KKR Vs DC: ఐపీఎల్ 17వ సీజన్లో ఇటీవల పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలైన కోల్ కతా.. వెంటనే సక్సెస్ ట్రాక్ ఎక్కింది. సోమవారం రాత్రి ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఏడ వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అన్ని రంగాలలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి.. ఢిల్లీ జట్టును మట్టికరిపించింది. తక్కువ పరుగులు నమోదైన ఈ మ్యాచ్లో..కోల్ కతా సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్ లో గెలుపు ద్వారా కోల్ కతా పాయింట్ల పట్టికలో రెండవ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కొంతమంది విస్మరించిన ఒక అంశం నెట్టింట ఆసక్తికరంగా మారింది..
ఈ మ్యాచ్లో కోల్ కతా జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ఢిల్లీ ఆటగాళ్లు ఏదో అర్జెంటు పని ఉందన్నట్టుగా ఇలా మైదానంలోకొచ్చి అలా వెళ్ళిపోయారు.. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు ఢిల్లీ 153 రన్స్ మాత్రమే చేసింది. ఢిల్లీ జట్టులో కులదీప్ యాదవ్ చేసిన 35 రన్స్ హైయెస్ట్ స్కోరంటే.. ఢిల్లీ ఆటగాళ్ల బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు, హర్షిత్ రాణా, వైభవ్ ఆరోరా రెండు వికెట్లు దక్కించుకున్నారు. 154 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా జట్టుకు ఓపెనర్ సాల్ట్ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. దీంతో కోల్ కతా జట్టు సులువుగా విజయాన్ని అందుకుంది.
అయితే ఈ మ్యాచ్ లో ఒక ఆసక్తికర సందేశం జరిగింది. ఢిల్లీ ఇన్నింగ్స్ సాగుతున్న క్రమంలో హర్షిత్ రాణా ఏడవ ఓవర్ వేసేందుకు మైదానంలోకి వచ్చాడు. ఈ ఓవర్ లో నాలుగవ బంతికి అభిషేక్ పోరెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం హర్షిత్ తన స్టైల్ లో ఫ్లయింగ్ కిస్ వేడుక జరుపుకోవాలని భావించాడు. కానీ, అలా చేయబోయి ఆగాడు. ఇదే టోర్నీలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ ను ఔట్ చేసి హర్షిత్ అలానే ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దీంతో స్పందించిన మ్యాచ్ రిఫరీ హర్షిత్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించాడు. దీంతో ఈ మ్యాచ్లో అలా చేస్తే మళ్లీ అలాంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి సైలెంట్ అయిపోయాడు. దీంతో కోల్ కతా ఆటగాడు హర్షిత్ భయపడ్డాడని నెట్టింట చర్చ జరుగుతోంది.
Bro was about to give a flying kiss #harshitrana #KKRvsDC pic.twitter.com/CViyZguGz1
— vishnu sharma (@vishnu978sharma) April 29, 2024