Mobile Health Tips: నేటి కాలంలో మొబైల్ ప్రతి ఒక్కరి అవసరంగా మారిపోయింది. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతిరోజూ వివిధ అవసరాల నిమిత్తం గంటల తరబడి ఫోన్ చూడాల్సి వస్తోంది. అయితే గంటల తరబడి ఫోన్‌ను వాడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా యువతలో మెడ నొప్పి, భుజాల నొప్పి, కీళ్ల సమస్యలు, వెన్నెముక సంబంధిత ఇబ్బందులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే మొబైల్ ను ఎలా చూస్తే ఆరోగ్య సమస్యలు ఉండవు? అందుకోసం ఏం చేయాలి?
సాధారణంగా మన తల బరువు 4 నుంచి 6 కిలోల వరకు ఉంటుంది. అయితే ఫోన్‌ను కిందికి వంచి చూస్తున్న కొద్దీ ఆ బరువు మెడపై మరింత పెరుగుతుంది. దాదాపు 60 డిగ్రీల కోణంలో తలను వంచి ఎక్కువసేపు ఫోన్ చూస్తే మెడ, వెన్నెముకపై సుమారు 22 నుంచి 27 కిలోల వరకు ఒత్తిడి పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒత్తిడి కారణంగా మెడ కండరాలు, వెన్నెముక డిస్క్‌లు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
ఎక్కువసేపు మొబైల్‌ను కిందికి చూసే అలవాటు వల్ల వచ్చే సమస్యను వైద్యులు టెక్స్ట్ నెక్ గా పేర్కొంటున్నారు. దీని వల్ల మెడ బిగుసుకుపోవడం, తలనొప్పి, భుజాల నొప్పి, చేతుల్లో తిమ్మిర్లు, వెన్ను నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. కొంతమందిలో ఇది దీర్ఘకాలిక సమస్యగా మారి రోజువారీ పనులపైనా ప్రభావం చూపుతుంది. కేవలం మెడ మాత్రమే కాదు.. నిరంతరం ఫోన్ పట్టుకుని ఉండటం వల్ల చేతి వేళ్లు, మణికట్టు, మోచేతుల కీళ్లపైనా ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా ఒకే చేత్తో ఎక్కువసేపు టైపింగ్ చేయడం, గేమ్స్ ఆడటం వల్ల కండరాలు బలహీనపడే అవకాశం ఉంది.
గంటల తరబడి మొబైల్ స్క్రీన్‌ను చూస్తే కళ్లు పొడిబారడం, మసకగా కనిపించడం, మంట, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. దీనిని డిజిటల్ ఐ స్ట్రెయిన్‌గా పిలుస్తారు. అందుకే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కనీసం 20 సెకన్ల పాటు సుమారు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడాలని వైద్యులు సూచిస్తున్నారు.
చిన్న వయసులోనే పిల్లలు, యువత గంటల తరబడి మొబైల్ వాడటం వల్ల భవిష్యత్తులో వెన్నెముక, మెడ సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చదువు లేదా వినోదం కోసం ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు నిరంతరాయంగా గంటలపాటు చూడకుండా మధ్య మధ్యలో విరామం తీసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.