Jana Sena : ఏపీలో జరిగిన ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీతో విడిపోయి పోటీ చేసిన జనసేనకు సూపర్ విక్టరీ దక్కింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. అయితే ఇవేవో సాధారణ ఎన్నికలకు కాదు. రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ కార్మిక సంఘాల ఎన్నికలు. త్రిముఖ పోరులో జనసేన, ఏఐటీయూసీ, ఎఫ్ఐటియు యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పడి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే రాష్ట్రంలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న జనసేన, టిడిపిలు విడివిడిగా పోటీ చేయడం హార్ట్ టాపిక్ అవుతోంది.
* వైసిపి, టిడిపి లకు వెనక్కి నెట్టి..
ఆంధ్ర పేపర్ మిల్ కార్మిక సంఘాల ఎన్నికలు జరిగాయి. జనసేన కూటమికి 258 ఓట్లు వచ్చాయి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యూనియన్ కు 228 ఓట్లు రాగా.. టిడిపికి చెందిన టిఎన్టియుసికి 220 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచింది. వైయస్సార్ కాంగ్రెస్ తో పాటు టిడిపిలను వెనక్కి నెట్టి ఘన విజయం అందుకుంది జనసేన. ఈ విజయం అనంతరం జనసేన నేతలు సంబరాలు చేసుకున్నారు.
* జనసేన సంబరాలు..
ఆంధ్ర పేపర్ మిల్ కార్మిక సంఘాల ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన జనసేన నాయకులకు రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అభినందనలు తెలిపారు. అయితే కూటమి పార్టీల నేతలు ఇలా విడివిడిగా పోటీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసి గెలిచిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు కార్మిక సంఘాల ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇదే ఫార్ములాను అనుసరిస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.