Kalasha Naidu : ఆ చిన్నారి వయసు కేవలం 11 ఏళ్లు. పుట్టడమే సేవాగుణంతో పుట్టింది. తన వయసు పిల్లలు కష్టాల్లో ఉండడం చూసి చిన్న తనం నుంచే స్పందించడం, తనవంతుగా వారికి సేవ చేయడం అలవాటుగా మార్చుకుంది. చిన్న వయసులో కష్టాలు పడుతున్న చిన్నారులకు పలకలు, బలపాలు, చాక్లెట్లు, పెన్సిళ్లు, నోట్బుక్లు, ఆట బొమ్మలు అందించింది. సాయంతోపాటు వెలకట్టలేని ప్రేమను పంచింది. తమ కూతురులోని సేవాగుణాన్ని, దాతృత్వ భావాన్ని గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు కూడా వెన్ను తట్టి ప్రోత్సహించారు. సేవలో భాగమై ముందుకు నడిపించారు. ఇలా 11 ఏళ్లకే ఆమె సేవాభావం ఇంతింతై వటుడింతై అన్నట్లు విశ్వవ్యాప్తమైంది. చివరకు యునైటెడ్ కౌన్సిల్ గ్లోబల్ పీస్ దృష్టికి వెళ్లింది. చిన్నారి సేవలను గుర్తించి డాక్టరేట్ ప్రదానం చేసింది.
ఇంతకీ ఎవరీ చిన్నారి..
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు చిన్నారి కలశ నాయుడు 2013, ఆగస్టు 13న విశాలమైన దాన గుణాన్ని పెట్టుకుని బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు దంపతులకు పుట్టింది. చిన్నతనం నుంచే కలశ దాతృత్యం చూసిన తల్లిదండ్రులు నూతన్ నాయుడు దంపతులు పుత్రికా వాత్సల్యంతో పొంగిపోయారు. ఆమె చేసే ప్రతిపనికి ఊతం ఇచ్చారు. కలశకు స్వేచ్ఛను ఇచ్చి సమాజానికి చేయూత ఇవ్వమని ప్రోత్సహించారు. ఇలా చిన్నారి సేవాభావం చివరకు కలశ షౌండేషన్గా మారింది.
విద్యాదానం గొప్పదని..
అన్ని దానాల్లో అన్నదానం గొప్పదంటారు. కానీ కలశ విద్యాదానం గొప్పదని నమ్మింది. అన్నం ఆకలి తీరుస్తుందని, విద్య సమాజ శ్రేయస్సును కల్పిస్తుందని, తద్వారా పది మందికిసాయం అందించేలా చేస్తుందని భావించింది. అందుకే ఫౌండేషన్ ప్రారంభంలో అక్షర కలశం పేరుతో విద్యను అందించేందుకు ముందుకు వచ్చారు. అక్షర కలశంతో ప్రారంభమైన ఫౌండేషన్ ప్రస్థానం మరెన్నో మైలు రాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగింది.
అనేక సేవా కార్యక్రమాలు..
గ్రీన్ లేస్ సొసైటీతో భాగస్వామ్యమైన కలశ ఫౌండేషన్ పర్యావరణంపై అవగాహన కల్పించడం, మొక్కలు నాటించడం వంటి కార్యక్రమాలు ప్రారంభించింది. తద్వారా నగర వాసుల్లో పర్యావరణ స్పృహను తట్టిలేపింది. గ్రీన్ ఇండియా దిశగా అడుగులు వేయించింది.
– తర్వాత చాణక్య పొలిటికల్ అవార్డ్స్ పేరుతో విన్నూత్న కార్యక్రమానికి ఫౌండేషన శ్రీకారం చుట్టింది. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో చైతన్యం తెస్తూనే రాజకీయాలపై కూడా తమ దృష్టిని కేంద్రీకరించారు. రాజకీయ రంగంలో సత్తా చాటుతున్న నాయకులకు, ప్రతినిధులకు చాణక్య అవార్డ్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం రాజనీతి శాస్త్రంలో అపర మేధావి చాణుక్యుడి పేరుమీద ఈ అవార్డును రూపొందించారు.
– ఆర్థిక రంగంలోనూ అడుగు పెట్టి సత్ఫలితాలు పొందుతున్నారు. స్వయం ఉపాధి కోసం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళకు ఫౌండేషన్ తరఫున ఉపాధి కల్పిస్తున్నారు. గ్రామీణాభివృద్దికి దోహదపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అతి చిన్న వయసులో డాక్టరేట్..
పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందంగా.. కేవలం 11 ఏళ్లకే కలశ అపారమైన సేవాప్రతిభను కనబరిచింది, యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ చిన్నారి సేవను గుర్తించింది. డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. లండన్ పార్లమెంటు భవన్లో కలశ నాయుడు ‘ప్రపంచవ్యాప్తంగా అతిచిన్న వయసులోనే డాక్టరేట్ బిరుదును పొందిన చిన్నారిగా రికార్డుకు ఎక్కింది.