Japan Population : జపాన్.. సాంకేతికతతో ప్రపంచానికి సవాల్ విసురుతున్న అతి చిన్న దేశం. తరచూ భూకంపాలతో వణికే జపాన్ టెక్నాలజీలో మాత్రం అగ్ర దేశాలను మించి దూసుకుపోతోంది. అయితే ఈ దేశంలో ఇళ్లు ఖాళీ అవుతున్నాయి. రికార్డు స్థాయిలో 90 లక్షల ఇళ్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. వీటిని ప్రతి ఒక్కరికీ పంచుకుంటూ పోతే న్యూయార్క్ నగర జనాభా మొత్తానికి సరిపోతాయి. జపాన్లో జనాభా తరుగుదలకు ఖాళీ అవుతున్న ఇళ్లు నిదర్శనం అంటున్నారు నిపుణులు. జపాన్ లో ఇలా వదిలేసిన ఇళ్లను అకియా అంటారు. పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో దూరంగా ఉంచిన ఇళ్లను కూడా ఇలాగే పిలిచేవారు.
ప్రధాన పట్టణాల్లోనూ..
జపాన్లోని ప్రధాన పట్టణాల్లోనూ ఖాళీ ఇళ్లు దర్శనమిస్తున్నాయి. టోక్యో, క్యోటోల్లో కూడా చాలా అకియాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడ ఇదే ఆ దేశానికి ప్రధాన సమస్యగా మారింది. దీనిపై కాండా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జెఫ్రీ హాల్ మాట్లాడుతూ భారీ సంఖ్యలో ఇళ్లు నిర్మించడం వలన తలెత్తిన సమస్య కాదన్నారు. తగ్గుతున్న జనాభాకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇక జపాన్లో జనాభా గతేడాదితో పోలిస్తే 8 లక్షలు తగ్గింది. ఎనిమిదేళ్లుగా తగ్గుదల కొనసాగుతోంది. దేశంలో ప్రస్తుతం 12.5 కోట్ల మంది నివాసం ఉంటున్నారు.
పెరుగుతున్న వృద్ధులు..
ఇదిలా ఉంటే జపాన్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. జనావాసాలు ఖాళీ అవడానికి ఇది కూడా ఒక కారణంగా పేర్కొంటున్నారు. కొన్ని గణాంకాల ప్రకారం జపాన్లో మొత్తం 14 శాతం ఇళ్లు ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తులకు ఉన్న రెండో ఇల్లు ఇటీవల ఖాళీ అయిన గృహాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ప్రకృతి విపత్తులు వచ్చిన వేళ ఇలాంటి ఖాళీ ఇళ్లు సహాయక చర్యలు చేపట్టే వారికి అడ్డంకిగా మారుతున్నాయి. ఇక అక్కడి ప్రజలు ఖాళీ ఇళ్లను తమ వారసులకు ఇస్తుంటారు. కానీ ఆ దేశంలో జనాభా లేకపోవడం, ఉన్న యువతరం పట్టణాల్లోనే స్థిరపడడంతో వీటిని చూసేవారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో రికార్డుల్లో లేని ఇళ్లను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. పాత ఇంటిని కూల్చి కొత్తది నిర్మించుకునే బదులు వాటిని అలాగే ఉంచేయడం చౌక అని ప్రజలు భావించడం కూడా ఖాళీ ఇళ్ల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఖాళీ ఇళ్లు ఉన్న కాలనీలకు రవాణా సౌకర్యం నిలిపివేయడంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
కొనుగోలు చేస్తున్న విదేశీయులు..
ఇదిలా ఉంటే జపాన్లో నిరుపయోగంగా ఉన్న ఇళ్లను విదేశీయులు కొనుగోలు చేస్తున్నారు. వాటిలో మార్పులు చేసి గెస్ట్ హౌస్లా వాడుకుంటున్నారు. ఇలా చేసిన వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండగా, భారీగా ఫాలోవర్లు వస్తున్నారు. అయితే ఇలాంటివి కేవలం పరిమిత సంఖ్యలోనే ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. జపాన్ గ్రామీణ ప్రాంతాల్లో విదేశీయులు నివాసం ఉండడం చాలా క్లిష్టమైన పని అని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఖాళీ ఇళ్ల సమస్య ఒక్క జపాన్కే పరిమితం కాలేదు. అమెరికా, ఐరోపా దేశాల్లో కూడా ఇలాగే ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.