India vs Pakistan : భారత అభివృద్ధి.. పాకిస్థాన్ దీనావస్తపై ఆదేశంలోని అతివాద ఇస్తామిక్ నాయకుడు మౌలానా ఫజుర్ రెహ్మాన్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదేశ జాతీయ అసెంబ్లీ వేదికగా ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధిని కొనియాడారు. పాకిస్థాన్ దీనావస్తపై ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు దేశాలు ఒకేరోజు స్వాతంత్య్రం పొందినా.. భారత్ సూపర్ పవర్ కావాలని కలలు కంటోందని తెలిపారు. పాకిస్థాన్ మాత్రం దివాళా తీయకుండా ఉంటే చాలని ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. పరోక్షంగా సొంత దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాడు. తమ దేశం దివాళా తీయకుండా ఉండేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)ను వేడుకుంటున్నామని పేర్కొన్నాడు.
నాడు నవాజ్ షరీఫ్ కూడా..
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా భారత్ అభివృద్ధిని ప్రశంసించారు. భారత్‌ను ఉద్దేశించి “ఓ వైపు వారు చంద్రయాన్లు, జీ20 సమావేశాలు జరుపుతుంటే.. మనం మాత్రం ప్రపంచం ముందు అడుక్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. భారత్‌లాగా మనం అభివృద్ధిని ఎందుకు సాధించలేకపోతున్నామని ప్రశ్నించారు. ఈ సి‍్థతికి బాధ్యులు ఎవరు? అని అప్పట్లో నిలదీశారు.
భారీగా రుణం..
ఇదిలా ఉంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్‌కు మరో 1.1 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎగ్జిక్యూటివ్ బోర్డు మంగళవారం ఆమోదముద్ర వేసింది. 3 బిలియన్ డాలర్ల ప్యాకేజీపై పాకిస్థాన్, ఐఎంఎఫ్ మధ్య జరిగిన ఒప్పందం ఈ నెలతో ముగియనుంది. ఈ క్రమంలోనే చివరి విడతగా రుణాన్ని మంజూరుచేసేందుకు ఆమోదం లభించింది. కాగా.. ఒప్పందంలో భాగంగా ఇప్పటికే పాక్ రెండు విడతల్లో 19 బిలియన్ డాలర్లను అందుకుంది.
మారుతున్న నేతల తీరు..
ఇదిలా ఉంటే.. భారత్ అంటే కాలుదువ్వే పాకిస్థాన్ నేతల తీరు క్రమంగా మారుతోంది. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం, పొరుగున ఉన్న భారత్ అభివృద్ధిపై దృష్టిపెట్టిన నేపథ్యంలో తాము కూడా మారాలన్న ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే గతంలో నవాజ్ షరీఫ్, తాజాగా మౌలానా ఫజుర్ రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలు నిదర్శనం. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, ఉపాధి లేమి కారణంగా పాకిస్థాన్‌లోని పలు రాష్ట్రాల ప్రజలు కూడా తమను భారత్‌లో కలపాలని ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో నేతల తీరు కూడా మారుతోంది.