
India vs Australia Test Series 2023
India vs Australia Test Series 2023: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ యుద్ధానికి సర్వం సిద్ధమైంది. నాగపూర్ వేదికగా 9వ తేదీ నుంచి ఈ భారీ ఫైటింగ్ జరుగనుంది. గత సారి ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను టెస్ట్ సిరీస్ లలో ఓడించి టీమిండియా సగర్వంగా నిలబడింది. ఇప్పుడు అంతకుమించిన పటిష్టమైన జట్టుతో ఆస్ట్రేలియా ఇండియాలో అడుగుపెట్టింది. మరి ఈ 4 టెస్టుల సిరీస్ లో భారత్ ను భారత్ లో ఓడించాలని స్పిన్ ను తెగ ఆడేస్తోంది. మరి ఈ టఫ్ ఫైట్ లో టీమిండియాను ఆస్ట్రేలియా ఓడిస్తుందా? అసలు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 5 గొప్ప టెస్ట్ యుద్ధాలు ఏంటో తెలుసుకుందాం.

India vs Australia Test Series 2023
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పేరిట ఇండియా , ఆస్ట్రేలియాల మధ్య టెస్ట్ సమరం ప్రతీ రెండుమూడేళ్లకోసారి జరుగుతోంది. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక రేటింగ్ పొందిన సిరీస్ లలో ఇదీ ఒకటి. తాజాగా భారత్ లో ఆడేందుకు ఆస్ట్రేలియా వచ్చేసింది. సంవత్సరాలుగా ఈ టెస్ట్ సిరీస్ అభిమానులకు కొన్ని చిరస్మరణీయమైన గేమ్‌లను అందించింది. భారతీయ దృక్కోణంలో కొన్ని అద్భుతమైన విజయాలున్నాయి. కొన్ని అద్భుతమైన విజయాలు ఇప్పటికీ చెరగని ముద్రవేశాయి. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే మొదటి టెస్ట్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్లూ టెస్ట్‌లలో ఆడిన కొన్ని ఉత్కంఠభరితమైన, ఉత్తేజకరమైన , చిరస్మరణీయమైన మ్యాచ్‌లను ఒక్కసారి పరిశీలిద్దాం.
-2010లో మోహాలీ టెస్ట్
2010లో మొహాలీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గెలవడానికి 216 పరుగులు చేయాల్సి ఉండగా ఒక దశలో భారత్ 124/8తో ఓటమి అంచున ఉంది. ఈ మ్యాచ్ లో ఇషాంత్ శర్మ 92 బంతులు ఎదుర్కొని మరీ బ్యాటింగ్ చేసి భారత్‌కు తొమ్మిదో వికెట్ కు లక్ష్మణ్ తో కలిసి కీలకమైన స్టాండ్‌ని అందించాడు. ఇంకా 11 పరుగులు చేయాల్సి ఉండగా ఇషాంత్ 31 పరుగులతో ఉన్నాడు. లక్ష్మణ్ గాయంతో పోరాడుతున్నాడు. రైనా అతని కోసం పరిగెడుతున్నాడు. మ్యాచ్ యొక్క ఆఖరి, ఉత్కంఠభరితమైన క్షణాలు సాధారణంగా ప్రశాంతంగా ఉండే లక్ష్మణ్ తన కూల్‌ను కోల్పోయి, ప్రమాదకర సింగిల్ తీసుకున్నందుకు తన బ్యాటింగ్ భాగస్వామి ఇషాంత్ ను బలవంతపెట్టగా అతడు రన్ అవుట్ అయ్యాడు. చివరికి ఓజా 11వ నంబర్ బ్యాట్స్ మెన్ తో కలిసి భారతదేశం థ్రిల్లింగ్ ముగింపులో విజయాన్ని అందించాడు. రెండు పరుగులను తీసి భారత్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. భారత్ గెలిచిన తర్వాత లక్ష్మణ్ తన బాధకు, ఆనందానికి అవధులు లేవు.
-2000-01లో ఈడెన్ గార్డెన్స్ లో భారత్ ను గెలిపించిన లక్ష్మణ్, ద్రావిడ్
భారత టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పాపులర్ టెస్ట్ ఇదే. ఈడెన్ గార్డెన్స్ లో ఆస్ట్రేలియాపై టెస్ట్ గుర్తుండిపోతుంది. 2000-01లో స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌లో అప్పటికే భారత్ 0-1తో వెనుకబడింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను కేవలం 171 పరుగులకు ఆలౌట్ చేసి భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. భారతీయులను ఫాలో-ఆన్ ఆడించింది. ఈక్రమంలోనే వీవీఎస్ లక్ష్మణ్ (281), రాహుల్ ద్రవిడ్ (180) ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 376 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆసీస్‌ను వెనక్కి నెట్టారు. 384 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియన్లను హర్భజన్ వణించాడు. ఈ మ్యాచ్‌లో 13 వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 7, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టిన హర్భజన్ సింగ్ నేతృత్వంలోని బౌలింగ్ దాడితో కేవలం 212 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌటైంది. చెన్నై వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆసీస్‌పై భారత్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

India vs Australia Test Series 2023
-ఆస్ట్రేలియాలోని పెర్త్ టెస్ట్ లోనూ తిప్పేసింది..
ఇది కేవలం నాలుగు రోజులు మాత్రమే కొనసాగింది, అయితే గేమ్ సెషన్ తర్వాత సెషన్‌లో ఒక జట్టు నుండి మరొక జట్టుకు స్వింగ్ అవుతూనే ఉంది. సిరీస్‌లో 0-2తో వెనుకబడిన తర్వాత, అనిల్-కుంబ్లే నేతృత్వంలోని జట్టు ఆతిథ్య జట్టును దెబ్బతీయడానికి బలంగా పుంజుకుంది. చివరి టెస్టులో 2-1తో నిలిచింది. పెర్త్ లో జరిగిన ఈ టెస్ట్ తర్వాత అప్పటివరకూ ఏ జట్టు అక్కడ ఆసీస్‌ను ఓడించలేదు. పదేళ్ల తర్వాత భారత్ ఆ ఘనత సాధించింది. నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో భారత్‌కు ఇదే తొలి విజయం. అపఖ్యాతి పాలైన మంకీ గేట్ ఎపిసోడ్‌తో సహా అనేక వివాదాలతో చెలరేగిన సిడ్నీ టెస్ట్ తర్వాత పెర్త్‌లో టెస్ట్ విజయం సాధించడం భారత జట్టుకు , అభిమానులకు మరింత ప్రత్యేకమైనదిగా నిలిచింది.
-ఆస్ట్రేలియాలో గత టెస్ట్ సిరీస్ విజయం.. చిరస్మరణీయం
చరిత్రలో తమ అత్యల్ప టెస్టు స్కోరుకు భారత్ ను 36 పరుగులకే ఆస్ట్రేలియా కట్టడి చేసింది. ఈ టెస్టు తర్వాత ఏమి జరిగిందో ఎవరూ ఊహించలేదు. గాయంతో బాధపడుతున్న భారత జట్టు ఆస్ట్రేలియాను రెండు టెస్టుల్లో ఓడించి 2-1తో సిరీస్‌ని కైవసం చేసుకొని ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి సత్తా చాటింది. ఆ టూర్‌లో అడిలైడ్ ఒక చారిత్రాత్మక ప్రయాణానికి నాందిగా గుర్తుంచుకోవాలి. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసి ఆసీస్‌ను కేవలం 191 పరుగులకే ఆలౌట్ చేసి మంచి ఆధిక్యం సాధించింది. కానీ తర్వాత ఊహించని విధంగా భారత్ 2వ ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా మూడో రోజు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ప్రధాన కోచ్ రవిశాస్త్రి భారత జట్టు సభ్యులకు 36 ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియాకు గట్టి సవాలు సమాధానం ఇవ్వమని చెప్పాడు. విరాట్ కోహ్లీ లేని అజింక్యా రహానే నేతృత్వంలోని భారత్ ఎంసీజీ లో ఆసీస్‌ను ఓడించి, సిడ్నీలో డ్రా చేసి, గబ్బాలో మళ్లీ గెలిచి ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి విజయం సాధించింది. ఇదో చారిత్రక విజయంగా చరిత్రలో నిలిచింది. సీనియర్లు అందరూ లేని భారత్ జట్టు యువకులైన సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శార్ధుల్ లాంటి వారితోనే ఈ విజయం సాధించి సత్తాచాటింది.
-గబ్బా గడ్డపై భారత్ చారిత్రక విజయం..
గబ్బా టెస్టు విజయం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. 2020-21లో జరిగిన ఈ టూర్‌లో భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య చాలా వాడివేడిగా చర్చ జరిగింది. గబ్బాలో నాలుగో -చివరి టెస్ట్‌కు ముందు, ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్, బౌన్సీ గబ్బా పిచ్‌లో భారతీయులను రఫ్పాడిస్తాం.. ఇక్కడ తమను ఓడించేవాళ్లు పుట్టలేదంటూ బీరాలకు పోయాడు. టీమిండియాను అవమానించాడు. షార్ట్ స్టఫ్ బౌలింగ్ చేయడం గురించి ఆర్ అశ్విన్‌ను హెచ్చరించాడు. ఆస్ట్రేలియా గబ్బాలో 32 ఏళ్ల పాటు టెస్టులో ఓడిపోలేదు. ఆసీస్ దానిని చాలా గర్వంగా తమ ‘కోట’ అని పిలిచింది.. కానీ రిషబ్ పంత్ అసాధాన్ని సుసాధ్యం చేశాడు. టీమిండియా బ్యాటింగ్ యూనిట్, మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు 5వ రోజు స్టంప్స్‌కు ముందు 328 పరుగులను ఛేదించి భారత్ చరిత్ర సృష్టించింది. రిషబ్ పంత్ అజేయంగా 89 పరుగులతో దంచికొట్టడంతో ఆస్ట్రేలియా గబ్బా కోట బద్దలైంది. సిరీస్ విజయంతో భారత్ మళ్లీ స్వదేశానికి సగర్వంగా తిరిగి వచ్చింది. ఆస్ట్రేలియా భంగపాటుకు గురైంది.

India vs Australia Test Series 2023
ఇలా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ఐదు ఫైట్స్ ఎంతో ప్రత్యేకం. ఇప్పటికీ ఆస్ట్రేలియాకు ఇవి మాయని మచ్చలా ఉన్నాయి. ఇప్పుడు ఇండియాకు వచ్చి అదే బీరాలకు పోతోంది. టీమిండియాను ఓడిస్తామని సవాల్ చేస్తోంది. మరి వారికి శృంగభంగం అవుతుందా? లేదా నిజంగానే సత్తా చాటుతుందా? అన్నది వేచిచూడాలి. మొత్తానికి ఈ ఫైట్ మాత్రం యమరంజుగా సాగనుంది.