Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం.. మెగా బ్రదర్స్ ట్విట్.. రంగంలోకి అభిమానులు
సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. చిన్న, పెద్ద హీరోలు అని లేకుండా అందరూ.. ఈ ప్రమాదంలో మృతి చెందినవారికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంతో యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి గురైంది. ఘటనపై దేశ ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గతరాత్రి బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 278 మంది మృత్యువాత పడ్డారు. 1000 మందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు. దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం ఇది. రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఒక గూడ్సు రైలు ఢీకొన్నాయి. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పెద్దఎత్తున రక్తం అవసరం కావడంతో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారు.
సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. చిన్న, పెద్ద హీరోలు అని లేకుండా అందరూ.. ఈ ప్రమాదంలో మృతి చెందినవారికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ .. ఈ ఘటనపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా తీవ్ర దిగ్బ్రాంతికి గురైన ట్లు తెలిపారు. ‘శుక్రవారం రాత్రి ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ సమీపంలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసింది. 278 మంది ప్రయాణీకులు ఈ దుర్ఘటనలో మృత్యువాతపడటం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు – హౌరా సూపర్ ఫాస్ట్ రైళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత ప్రయాణీకులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను’ అంటూ పవన్ ట్విట్ చేశారు. ఈ ట్విట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ప్రమాదంపై మెగాస్టార్ చిరంజీవి సైతం స్పందించారు. క్షతగాత్రులకు అవసరమైన రక్తదానం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. ట్విట్టర్ వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ‘ఒడిశాలో జరిగిన విషాదకరమైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం, దాని వల్ల జరిగిన భారీ ప్రాణ నష్టం గురించి విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించేందుకు భారీగా రక్త యూనిట్‌లు అవసరం ఉందని నేను అర్థం చేసుకున్నాను. సాధ్యమైనంత వరకు వెంటనే రక్త యూనిట్‌లని అందించాలని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు పెద్దఎత్తున రక్తాన్ని సేకరిస్తున్నారు. ఒడిశా ఆస్పత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
