Credit Card Bill ప్రస్తుత కాలంలో చాలామందికి ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉన్నాయి. వీటితో ఒక రకంగా ఆర్థిక భరోసా.. అనిపించినా.. వీటిని సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతే అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదముంది. అయితే కొంతమంది వినియోగదారులు ముందస్తుగా డబ్బు అందుబాటులో ఉందని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ తరువాత బిల్లు చెల్లించే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ బిల్లు చెల్లించే సమయంలో Minimum Payment Due అనే ఆప్షన్ ను ఎంచుకుంటున్నారు. కానీ ఇది తాత్కాలికంగా ఉపశమనం అనిపించినా.. ఆ తరువాత అనేక ఆర్థిక కష్టాల్లో దించుతుంది. అసలు ఈ మినిమం పేమెంట్ డ్యూ అంటే ఏమిటీ? అవుట్ స్టాండింగ్ డ్యూ అంటే ఏమిటీ? ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి? మొత్తగా క్రెడిట్ కార్డు వాడుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
క్రెడిట్ కార్డు బిల్లు జనరేట్ అయిన తరువాత వచ్చి బిల్లులో Minimum Payment Due అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇది మొత్తం బిల్లులో 5 నుంచి 10 శాతం వరకు ఉంటుంది. ఇది తక్కువగా ఉందని చాలా మంది అవగాహన లేకుండా దీనినే ఎంచుకుంటారు. బ్యాంకులు లేదా కార్డు సంస్థలు వినియోగదారులకు తాత్కాలిక నగదు ఇబ్బందులు వచ్చినప్పుడు కార్డు ఖాతా డిఫాల్ట్ కాకుండా ఉండేందుకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తాయి. అంటే ఒక నెలలో పూర్తి బిల్లు చెల్లించలేని పరిస్థితి ఉంటే కనీస మొత్తాన్ని చెల్లించి ఖాతాను యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. కానీ ఇది అప్పు తీర్చినట్లుగా కాదు. ఎందుకంటే ఇందులో వడ్డీతో పాటు ఇతర ఛార్జీలు కూడా విధిస్తారు. కానీ ఈఎంఐగా పరిగణించబడదు.
క్రెడిట్ కార్డుల వార్షిక వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని కార్డుల్లో ఇది సంవత్సరానికి 30 నుంచి 45శాతం వరకు ఉండొచ్చు. మీరు నెలనెలా కేవలం మినిమమ్ పేమెంట్ మాత్రమే చేస్తే, వడ్డీపై వడ్డీ చేరి అప్పు ఊహించిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది. చివరకు అసలు ఖర్చు చేసిన మొత్తానికి మించి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అయితే క్రెడిట్ కార్డు బిల్లులో ఉండే అవుట్‌స్టాండింగ్ బిల్లు మాత్రమే చెల్లించాలి. ఇది కూడా డ్యూ డేట్‌లోపు చెల్లిస్తే సాధారణంగా కొత్త కొనుగోళ్లపై వడ్డీ ఉండదు. కానీ కేవలం మినిమమ్ పేమెంట్ మాత్రమే చేస్తే, మిగిలిన మొత్తం మీద అధిక వడ్డీ విధిస్తారు. అందువల్ల క్రెడిట్ కార్డు లో అవుట్ స్టాండింగ్ బిల్లు ను మాత్రమే చెల్లించాలి. లేకుండా క్రెడిట్ కార్డు వాడడమే మానుకోవాలి.
క్రెడిట్ కార్డు బిల్లును వీలైనంత వరకు డ్యూ డేట్‌లోపు పూర్తిగా చెల్లించాలి. అవసరమైతే ఆటోపే సదుపాయం ఉపయోగించాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మినిమమ్ పేమెంట్‌ను ఉపయోగించాలి. నెలవారీ ఆదాయానికి మించి కార్డు ఖర్చులు చేయకూడదు. ప్రతి నెల స్టేట్‌మెంట్‌ను పరిశీలించి అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి.