T20 World Cup 2024: మొత్తానికి టి20 వరల్డ్ కప్ కు భారత క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. ఊహాగానాలకు తెర దించుతూ.. 15 మంది ఆటగాళ్లతో జాబితాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు పంపించింది. వాస్తవానికి వేగమే కొలమానంగా, దూకుడే పర్యాయపదంగా ఉండే టి20 క్రికెట్లో భారత జట్టు కూర్పు ఆశించినంత స్థాయిలో ఉందా? ఈ 15 మంది ఆటగాళ్లతో భారత జట్టు కప్ గెలుచుకుంటుందా? ఈ కథనంలో తెలుసుకుందాం.
రోహిత్ శర్మ
హిట్ మ్యాన్ కెప్టెన్ గా వ్యవహరించిన ఐసీసీ మెగాటోర్నీలలో భారత జట్టు కప్ లు గెలిచిన దాఖలాలు లేవు. గత ఏడాది స్వదేశంలో జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకు జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లోనూ ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓడిపోయింది. వన్డే వరల్డ్ కప్ ఓటమికి బదులు తీర్చుకుంటుందనుకుంటే.. భారత జట్టు ఆస్ట్రేలియా ముందు దాసోహం అయింది. ఇవి మాత్రమే కాకుండా గత ఏడాది నిర్వహించిన టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో భారత జట్టు అత్యంత దారుణంగా ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అప్పుడు కూడా రోహిత్ శర్మ భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఇక ప్రస్తుత ఐపీఎల్లో రోహిత్ శర్మ ప్రదర్శన ఆశించినంత స్థాయిలో లేదు. టి20 లో హైయెస్ట్ స్కోర్ కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మకు పేరు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం అతడి వయసు 37.. వెస్టిండీస్, అమెరికా మైదానాల మీద అతడు ఏ స్థాయిలో రాణిస్తాడనేది చూడాల్సి ఉంది.
యశస్వి జైస్వాల్
ఈ యు ఆటగాడు ఐపీఎల్ లో ఒకటి రెండు మ్యాచ్ లు మినహా మిగతా వాటిలో పెద్దగా రాణించలేదు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో చివరి రెండు టెస్ట్ ల్లో అతడు సత్తా చూపించాడు. దానినే కొలమానంగా తీసుకుంటే ప్రస్తుత ఐపీఎల్ లో మయాంక్ యాదవ్ అదరగొడుతున్నాడు. వేగవంతమైన బంతులు వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అలాంటప్పుడు అతడిని ఎందుకు దూరం పెట్టారో బీసీసీఐ సెలక్టర్ లకే తెలియాలి.
విరాట్ కోహ్లీ
రన్ మిషన్ గా పేరుగాంచిన ఈ ఆటగాడు
ఐపిఎల్ సీజన్లో అదరగొడుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ విభాగంలో అతడే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటికే 500 పరుగులు పూర్తి చేశాడు.. బెంగళూరు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం లేదు కాబట్టి.. కోహ్లీ ఇంకా కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం ఉంది. అయినప్పటికీ అతడు భారీగానే పరుగులు చేస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు.
సూర్యకుమార్ యాదవ్
సూర్య కుమార్ యాదవ్ ఈ ఐపీఎల్ సీజన్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడటంలో తడబడుతున్నాడు. అయితే హాఫ్ సెంచరీ లేదా డక్ అవుట్ అన్నట్టుగా ఉంది అతడి ఆట తీరు.
రిషబ్ పంత్
రిషబ్ పంత్ ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహిస్తూ పర్వాలేదనిపిస్తున్నాడు. ఇటీవల కొన్ని మ్యాచ్ల్లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రస్తుత టి20లో అతడు గనుక చెలరేగి ఆడితే జట్టులో స్థానం సుస్థిరం కావచ్చు.
సంజూ శాంసన్
సంజూ శాంసన్ కు అవకాశం ముందే ఊహించింది. ఎందుకంటే ఈ ఐపీఎల్లో ఎటువంటి అంచనాలు లేకుండా మైదానంలోకి అడుగుపెట్టిన రాజస్థాన్ జట్టుకు అద్భుతమైన విజయాలు అందిస్తూ, తిరుగులేని స్థాయిలో నిలబెట్టాడు సంజూ. ప్రస్తుతం అతడు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి అతడి ఎంపిక కూడా సరైనదే. ఈ సిరీస్ లో తన సత్తా చూపి, తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని సంజు భావిస్తున్నాడు.
హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా విషయానికొస్తే ఐపీఎల్ లో ఇప్పటివరకు గొప్ప ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు లేవు. ఆల్ రౌండర్ కేటగిరీలో వికెట్లు పడగొట్టిన దృష్టాంతాలు కూడా లేదు. అలాంటప్పుడు హార్దిక్ పాండ్యాను ఎందుకు ఎంపిక చేశారనేది అంతు పట్టడం లేదు. పైగా వరల్డ్ కప్ లో గాయపడి కొద్ది రోజుల వరకు అతడు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు బౌలింగ్ వేస్తున్న తీరు కూడా ఏమంత గొప్పగా లేదు.
శివం దూబే
శివం దూబే అద్భుతంగా ఆడుతున్న నేపథ్యంలో.. అతడికి అవకాశం లభించాల్సిందే. అయితే ఎంతో పోటీ మధ్య అవకాశం లభించిన నేపథ్యంలో శివం దుబే దానిని సద్వినియోగం చేసుకుంటే జట్టులో అతడి స్థానానికి తిరుగుండదు.
రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా కూడా ఐపీఎల్ లో పర్వాలేదనట్టుగా ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. కాకపోతే స్థిరమైన ఫామ్ కొనసాగించడంలో అతడు ఇబ్బంది పడుతున్నాడు. అతడు గనుక తన పూర్వపు లయను అందుకుంటే భారత జట్టుకు బలం చేకూరినట్టే.
అక్షర్ పటేల్
ఇక ఢిల్లీ జట్టు తరఫున ఐపీఎల్ ఆడుతున్న అక్షర్ పటేల్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. తనదైన రోజు మ్యాచ్ ఫలితాన్ని సమూలంగా మార్చేయగల సత్తా ఇతని సొంతం. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో అవకాశం దక్కిన నేపథ్యంలో.. దానిని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడనేది చూడాల్సి ఉంది.
కులదీప్ యాదవ్
కులదీప్ యాదవ్ కూడా మిస్టరీ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. అతడు ఎంపిక కూడా సబబే అని సీనియర్ ఆటగాళ్లు అంటున్నారు.
యజువేంద్ర చాహల్
యజు వేంద్ర చాహల్ కూడా మొన్నటిదాకా పర్పుల్ క్యాప్ విభాగంలో మొదటి స్థానంలో ఉన్నాడు. అద్భుతంగా బంతులు వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఇతడి ఎంపిక కూడా సరైనదే.
బుమ్రా
భారత పేస్ గుర్రం జస్ ప్రీత్ బుమ్రా ఎంపిక ఆశ్చర్యం కలిగించకపోయినప్పటికీ.. బౌలింగ్ భారం మొత్తం అతని మీద వేస్తే తేడా కొట్టే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ముంబై జట్టు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో బుమ్రా మీద భారం తగ్గించే బౌలర్ ఉంటేనే అతడు అనుకున్నంత స్థాయిలో రాణించగలుగుతాడు. లేకుంటే భారత జట్టుకు ఇబ్బంది తప్పదు.
అర్ష్ దీప్ సింగ్
అర్ష్ దీప్ సింగ్ ప్రస్తుత ఐపిఎల్ లో పర్వాలేదు అనే స్థాయిలో బౌలింగ్ వేస్తున్నప్పటికీ.. ఐసీసీ మెగాటోర్నీలలో ఉండే ఒత్తిడిని ఏ స్థాయిలో భరించగలుగుతాడనేదే ఇక్కడ ప్రశ్న. బుమ్రా స్థాయిలో బౌలింగ్ వేస్తే భారత జట్టుకు పెద్దగా ఇబ్బంది ఉండదు. అదే సమయంలో బౌలింగ్ పై పట్టు కోల్పోతే మాత్రం జట్టు తీవ్రమైన పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మహమ్మద్ సిరాజ్
ఇక ప్రస్తుత ఐపీఎల్ లో బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న మహమ్మద్ సిరాజ్.. అనుకున్నంత స్థాయిలో ఆడ లేకపోతున్నాడు. ధారాళంగా పరుగులు ఇస్తున్న నేపథ్యంలో బెంగళూరు జట్టు అతడిని కొన్ని మ్యాచ్లకు దూరంగా పెట్టింది. ఇటీవలే అవకాశం ఇవ్వడం మొదలుపెట్టింది. అయినప్పటికీ తనను తాను నిరూపించుకోలేకపోతున్నాడు. అతడికి టి20 వరల్డ్ కప్ లో అవకాశం లభించడం ఒకింత ఆశ్చర్యమే అయినప్పటికీ.. ఇదే స్థాయిలో బౌలింగ్ చేస్తే మాత్రం భారత జట్టుకు ఇబ్బందులు తప్పవు.