Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తాను ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్ తెలిపారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ఇచ్చారని తెలిపింది. అధ్యక్ష ఎన్నికల సమయంలో తనపై వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్ అడ్డదారులు తొక్కారనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో న్యూయార్క్ కోర్టులో శృంగార తారా స్టార్మీ డేనియల్ తాజాగా వాంగ్మూలం ఇచ్చింది.
2006లో కలిశానని..
తాను ట్రంప్‌ను 2006లో ఓ గోల్ఫ్ టోర్నమెంట్లో తొలిశాసి కలిశానని వెల్లడించింది. ఆ తర్వాత ఓ బాడీగార్డు ద్వారా తనను డిన్నర్‌కు ట్రంప్ ఆహ్వానించి నట్లు తెలిపింది. అనంతరం హోటల్ సూట్‌కు తీసుకెళ్లి ఆయన ఉద్దేశం ఏంటో తనకు చెప్పాడని పేర్కొంది. విషయం తనకు అర్థమైందని తెలిపింది. అక్కడ ఇద్దరం కలిసి ఏకాంతంగా గడిపామని వెల్లడించింది. ఆ తర్వాత పలుమార్లు భేటీ అయినా సన్నిహితంగా మెలగలేదని చెప్పింది. అయితే తమ సంబంధం గురించి ఎంతో మందికి తెలుసని కూడా డేనియల్ వెల్లడించింది.
2011లో ఓ బ్లాగ్ ద్వారా వెలుగులోకి..
ఇదిలా ఉంటే.. 2006లో జరిగిన విషయం 2011లో ఓ బ్లాగ్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. 2016 ఎన్నికల సమయంలో 1,30,000 డాలర్ల మొత్తాన్ని ట్రంప్ న్యాయవాది మైఖేల్ కోహెన్ నుంచి తాను స్వీకరించినట్లు డేనియల్ తెలిపింది. అయితే ట్రంప్ నుంచి డబ్బులు వసూలు చేయడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేసింది.
డబ్బుల కోసమే ఇలా..
ఇదిలా ఉండగా డేనియల్ వాంగ్మూలాన్ని ట్రంప్ న్యాయవాదులు ఖండించారు. డబ్బుల కోసమే ఇలా మాజీ అధ్యక్షుడిపై ఆరోపణలు చేస్తుందని పేర్కొన్నారు. ఇలా సుదీర్ఘ సమయం ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. హాష్ మనీకి సంబంధించిన కేసుపై న్యూయార్క్ న్యాయస్థానం కొన్ని రోజులుగా విచారణ చేస్తోంది. 13వ రోజు వాదనలు కొనసాగాయి. ఇందులో భాగంగా ట్రంప్‌పై ఆరోపణలు చేసిన శృంగార తార స్టార్మీ డేయిల్ సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు వచ్చింది. ఆ సమయంలో ట్రంప్ కూడా కోర్టులోనే ఉన్నారు. డేనియల్ వాంగ్మూలం ఇస్తున్న సమయంలో ట్రంప్ తల ఊపుతున్నట్లు, లాయర్లతో గుసగుసలాడినట్లు కనిపించారు.