచుకుంటూ పోతుంటే.. ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది. ఇవాళ ప్రజ్వల్.. రేపు ఇంకొకడు.. ఇలా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ.. వ్యవస్థను ధిక్కరిస్తే.. దానిమీద ప్రజలకు ఏం గౌరవం ఉంటుంది.. అందుకే క్యాన్సర్ సోకితే మన కాలు అని చూడకుండా తొలగించుకుంటాం. అలాంటిది ప్రజ్వల్ లాంటి రాచపుండును తొలగించడం పెద్ద విషయం కాదు.. అన్నట్టు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ్వల్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందట. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసట. అప్పుడు ఎటువంటి ఆందోళన చేయనివారు.. ఇప్పుడు హడావిడి చేయడం వెనుక.. ప్రత్యేకంగా కారణాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular