Canada: కెనడాలో చదువుకునే విదేశీ విద్యార్థుల డిపాజిట్‌ను ఇటీవలే భారీగా పెంచిన అక్కడి ప్రభుత్వం.. తాజాగా మరో కొత్త రూల్ అమలుకు సిద్ధమైంది. దీంతో విదేశీ విద్యార్థులకు ఆఫ్ క్యాంపస్‌లో ఇక వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న తాత్కాలిక నిబంధన ప్రకారం వారానికి గరిష్టంగా 40 గంటలు పనిచేసుకునే సౌలభ్యం ఉండేది. ట్రూడో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం విదేశీ విద్యార్థులపై ప్రభావం చూపనుంది.
చదువుపై దృష్టిపెట్టాలనే..
కొత్తగా తీసుకువచ్చే నిబంధనపై కెనడా ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజ్, సిటిజన్‌షిప్ వ్యవహారాల శాఖ మంత్రి మార్క్ మిల్లర్ స్పందించారు. ఆఫ్ క్యాంపస్ పనిపై పరిమితి విదించడం వలన కెనడాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థులు పనికన్నా చదువుపై ఎక్కువ దృష్టిపెడతారని పేర్కొన్నారు. విద్యకోసం వచ్చేవారు చదువుపైనే దృష్టిపెట్టాలని, పనిమీద కాదని తెలిపారు.
కరోనా సమయంలో..
కరోనా సమయంలో దేశంలో శ్రామిక శక్తి కొరతను ఎదుర్కొనేందుకు ట్రూడో ప్రభుత్వం నిబంధనలు సడలించింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ విద్యార్థులు వారానికి గరిష్టంగా 40 గంటలు పని చేసుకునే వీలు కల్పించింది. ఈ సడలింపు గతేడాది ముగిసినా 2024 ఏప్రిల్ వరకు పొడిగించారు. ఇకపై దానిని పొడిగించకూడదని ట్రూడో సర్కార్ నిర్ణయించింది. వారానికి 24 గంటలే పనిచేసుకునే నిబంధన కొత్త విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
చదువులో వెనకబడిపోతున్నారట..
కెనడాలో వారానికి 28 గంటలకన్నా ఎక్కువ పనిచేసే విదేశీ విద్యార్థులు చదువులో వెనుకబడిపోతున్నారని అమెరికా, కెనడాలో ఇటీవల జరిపిన అధ్యయనాల్లో తేలినట్లు ట్రూడో ప్రభుత్వం ప్రకటించింది. వారానికి 24 గంటల కంటే ఎక్కువ పనిచేసే విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపివేసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
కెనడాలో 3,19,130 మంది భారతీయ విద్యార్థులు..
విదేశీ విద్య కోసం అమెరికా తర్వాత భారతీయ విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్న దేశం కెనడా. 2022లో అక్కడి ప్రభుత్వ గణాంకాల ప్రకారం కెనడాలో 3,19,130 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో చదవివే అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులదే ప్రధాన వాటా. విదేశీ విద్యార్థులు కెనడాకు క్యూ కడుతున్న తరుణంలో ట్రూడో ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకురావడం గమనార్హం.