AI Impact On Jobs: ఇప్పటికే ఆర్థిక సంక్షోభం కారణంగా ఐటీ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి సారించాయి. ఇక ఇప్పుడు ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్) ఐటీ సంస్థలతోపాటు అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. విద్య, వైద్యం, ఐటీతోపాటు వ్యవసాయ, మార్కెట్, మీడియా రంగాలను ప్రభావితం చేస్తోంది. దీంతో ఎవరి ఉద్యోగాలకు గ్యారెంటీ ఉండడం లేదు. గోల్డ్‌మన్ సాచ్స్ తాజా నివేదిక భారతదేశ వ్యవసాయేతర ఉద్యోగ మార్కెట్‌పై జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇది భయాలను తగ్గిస్తూనే, కొన్ని రంగాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
ప్రధాన అంచనాలు ఇవీ…
గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం, భారతదేశంలోని వ్యవసాయేతర ఉద్యోగాల్లో 8–12 శాతం జనరేటివ్‌ర్టిఫీషియల్‌ంటెలిజెన్స్ ద్వారా భర్తీ కావడానికి అవకాశం ఉంది. అంటే ఈ ఉద్యోగాల్లోని పనులను యంత్రాలు చేయగలవు. అయితే 42–48 శాతం ఉద్యోగులకు జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయకారిగా పనిచేస్తుంది. వారి పని సులభం అవుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది. మిగిలిన ఉద్యోగాలు ఎక్కువగా ప్రభావితం కావు. జెనరేటివ్ ఏఐ ప్రస్తుతం చేస్తున్న పనుల్లో 9–17 శాతం వరకు చేయగలదని కూడా అంచనా.
ఈ రంగాల్లో ఉద్యోగులపై ప్రభావం..
టెలికామ్, కస్టమర్ కేర్, డేటా ఎంట్రీ, క్లరికల్ సపోర్ట్, పోస్టల్ సర్వీసెస్ వంటి రంగాల్లో ప్రమాదం ఎక్కువ. ఇక్కడ రొటీన్, డాక్యుమెంటేషన్, కస్టమర్ సపోర్ట్ పనులు ఎక్కువగా ఉండటం వల్ల జనరేటివ్ ఏఐ వాటిని సులభంగా చేయగలదు. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోని కొన్ని బ్యాక్–ఆఫీస్ పనులు కూడా ప్రభావితం కావచ్చు. ఈ రంగాల్లో పనిచేసేవారు నైపుణ్యాలను మార్చుకోవాల్సి ఉంటుంది. కేవలం డేటా ఎంట్రీ లేదా ప్రాథమిక కస్టమర్ సపోర్ట్‌పై ఆధారపడిన ఉద్యోగాలు కష్టంలో పడే అవకాశం ఉంది.
ఈ రంగాల్లో పని ఈజీ..
హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రొఫెషనల్ సర్వీసెస్ వంటి రంగాల్లో జెనరటివ్ ఏఐ ఎక్కువగా సహాయపడుతుంది. డాక్టర్లు, ఉపాధ్యాయులు, అనలిస్టులు, కంటెంట్ క్రియేటర్లు రొటీన్ పనులను అఐకి అప్పగించి, మరింత ముఖ్యమైన నిర్ణయాలు, సృజనాత్మక పనులపై దృష్టి పెట్టవచ్చు. ఇది ఉత్పాదకతను పెంచుతుంది. భౌతిక శ్రమ అవసరమైన నిర్మాణం, క్రాఫ్ట్, మెషిన్ ఆపరేటర్లు వంటి ఉద్యోగాలు ఏమాత్రం ప్రభావితం కావు. కొన్ని సందర్భాల్లో డిమాండ్ కూడా పెరుగుతుంది.
భయం వద్దంటున్న నిపుణులు..
గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక జనరేటివ్ ఏఐ కారణంగా పూర్తిగా ఉద్యోగాలు అంతరించిపోయే పరిస్థితి రాదని చెబుతోంది. పని స్వభావం మాత్రమే మారుతుంందని పేర్కొంటోంది. రొటీన్ పనులు తగ్గి, ఉన్నత స్థాయి నైపుణ్యాలు, సృజనాత్మకత, మానవ సంబంధాలు మరింత విలువైనవి అవుతాయి. ఉత్పాదకత పెరగడంతో దీర్ఘకాలంలో కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగతాయని నివేదిక వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా ఉద్యోగులు నైపుణ్యాలు నేర్చుకోవాలి, కంపెనీలు శిక్షణ ఇవ్వాలి, ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఏఐకి అనుగుణంగా మార్చాలి. డేటా సెంటర్లు, విద్యుత్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి మౌలిక సదుపాయాలు కూడా ముఖ్యం.
జెనరేటివ్ ఏఐ ఒక సాధనం. దాన్ని సరిగా ఉపయోగించుకుంటే పని సులభం అవుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే కొన్ని రంగాల్లో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మనది యువ జనాభా ఎక్కువగా ఉన్న దేశం. యువత సరైన నైపుణ్యాలతో ఈ మార్పును అవకాశంగా మార్చుకోవచ్చు.