Rythu Bandhu: అధికార యంత్రాంగం నిర్లక్ష్యం తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక రైతుబంధు చెల్లింపులు ఆలస్యమయ్యాయి. యాసంగి సీజన్‌కు సంబంధించిన చెల్లింపులు మొన్నటి వరకు జరిగాయి. అయితే కొంతమంది రైతుల డబ్బులు వారి ఖాతాల్లో జమ కాకుండా.. తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోనే వచ్చి పడుతున్నాయి. దీనిపై రైతులు మండిపడుతున్నారు.
19 వేల మంది దూరం..
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారమే.. తెలంగాణలో 19 వేల మంది రైతులకు యాసంగిలో పెట్టుబడి సాయం అందలేదు. ప్రభుత్వం వారికి చెల్లించినా బ్యాంకుల వరకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చాయి. ఇప్పటికే చాలా మందికి రైతుబంధు అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో వచ్చిన డబ్బులు వెనక్కి వెళ్తున్నాయని తెలియడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
అధికారుల తప్పిదంతో..
వ్యవసాయ శాఖ అధికారుల తప్పిదంతో ఈ పరిస్థితి నెలకొందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంటి పేర్లు, రైతుల పేర్లు తప్పుగా రాయడం, బ్యాంకు ఖాతాల నంబర్లు సరిచూసుకోకుండా తప్పులు దొర్లడం వంటి కారణాలతో రైతుల ఖాతాలకు పంపిన డబ్బులు వెనక్కి వస్తున్నట్లు గుర్తించారు. ఒక్క అక్షరం తప్పుగా వచ్చినా బ్యాంకులు తిరిగి వెనక్కి పంపుతున్నాయి.
కొందరి ఖాతాలు ప్రీజ్..
ఇక మరికొంతమంది రైతుల ఖాతాలు ఫ్రీజ్ కావడం, ఖాతాదారులు డీఫాల్టర్లుగా మారడం, కొందరి ఖాతాలు క్లోజ్ కావడం, రుణాలు రెన్యువల్ చేసుకోవడంతో పాత ఖాతాలు పోయి కొత్త ఖాతాలు రావడం, పాత ఖాతాల వివరాలే వ్యవసాయ శాఖ వద్ద ఉండడం కూడా రైతుబంధు సొమ్ము వెనక్కి వెళ్లడానికి కారణంగా భావిస్తున్నారు. ఈ విషయమై వ్యవసాయ అధికారులకు రైతులు ఫిర్యాదు చేస్తున్నా.. స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు బ్యాంకులతో వ్యవసాయ శాఖ సమన్వయం చేయకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐదెకరాలకే పరిమితం..
ఇదిలా ఉంటే.. రైతుబంధు సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగిలో 5 ఎకరాలకే పరిమితం చేసింది. గతంలో భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతులందరికీ పెట్టుబడి సొమ్ము చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే సాయం అందించింది. కొందరు రైతులు తమకు ఐదెకరాలే ఉన్నా పెట్టుబడి అందలేదని పేర్కొంటున్నారు. గత వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం.. రైతుబంధు సొమ్ము తీసుకున్న రైతులు 68.99 లక్షల మంది ఉన్నారు. ఈ లెక్క ప్రకారం యాసంగిలో 1.52 కోట్ల ఎకరాలకు రూ.7,625 కోట్లు విడుదల చేయాలి. కానీ, ఐదు ఎకరాలకు పరిమితం చేసి కేవలం రూ.5,202 కోట్లు మాత్రమే చెల్లించింది.