T20 World Cup 2024 Australia: పాట్ కమిన్స్.. గత ఏడాది మన దేశం వేదికగా వన్డే వరల్డ్ కప్ జరిగితే.. ఫైనల్ లో భారత జట్టును ఓడించి ట్రోఫీని ఆస్ట్రేలియాకు అందించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నూ ఆస్ట్రేలియా దరికి చేర్చాడు. ఇంకో జట్టయితే అలాంటి కెప్టెన్ ను నెత్తి మీద పెట్టుకొని ఊరేగించేది. కొన్ని సంవత్సరాలపాటు అతడికే సారధ్య బాధ్యతలు అప్పగించేది. కానీ, అక్కడున్నది ఆస్ట్రేలియా. ఎంతటి తోపు ఆటగాడైనా జట్టు ప్రయోజనాలకు వచ్చేసరికి పక్కన పెడుతుంది. ఫామ్ లో లేకుంటే “బాబూ కొంచెం నీ ఆట తీరు మార్చుకో” అంటూ మొట్టికాయలు వేస్తుంది. ఆట తీరు అప్పటికి మారకపోతే ” దయచేయి నాయనా” అంటూ బయటికి పంపిస్తుంది. ఇలా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టే ఆస్ట్రేలియా జగజ్జేతగా ఉంది. వన్డే వరల్డ్ కప్ లను వరుసగా గెలుచుకుంటున్నది. 2011, 2019 లో మాత్రమే ఆస్ట్రేలియా కాస్త తడబడింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ లో అసలు సిసలైన ఆట తీరు ప్రదర్శించింది. టీమిండియాను సొంత దేశంలో ఓడించి విజేతగా నిలిచింది.
వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న తర్వాత.. త్వరలో అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్ ను కూడా ఒడిసి పట్టాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఇందులో భాగంగానే జట్టును ప్రకటించింది.. మొత్తం 15 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను ఐసీసీకి అందజేసింది. ఈ వరల్డ్ కప్ లో సీనియర్ ఆటగాడు స్టీవెన్ స్మిత్ ను పక్కన పెట్టింది.. అతడు మాత్రమే కాదు మ్యాట్ షార్ట్, జేసన్ బెహ్రెన్ డార్ఫ్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్ లెట్ ను కూడా పక్కన పెట్టింది. వాస్తవానికి వీరంతా టీ -20 లో వీర విహారం చేస్తున్న ఆటగాళ్లు. అయినప్పటికీ బ్యాటింగ్, బౌలింగ్లో చిన్న లోపాలు ఉండటంతో ఆస్ట్రేలియా పక్కన పెట్టింది.. అంతేకాదు ఐపీఎల్లో ఢిల్లీ జట్టు తరఫున అద్భుతంగా ఆడుతున్న ఫ్రేజర్ కు కూడా ఆస్ట్రేలియా జట్టు మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వలేదు. వాస్తవానికి అతడు ఈ టోర్నీలో బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. టి20 వరల్డ్ కప్ లో అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. ఇప్పటివరకు అతడు ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడక పోవడంతో అవకాశం ఇవ్వలేదని ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జిబెయిలీ ప్రకటించారు.
కమిన్స్ మాత్రమే కాకుండా.. డాషింగ్ ఆటగాడు మిచెల్ మార్ష్ కు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ గా సెలక్షన్ కమిటీ పగ్గాలు అప్పగించింది. ఆస్ట్రేలియా జట్టుకు వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్షిప్ వంటి మెగా కప్ లు అందించినప్పటికీ కమిన్స్ పట్ల ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ ఉదారత చూపలేదు. మిచెల్ మార్ష్ ను కెప్టెన్ గా నియమించిన ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ.. అష్టన్ అగర్, కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్ వుడ్, హెడ్, ఇంగ్లీస్, మాక్స్ వెల్, స్టార్క్, స్టోయినిస్, వేడ్, డేవిడ్ వార్నర్, ఆడం జంపాతో కూడిన 15 మందికి ఆస్ట్రేలియా జట్టు మేనేజ్మెంట్ టి20 వరల్డ్ కప్ లో ఆడే అవకాశం కల్పించింది. ఈ ఆటగాళ్ల జాబితాను ఐసీసీ కి పంపించింది.