Sunil Narine : ఐపీఎల్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. కోల్ కతా జట్టు టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది. ఈ జట్టు సాధిస్తున్న వరుస విజయాలలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఒకే ఒక్క ఆటగాడు సునీల్ నరైన్. అటు బంతి, ఇటు బ్యాట్ తో రాణించగల నేర్పు ఇతడి సొంతం. కష్ట కాలంలో కోల్ కతా కు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు. ఇటీవల లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ లోను అద్భుతమైన ఆట తీరుతో అలరించాడు. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. పరుగులు తీస్తున్నప్పటికీ.. వికెట్లు పడగొడుతున్నప్పటికీ.. ఇతడిలో ఏమాత్రం చలనం ఉండదు. పెద్దగా హావభావాలు పలికించడు. వికెట్ తీస్తే కామ్ గా ఉంటాడు. సెంచరీ కొడితే నిశ్శబ్దాన్ని పాటిస్తాడు. ఇది సొంత జట్టు ఆటగాళ్లనే కాదు, ప్రత్యర్థి జట్టు క్రీడాకారులను సైతం ఆశ్చర్యంలో ముంచేస్తోంది. ఇంతకీ సునీల్ నరైన్ గురించి తోటి ఆటగాళ్లు ఏమంటున్నారంటే..
సునీల్ నరైన్ వ్యవహార శైలి పట్ల కోల్ కతా ఆటగాళ్లు ఏమనుకుంటున్నారో.. ఆ జట్టు యాజమాన్యం ఒక సరదా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రఘు వంశీ, రస్సెల్, సాల్ట్ వంటి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
” సునీల్ స్థిరమైన మనిషి. అతడికి క్రికెట్ అంటే ప్రాణం. ఆ ఆటను అతడు విపరీతంగా ప్రేమిస్తాడు. తోటి ఆటగాళ్లతో చలాకీగా ఉంటాడు. ఇద్దరు గొప్ప ఆటగాళ్లు కలిస్తే.. సునీల్ తో సమానమవుతారని” కోల్ కతా ఓపెనర్ సాల్ట్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
” సునీల్ తన భావోద్వేగాలను నియంత్రించుకుంటాడు. వాటిని ఎక్కువగా కనిపించనీయడు. అతడి అనుభవం బహుశా ఇలాంటి పాఠం నేర్పిందనుకుంటా. ఇప్పటివరకు అతడు 500 మ్యాచులు ఆడాడు. అందువల్లే అతడు బుద్ధిగానికి గురికాడు. డగ్ ఔట్ లో సరదాగా ఉంటాడని” రస్సెల్ వ్యాఖ్యానించాడు.
” అతడు మాతో సరదాగా ఉంటాడు. మైదానంలో మాత్రం జెంటిల్మెన్ గేమ్ ఆడతాడు. ఆట వరకు మాత్రమే అతడు సీరియస్ గా ఉంటాడు. అతని బ్యాటింగ్ బాగుంటుంది. బంతితో, బ్యాట్ తో సంచలనాల సృష్టిస్తాడని” రఘు వంశీ వివరించాడు.
ఇక ఈ సీజన్లో సునీల్ 11 మ్యాచులు ఆడాడు. 461 రన్స్ చేశాడు. ఆరెంజ్ క్యాప్ విభాగంలో మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. కోల్ కతా ఇప్పటికే తన ప్లే ఆఫ్ ను ఖరారు చేసుకుంది. అందులోనూ సునీల్ ఇదే ఆట తీరు ప్రదర్శిస్తే..కోల్ కతా కు ఇక అడ్డు ఉండదు.