Homeఅంతర్జాతీయంChina Weapons Failure: వరుస యుద్ధాలలో ఫ్లాప్ .. పనికిరానిసరికి సరుకు.. మేడ్ ఇన్ చైనాకు...

China Weapons Failure: వరుస యుద్ధాలలో ఫ్లాప్ .. పనికిరానిసరికి సరుకు.. మేడ్ ఇన్ చైనాకు మరక

China Weapons Failure: ప్రపంచ ఆయుధ మార్కెట్లో మూడో స్థానంలో ఉన్న చైనా, సరసమైన ధరలతో అనేక దేశాలను ఆకర్షిస్తోంది. కానీ ఇటీవల జరిగిన పలు యుద్ధ ఘట్టాల్లో డ్రాగన్‌ తయారీ ఆయుధాలు వరుసగా విఫలం కావడం, వాటి నాణ్యతపై తీవ్ర అనుమానాలను రేకెత్తించింది. మరోవైపు, ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ దిశగా సాగుతున్న భారత రక్షణ రంగం మాత్రం నాణ్యత, విశ్వసనీయతలతో ప్రపంచ మార్కెట్లో దూసుకుపోతోంది

చైనా ఆయుధాల వైఫల్యగాథలు
2025 మేలో జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌లో పాకిస్తాన్‌ రక్షణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. పాక్‌ వద్ద ఉన్న ఆయుధాల్లో 82 శాతం చైనా సరఫరా చేసినవే కావడం గమనార్హం. చునియన్‌ వైమానిక స్థావరంలోని చైనా తయారు చేసిన వైఎల్‌సీ–8ఈ ‘యాంటీ స్టెల్త్‌’ రాడార్‌ను భారత ఈఎల్‌ఎం–2090యూ గ్రీన్‌ పైన్‌ రాడార్లు, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సాంకేతికతలు పూర్తిగా స్తంభింపచేశాయి. 450 కి.మీ. దూరం నుంచి స్టెల్త్‌ విమానాలను పసిగట్టగలదని చైనా ఊదరగొట్టిన ఈ వ్యవస్థ, భారత జామింగ్‌ చర్యల ముందు నిష్ప్రయోజనమైంది. లాహోర్‌ సమీపంలో మోహరించిన హెచ్‌క్యూ–9 భూతలం నుంచి గగనతల క్షిపణి వ్యవస్థ, అనుసంధాన సమస్యలు, ఎలక్ట్రానిక్‌ దాడులను ఎదుర్కోవడంలో బలహీనత కారణంగా బ్రహ్మోస్‌ క్రూజ్‌ క్షిపణులను అడ్డుకోలేకపోయింది. పాక్‌ యుద్ధవిమానం ప్రయోగించిన చైనా తయారు చేసిన పీఎస్‌–15ఈ క్షిపణి లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. దాని రాకెట్‌ మోటార్‌ మరియు మార్గనిర్దేశక వ్యవస్థలో లోపాలు బయటపడ్డాయి.

వెనెజువెలాలో తుస్సు..
జనవరి 2026లో అమెరికా దళాలు వెనెజువెలా అధ్యక్షుడు నివాసంపై దాడి చేసినప్పుడు, చైనా నుంచి ఆ దేశం కొనుగోలు చేసిన 2 బిలియన్‌ డాలర్ల విలువైన గగనతల రక్షణ వ్యవస్థలు పూర్తిగా నిష్క్రియావస్థలో ఉన్నాయి. దాడికి ముందే 22 రాడార్లలో 60 శాతం పనిచేయడం లేదు. విడిభాగాల కొరత, తుప్పుపట్టడం, పవర్‌ సిస్టమ్‌ సమస్యలు ఇందుకు కారణాలు. అమెరికా ఈఏ–18జీ గ్రౌలర్‌ యుద్ధవిమానాల జామింగ్‌ చర్యల ధాటికి జేవై–27ఏ ‘మీటర్‌ వేవ్‌’ యాంటీ స్టెల్త్‌ రాడార్లు, ఏఈఎస్‌ఏ రాడార్లు స్తంభించిపోయాయి. హెచ్‌క్యూ–9, హెచ్‌క్యూ–12 క్షిపణి వ్యవస్థలు అమెరికా హెలికాప్టర్లను పసిగట్టడంలో లేదా అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి.

ఇరాన్‌ యుద్ధంలోనూ ఆయుధాల దుస్థితి
తాజా గల్ఫ్‌ యుద్ధంలో ఇరాన్‌ వాడిన చైనా ఆయుధ వ్యవస్థలు మరోసారి నిరాశపరిచాయి. రష్యా ఎస్‌–400 స్థాయిలో పనిచేస్తుందని చైనా నమ్మబలికిన హెచ్‌క్యూ–9బీ క్షిపణి వ్యవస్థలు, అమెరికన్‌ స్టెల్త్‌ విమానాలు, ఏజీఎం–158సీ ఎల్‌ఆర్‌ఎస్‌ఎం ఆయుధాలను అడ్డుకోలేకపోయాయి. ఈ వ్యవస్థల్లోని సీకర్లు, రెండు దశల మోటార్లు ఇజ్రాయెల్‌ ఏఎల్‌క్యూ–322 జామర్ల ధాటికి తట్టుకోలేకపోయాయి.

చైనా ఆయుధాల వైఫల్యానికి కారణాలు
రక్షణ నిపుణుల విశ్లేషణ ప్రకారం, చైనా ఆయుధాల వైఫల్యానికి ప్రధాన కారణాలు చైనా ఆయుధాలు విదేశీ డిజైన్లకు కాపీలు మాత్రమే. బాహ్య డిజైన్‌ను కాపీ చేయడం సులభమే కానీ, లోపల ఉండే క్లిష్టమైన సాఫ్ట్‌వేర్, అల్గారిథమ్‌లను పునరుత్పత్తి చేయడం చైనాకు సాధ్యపడలేదు. ఈ ఆయుధాలను వాస్తవ యుద్ధ పరిస్థితుల్లో సరిగ్గా పరీక్షించకపోవడం వల్ల, లోపాలు బయటపడలేదు. ఆధునిక ఎలక్ట్రానిక్‌ యుద్ధ విధానాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను వేగంగా అప్‌డేట్‌ చేయడంలో చైనా వెనుకబడి ఉంది. వెనెజువెలా వంటి దేశాల్లో విడిభాగాల సరియైన సరఫరా లేకపోవడం వల్ల వ్యవస్థలు నిష్క్రియావస్థలో పడిపోయాయి. అమెరికా ల్యాబ్‌లు, రక్షణ కాంట్రాక్టు సంస్థలపై సైబర్‌ దాడులు నిర్వహించి రహస్య డేటాను తస్కరించడం ద్వారా చైనా ఈ సాంకేతికతలను సముపార్జించిందన్న ఆరోపణలు ఉన్నాయి.

నాణ్యతకే భారత్‌ ప్రాధాన్యం..
చైనాకు భిన్నంగా, భారత్‌ నాణ్యత, విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఒకప్పుడు తన రక్షణ అవసరాల్లో 70 శాతాన్ని దిగుమతులపై ఆధారపడిన భారత్, ఇప్పుడు ఆత్మనిర్భరత దిశగా దూసుకుపోతోంది. గత దశాబ్దంలో భారత ఆయుధ ఎగుమతులు 30 రెట్లు పెరిగాయి. భారత సైనిక హార్డ్‌వేర్‌ 80కిపైగా దేశాలకు చేరుతోంది. 2029 నాటికి దాదాపు 50 వేల కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

చైనా ఆయుధాల వరుస వైఫల్యాలు, ‘చవకైతే చాలు‘ అనే విధానం ఎంత ప్రమాదకరమో చాటిచెప్పాయి. మరోవైపు, నాణ్యత, విశ్వసనీయతకు ప్రాధాన్యం ఇస్తూ, స్వదేశీ సాంకేతికతపై దృష్టి సారించిన భారత్, ప్రపంచ ఆయుధ ఉత్పత్తి హబ్‌గా ఎదుగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular