Manch Vishnu: పెద్ద సినిమాల కారణంగా చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందని ‘దాసరి’ లాంటి మహామహులు ఎంత మొత్తుకున్నా చిన్న సినిమాల నష్టాలు తగ్గలేదు, పెద్ద సినిమాలు, ఆ సినిమాలు తీసే పెద్దల దౌర్జన్యం తగ్గలేదు. అసలు సినీ కళామతల్లికి ఏ సినిమా అయినా ఒక్కటే. ఆ మాటకొస్తే ఒక విధంగా పెద్ద సినిమా కంటే.. చిన్న సినిమాల కారణంగానే ఎక్కువమందికి పని దొరుకుతుంది. అలాగే ఎక్కువ సినిమాలు వస్తాయి.
కానీ పెద్ద సినిమా, చిన్న సినిమాల పై ఎగబడి పీక్కు తినడానికి ఎప్పుడు రెడీగానే ఉండటం దురదృష్టకరం. మరి చిన్న సినిమా ఇంకెప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేది ? బడా నిర్మాతల మధ్య ఊపిరాడని చిన్న నిర్మాతలకు ఇంకెప్పుడు ఊపిరి నిలిచేది ? చిన్న సినిమాలు నిర్మించే నిర్మాతలకు నిజమైన భరోసా దక్కేది ఇంకెప్పుడు ? ఓటీటీలు వచ్చినా.. వాటిల్లో పెత్తనం పెద్దవాళ్లదే. దాంతో చిన్న నిర్మాతలు నలిగిపోతున్నారు.
ఆ పెద్ద వాళ్ళను కలుసుకోవడానికే చిన్న సినిమా నిర్మాతలకు సాధ్యం కావడం లేదు. ఇక తమ సినిమాను ఆ ఓటీటీలోకి ఎలా ఎక్కించ గలరు ? ఎక్కించినా తగిన ప్రతిఫలం ఎలా పొందగలరు ? మరి ఈ పరిస్థితులు మారాలి అంటే ఏమి చేయాలి ? ఇదే ప్రశ్న తమిళనాడులో కూడా కలిగింది. అందుకే, తమిళ సినీ నిర్మాతల మండలి చిన్న నిర్మాతలకు సాయం చేసేలా ఓ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ని స్థాపిస్తోంది.
ఈ ఓటీటీ ద్వారా విడుదలకు నోచుకోని తమిళ చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి. ఆయా సినిమాల వల్ల వచ్చిన కలెక్షన్స్ మొత్తం ఆ సినిమాల నిర్మాతలకే ఇస్తారట. ఎంత బాగుంది ఈ ప్రతిపాదన ? ఇలాంటి సరికొత్త ప్రణాళికలతో తెలుగులో కూడా ఓ ఓటీటీ సంస్థను ఎందుకు పెట్టకూడదు ? ఇలాంటి గొప్ప నిర్ణయాలను ఎందుకు ఆచరణలోకి తీసుకువెళ్ళకూడదు ? మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
కానీ, ఇలాంటి ఓటీటీ పెట్టి.. చిన్న సినిమాలకు భరోసా కల్పిస్తే.. ఆ నిర్మాతలు మరిన్ని చిత్రాలు నిర్మిస్తారు. అప్పుడు నటీనటులందరికీ అవకాశాలు ఇస్తారు. అప్పుడు విష్ణు కల కూడా నెరవేరుతుంది. పైగా నటీనటులకు అవకాశాలు ఇప్పించాడు అని పేరు దక్కుతుంది. మరి ఈ దిశగా విష్ణు ఆలోచిస్తే.. అతనితో పాటు ఎంతోమందికి మేలు జరుగుతుంది. అన్నిటికి మించి చిన్న సినిమాలకు చేయూత ఇచ్చిన వాడు అవుతాడు. మరి విష్ణు ఆ దిశగా ఆలోచిస్తాడా ?
Also Read: Romantic: ‘పుట్టింది పడుకోడానికి కాదు.. చనిపోయాక పడుకో’: రొమాంటిక్ సెకెండ్ ట్రైలర్