AP Elections 2024: టిడిపి కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో బిజెపికి అంతగా భాగస్వామ్యం లేదా? బిజెపితో సంప్రదించకుండానే సంక్షేమ పథకాలను ప్రకటించారా?టిడిపి, జనసేన ఇచ్చిన హామీలకు తాము జవాబుదారీ కాదని వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు నివాసంలో ఈరోజు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తో పాటు బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ సిద్ధార్థ నాథ్ సింగ్ హాజరయ్యారు. అయితే ఈ మేనిఫెస్టో ప్రకటన సమయంలో సిద్ధార్థ నాథ్ సింగ్ అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. ఇది మరిన్ని అనుమానాలను పెంచింది. ఈ మేనిఫెస్టోతో తమకు ఎటువంటి సంబంధం లేదన్నట్టు సిద్ధార్థ నాథ్ సింగ్ వ్యవహరించారు.
ప్రస్తుతం కూటమిలో చంద్రబాబు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు.తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేస్తోంది. అయితే పొత్తులో సింహభాగం ప్రయోజనాలు టిడిపికేనని, జనసేన బలమైన మద్దతు దారుగా ఆ పార్టీకి ఉందని.. అటువంటప్పుడు ఆ రెండు పార్టీల ప్రయోజనాల కోసం తాము ఎందుకు పాకులాడాలన్నది బిజెపి నేతల అభిప్రాయం. గత కొద్ది రోజులుగా కూటమిలో ఇదే ప్రభావం చూపుతోంది. బిజెపి అగ్రనేతలు ఏపీ వైపు చూడడం లేదు. మిగతా భాగస్వామ్య పార్టీల ప్రచారానికి పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ఆ స్థాయిలో చూస్తే ఏపీలో టిడిపి కూటమికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకు బిజెపి రాష్ట్ర నాయకులు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు మేనిఫెస్టో ప్రకటన సమయంలో అక్కడే ఉన్న సిద్ధార్థ నాథ్ సింగ్.. కనీసం దానిని పట్టుకోవడానికి కూడా నిరాకరించారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అది కేవలం తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అన్నట్టుగా బిజెపి జాతీయ నాయకుడు వ్యవహరించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ తరుణంలో రకరకాల విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అసలు ఈ కూటమి మేనిఫెస్టోకు బిజెపి మద్దతు ఉందా అన్న అనుమానాలు నెలకొన్నాయి.