Jilebi Fish : మనం తినే ఆహారంలో చేపలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇందులో పోషకాలతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వంటివి ఉంటాయి. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన విటమిన్లు లభిస్తాయి. అయితే అన్ని రకాల చేపలు ఒకే స్థాయిలో పోషకాలను అందించవు. కొన్ని చేపలు చాలా ఖరీదుగా ఉన్నా.. ఇందులో పెద్దగా పోషకాలు ఉండవు. మరికొన్ని తక్కువ ధరకే లభిస్తున్న ఇందులో కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అయితే కొన్ని చేపలు తక్కువ ధరను కలిగి ఉన్నా.. ఇందులో అత్యధిక పోషకాలు లభిస్తాయి. అలాంటి చేప ఏదో చూద్దాం..
సాధారణంగా ఖరీదైన చేపలతో పోలిస్తే తక్కువ ధరకే లభించే చేపల్లో జిలేబి చేప ఒకటి. దీనిని అన్ని వర్గాల ప్రజలు సులభంగా కొనుగోలు చేయగలుగుతారు. ధర తక్కువగా ఉన్నప్పటికీ ఇందులో ఉండే పోషక విలువలు మాత్రం ఎంతో అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. చాలా మంది చేపలు తినడానికి వెనుకాడే ప్రధాన కారణం ముళ్లు. అయితే జిలేబీ చేపలో ముళ్లు తక్కువగా ఉంటాయి. దీంతో పిల్లలు, వృద్ధులు కూడా సులభంగా తినగలుగుతారు.
జిలేబీ చేపలో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ లభిస్తుంది. ఇది కండరాల నిర్మాణానికి, శరీర కణాల మరమ్మతుకు ఎంతో ఉపయోగపడుతుంది. వ్యాయామం చేసే వారు, పిల్లలు, వృద్ధులకు ఇది కావాల్సిన ప్రోటీన్ ను అందిస్తుంది. జిలేబీ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తాయి. ఇదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడతాయి.
ఇందులో అదనంగా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల మెదడు అభివృద్ధికి, వృద్ధుల్లో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇవి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ చేపలో కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రించాలనుకునేవారికి ఇది మంచి ఆహారంగా భావిస్తారు.
అయితే చేపలను ఎప్పుడూ తాజాగా ఉన్నవే కొనుగోలు చేయాలి. పూర్తిగా ఉడికించి తినడం మంచిది. అధిక నూనెలో డీప్ ఫ్రై చేయకుండా, తక్కువ నూనెతో లేదా కూర రూపంలో వండితే పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. అలాగే పరిశుభ్రమైన ప్రదేశాల నుంచి కొనుగోలు చేసిన చేపలనే ఉపయోగించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.ఈ చేపను మార్కెట్లో కిలోకు రూ. 100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు.