Harshith Rana : క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్. అంటే ఆటను జెంటిల్మెన్ లాగా ఆడాలని అర్థం. ఒకప్పుడు ఈ ఆటకు తమ స్లెడ్జింగ్ రూపంలో తప్పుడు భాష్యం చెప్పారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. ఆ తర్వాత ఐసీసీ నుంచి చివాట్లు ఎదుర్కొన్నారు. గత కొంతకాలం నుంచి గాడిలో పడ్డారు. ప్రస్తుతానికి ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడుతున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లకైన గుణపాఠం.. ఇతర ఆటగాళ్లకు కనువిప్పు కలిగించలేకపోతోంది. అందువల్లే వారు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో ఓ ఆటగాడు తన ఓవర్ యాక్షన్ తో అభాసుపాలవుతున్నాడు.. అతడి వ్యవహార శైలి చూసి మండిపోయిన ఐపీఎల్ నిర్వాహ కమిటీ.. ఒక మ్యాచ్ నిషేధం విధించింది.
గత సీజన్లో ఆటకంటే ఓవర్ యాక్షన్ తోనే విమర్శలకు గురయ్యాడు రియాన్ పరాగ్. ఆ సీజన్ మొత్తం అతడిని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేశారు..కానీ, ఈ సీజన్లో అతడు తన వ్యవహార శైలి పూర్తిగా మార్చుకున్నాడు. రాజస్థాన్ సాధిస్తున్న వరుస విజయాలలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ, టీమ్ ఇండియా భవిష్యత్తు ఆశా కిరణం లాగా ఆవిర్భవించాడు. ఓవర్ యాక్షన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందో రియాన్ పరాగ్ రూపంలో ఉదాహరణ కనిపిస్తున్నప్పటికీ.. హర్షిత్ రాణా అనే కోల్ కతా ఆటగాడు మైదానంలో చిల్లర వేషాలు వేస్తున్నాడు. వాస్తవానికి ఏ బౌలర్ కైనా వికెట్ తీస్తే అమితమైన ఆనందం కలుగుతుంది. పట్టరాని ఉద్వేగం తెరపైకి వస్తుంది. అదేంటో తెలియదు గాని.. హర్షిత్ రాణా.. వికెట్ తీయడమే ఆలస్యం అదోరకంగా వ్యవహరిస్తున్నాడు. ఓవర్ యాక్షన్ అనే పదానికి మించి ఎక్స్ ట్రా లకు పాల్పడుతున్నాడు. అనేక హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేకపోవడంతో, ఒళ్ళు మండిన ఐపీఎల్ నిర్వాహక కమిటీ అతనిపై చర్యలు తీసుకుంది.
కోల్ కతా ఆటగాడు హర్షిత్ రాణా ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ వికెట్ పడగొట్టాడు . ఆ సమయంలో అతడికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అప్పట్లో అది సంచలనంగా మారింది. దీంతో అతగాడి వ్యవహార శైలిని తప్పుపడుతూ, ఐపీఎల్ నిర్వాహక కమిటీ హెచ్చరించింది. ప్రవర్తనా తీరును మార్చుకోవాలని చెబుతూ మ్యాచ్ లో 60% ఫీజులో కోత విధించింది. ఇక ఢిల్లీతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో హర్షిత్ రాణా అదేవిధంగా వ్యవహరించాడు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. దీంతో ఐపీఎల్ యాజమాన్యం అతనిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. అంతేకాదు 100% మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించింది. మరి ఇప్పటికైనా హర్షిత్ రాణా తన తీరు మార్చుకుంటాడా? లేకుంటే అలానే వ్యవహరిస్తాడా? అనేది చూడాల్సి ఉంది.