T20 World Cup: టీ – 20 వరల్డ్ కప్ నకు అన్ని జట్లు తమ ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా కూడా తమ 15 మంది ఆటగాళ్ల బృందం వివరాలను వెల్లడించింది. రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించింది. 2022 టీ -20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ లో భారత్ ఓడిపోయింది. అప్పటి వరల్డ్ కప్ లో ఆడిన 8 మంది ఆటగాళ్లు.. ప్రస్తుత జట్టులోనూ స్థానం సంపాదించుకున్నారు. యశస్వి జైస్వాల్, శివం దుబే వంటి వారు తొలిసారిగా ఈ కప్ లో చోటు దక్కించుకున్నారు. ఇక విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆడుతున్న కప్ ఎనిమిదవది. 2007లో టి20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న రోహిత్ శర్మకు.. ఇది తొమ్మిదవ టి20 వరల్డ్ కప్. అప్పుడు ఆటగాడిగా ఉన్న అతను.. ఇప్పుడు భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.. సంజు సాంసన్, రిషబ్ పంత్ వంటి వారు అవకాశాలను దక్కించుకున్నారు. రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్ వంటి వారు స్పిన్ బౌలింగ్, అర్ష్ దీప్ సింగ్, సిరాజ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ భారాన్ని మోస్తారు.
2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ప్రారంభ టి20 వరల్డ్ కప్ ను భారత జట్టు గెలుచుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు మరో టి20 వరల్డ్ కప్ భారత్ సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి, ట్రోఫీ దక్కించుకోవాలని భావిస్తోంది. ఈ ట్రోఫీలో భాగంగా న్యూయార్క్ వేదికగా భారత్ జూన్ 5న ఐర్లాండ్ జట్టుతో తలపడుతుంది. జూన్ 9న పాకిస్తాన్ జట్టుతో ఆడుతుంది. జూన్ 12న న్యూయార్క్ వేదికగా అమెరికాతో తలపడుతుంది. జూన్ 15న ఫ్లోరిడావేదికగా కెనడా జట్టుతో ఆడుతుంది.
ఇదీ భారత్ ప్రస్థానం
2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారత్ విజేతగా ఆవిర్భవించింది.
2009లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశ వరకు వెళ్లింది.
2010లో వెస్టిండీస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో సూపర్ 8 లోనే నిష్క్రమించింది.
2012లో శ్రీలంక వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశలోనే భారత్ ప్రయాణం ఆగిపోయింది.
2014లో బంగ్లాదేశ్ వేదికగా జరిగిన టీ – 20 వరల్డ్ కప్ లో భారత్ రన్నరప్ గా నిలిచింది.
2016లో మన దేశం వేదికగా టి20 వరల్డ్ కప్ జరగగా.. భారత జట్టు సెమీఫైనల్ లో ఇంటిదారి పట్టింది.
2021లో ఓమన్ దేశం వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో సూపర్ 12 దశలోనే ఇంటిదారి పట్టింది.
2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు సెమిస్ లో ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఇక ఇప్పటివరకు టీమిండియా 44 టీ – 20 మ్యాచ్ లు ఆడింది. 27 మ్యాచ్ లలో గెలుపొందింది. 15 మ్యాచ్ లు ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై గా, మరో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది.
టీమిండియా తరఫున టీ20 ల్లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పటివరకు 27 మ్యాచ్ లు ఆడిన విరాట్ కోహ్లీ.. 1,441 పరుగులు చేశాడు. ఇతడి అత్యధిక స్కోరు 89 పరుగులు. ఇతడి ఖాతాలో 14 అర్థ సెంచరీలు ఉన్నాయి.
విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.. 39 మ్యాచ్ లు ఆడిన రోహిత్.. 963 రన్స్ చేశాడు. ఇతడి అత్యధిక స్కోరు 79.. ఇతడి పరుగుల జాబితాలో 9 అర్థ సెంచరీలు ఉన్నాయి.
యువరాజ్ సింగ్ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. 31 మ్యాచ్ లు ఆడిన ఈ పంజాబీ ఆటగాడు.. 593 రన్స్ చేశాడు. అత్యధిక స్కోరు 70.. ఇతడి ఖాతాలో 4 అర్థ సెంచరీలు ఉన్నాయి..
యువరాజ్ తర్వాత నాలుగో స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొనసాగుతున్నాడు. ఇతడు 33 మ్యాచ్ లు ఆడి 529 రన్స్ చేశాడు. ఇతడి అత్యధిక స్కోరు 45.
ధోని తర్వాతి స్థానంలో గౌతమ్ గంభీర్ కొనసాగుతున్నాడు. 21 మ్యాచ్ లు ఆడిన ఈ ఆటగాడు.. 524 రన్స్ చేశాడు. ఇతడి ఖాతాలో నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి.
ఇక బౌలర్ల విషయానికొస్తే.. రవిచంద్రన్ అశ్విన్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. 24 మ్యాచ్ లు ఆడి 32 వికెట్లు పడగొట్టాడు. ఇతడి అద్భుతమైన ప్రదర్శన 4/11. అశ్విన్ తర్వాత స్థానంలో రవీంద్ర జడేజా ఉన్నాడు. 22 మ్యాచ్ లు ఆడి 21 వికెట్లు తీశాడు. 3/14 ఇతడి అత్యుత్తమైన ప్రదర్శన. జడేజా తర్వాత హార్భజన్ సింగ్ మూడో స్థానంలో ఉన్నాడు. 19 మ్యాచ్ లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. 4/12 ఇతడి అత్యుత్తమ ప్రదర్శన.. ఇర్ఫాన్ పఠాన్ హర్భజన్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. 15 మ్యాచ్ లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు..3/16 టీ – 20 వరల్డ్ కప్ లో ఇర్ఫాన్ అత్యుత్తమమైన ప్రదర్శన. ఆఫీస్ నెహ్రా పది మ్యాచ్ లు ఆడి.. 15 వికెట్లు తీశాడు. 3/19 ఇతడి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.