నటీనటులు: జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, మోహన్ బాబు, కిక్ శ్యామ్, నరేష్, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు
సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: జయకృష్ణ గుమ్మడి
ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్లపల్లి
దర్శకత్వం: అజయ్ భూపతి
నిర్మాణం: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, చందమామ కథలు పిక్చర్స్
పెద్ద సినిమా కుటుంబాల నుంచి ఎవరైనా వారసుడు తెరంగేట్రం చేస్తున్నాడంటే అటు మీడియాలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ కొంత ఆసక్తి ఉంటుంది. మరోవైపు ఎప్పుడూ వారసులేనా అంటూ నొసలు చిట్లించే వారు కూడా ఉంటారు. ఇదంతా సహజంగా జరిగేదే. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్నయ్య కొడుకు అయిన జయకృష్ణ తాజాగా శ్రీనివాస మంగాపురం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి హిట్ ఫిల్మ్స్ అందించిన అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకుడు కావడంతో ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ సినిమాలో మరో ఆకర్షణ మునుపటి తరం బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం. సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా ఒక కీలకమైన పాత్రలో నటించడం కూడా ఆసక్తి పెంచే అంశమే. ఇన్ని ఆకర్షణలున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
సినిమా అంతా దాదాపుగా తిరుపతి నేపథ్యంలో సాగుతుంది. శ్రీను (జయకృష్ణ) తిరుపతికి కొత్తగా వచ్చిన యువకుడు. ఎక్కువ టైమ్ తీసుకోకుండా తొలిచూపులోనే మంగ(రాషా)ను ప్రేమిస్తాడు. మంగ ఏమీ సాధారణ మధ్యతరగతి అమ్మాయి కాదు. ఆ ఊర్లో పేరుమోసిన పెద్దిరెడ్డి(శ్యామ్) కూతురు. మొదట్లో శ్రీనుని పట్టించుకోదు కానీ మెల్లిగా శ్రీనుతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ప్రేమను మాత్రం పంచదు.. ప్రేమించదు. ఇంతలో తనకు వేరే సంబంధం ఫిక్స్ చేస్తారు, ఎంగేజ్మెంట్ కూడా చేస్తారు. కానీ శ్రీను మాత్రం పట్టువిడవకుండా ‘మంగ నాదే.. మంగ నాదే’ అంటూ తన ప్రయత్నాలు తాను చేస్తుంటాడు. ఈ ప్రేమ కథలో కొంత యాక్షన్ కూడా ఉండాలి కాబట్టి మధ్యలో గట్టిగా ఫైట్లు చేస్తుంటాడు. అసలు శ్రీను ఎవరు? ఎందుకు అంతగా ఎందుకు మంగ వెంటపడుతున్నాడు? శ్రీను నేపథ్యం ఏంటి? వెంకటప్పయ్య నాయుడు(మోహన్ బాబు) ఎవరు? ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంతా పూర్తయ్యేసరికి శ్రీను తన ప్రేమను గెలుచుకున్నాడా అనేది మిగతా కథ.
అజయ్ భూపతి స్టైల్లో ఈ సినిమా ఆసక్తికరంగానే స్టార్ట్ అవుతుంది. కానీ ఇరవై నిముషాలు గడిచేసరికి.. “హీరో ఎంట్రీ.. కొత్త ఊరికి రావడం.. ఒక కమెడియన్ పరిచయం కావడం.. హీరోయిన్ ఎంట్రీ.. పాట..ఫయిటూ.. నాలుగు డైలాగులు.. మళ్ళీ పాట.. ఫైటు.. ఒక ట్విస్టు.. మళ్ళీ పాట.. ఫైటు” ఆనే పురాతన కమర్షియల్ ఫార్మాట్ లోకి మారిపోతుంది. విజువల్స్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, ఒకటి రెండు పాటలు బానే ఉన్నాయి అనుకుని కొంచెం రిలాక్స్ అయ్యే లోపు మళ్ళీ ఫైటు.. మళ్ళీ పాట వేసుకోవడంతో సినిమా ఏ దిశగా వెళ్తుందో వెంటనే అర్థం అవుతుంది. ఇంటర్వల్ టైమ్ లో వాసుకి పాత్ర రాగానే కాస్త సస్పెన్స్ బిల్డ్ అవుతుంది.. అయితే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికి మళ్ళీ నీరసం వస్తుంది. హీరో.. హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ బాగానే ఉన్నట్టు అనిపించినా అసందర్భపు పాటలు చిరాకు పెడతాయి. మోహన్ బాబు గెటప్, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఎమోషనల్ కనెక్ట్ మిస్ కావడంతో ప్రేక్షకులు ఎక్కడా సినిమాను ఆస్వాదించే పరిస్థితి ఉండదు.
రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ ఎంచుకోవడమే ఈ సినిమాకు మైనస్ అయింది. ముఖ్యంగా అన్ని పాటలు చూసే ఓపిక ఇప్పటి జనాలకు లేదు, పైగా కొన్ని పాటలకు ప్లేస్ మెంట్ కుదరలేదు. పాటలు, ఫైట్ల మధ్యలో స్టోరీకి ఊపిరాడక నలిగిపోయింది. సినిమాలో మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ, శ్యామ్.. ఇలా మంచి నటీనటులు ఉన్నప్పటికీ వారిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు దర్శకుడు. ప్రేక్షకులకు నరేష్, బ్రహ్మాజీల కామెడీ ట్రాక్ అత్యంత పురాతనమైనదని అనిపిస్తే అందుకు ప్రేక్షకులను తప్పు పట్టాల్సిన పనే లేదు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది, పాటలు రెండు బాగానే ఉన్నాయి. మిగతావి సినిమాకు పూర్తిగా అనవసరం. ఇక జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ ఈ సినిమా లో మరో అరగంట ట్రిమ్ చేస్తే ప్రేక్షకుల నెత్తిన పాలు పోసినవాడు అయ్యేవాడు.
డెబ్యూ హీరో స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. యాక్షన్ సీన్స్ లో డ్యాన్స్ లో మంచి మార్కులే తెచ్చుకున్నాడు కానీ యాక్టింగ్ విషయంలో మరికొంత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. రాషా కూడా ఓకే. ఇక సినిమాలో ఆకట్టుకునేది మాత్రం మోహన్ బాబు. కిక్ శ్యామ్ పాత్ర కూడా కొంతమేరకు ఇంప్రెసివ్ గా ఉంది. మిగతా నటులు తమకు అలవాటైన రీతిలో చేసుకుంటూ పోయారు.
సినిమాలో ఏం బాగున్నాయో తెలుసా?
1. జీ. వి. ప్రకాష్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
2. సినిమాటోగ్రఫీ
సినిమాలో బాగలేనివి ఇవి:
1. అరిగిపోయిన కమర్షియల్ ఫార్మాట్
2. ఎమోషనల్ కనెక్ట్ మిస్ కావడం
3. అనవసరమైన పాటలు
రేటింగ్: 1.75/5
ఫైనల్ వర్డ్: రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ అంటే పడి చచ్చేవాళ్ళు, ఇరవై ముప్పై ఏళ్ల క్రితం రిలీజ్ అయిన డెబ్యూ హీరోల సినిమాలను ఆస్వాదించే వాళ్ళు భేషుగ్గా వెళ్ళండి. మీకు జాక్ పాట్.