Health Tips: సాధారణంగా అమ్మాయిలు చాలా మంది పొడవైన జుట్టును ఇష్టపడుతుంటారు. మరి కొందరు షార్ట్ హెయిర్ ను ఇష్టపడుతుంటారు. అమ్మాయిలే కాదు అబ్బాయిలు సైతం జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారన్న సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుత కాలంలో యువత అసలు తలకు నూనె రాయడం అవసరమా అని భావిస్తుంటారు. అసలు తలకు నూనె రాయడం మంచిదేనా? నూనెను రాయడం వలన ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
మామూలుగా ప్రతిరోజు తలకు నూనె రాసుకోవాలని పెద్దలు చెబుతుంటారన్న సంగతి తెలిసిందే. చిన్నతనంలో తలకు నూనె రాసుకుని తిరిగిన వారు కూడా ప్రస్తుతం ఆ విధంగా చేయడం లేదు. ఇప్పుడు నూనె రాయకుండా పొడి జుట్టుతో తిరగడమే ఫ్యాషన్ గా భావిస్తున్నారు.
అయితే తలకు నూనెను రాయకపోవడం వలన అనేక జుట్టు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా జుట్టు రాలిపోవడం, చుండ్రు, కుదుళ్లు బలహీనంగా మారడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఈ విధంగా జుట్టు సమస్యలు రాకుండా అందమైన, ఆరోగ్యవంతమైన జుట్టు కావాలంటే తప్పనిసరిగా నూనె పట్టించాలని నిపుణులు సైతం చెబుతున్నారు
జుట్టుకు నూనె రాయడం వలన రక్తప్రసరణ బాగా జరిగి కుదుళ్లు బలపడతాయి. దీని వలన జుట్టు స్ట్రాంగ్ గా మారుతుంది. చుండ్రుతో పాటు వెంట్రుకలు తెల్లగా మారడం వంటి సమస్యల నుంచి కూడా తప్పించుకోవచ్చు. అలాగే తరచూ నూనె రాయడం వలన జుట్టు మృదువుగా మారి మంచి మెరుపు వస్తుంది. దాంతో పాటు జుట్టు పొడిగా మారడం, వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ నేపథ్యంలోనే జుట్టుకు రోజూ కాకపోయినా కనీసం వారానికి రెండు లేదా మూడు సార్లు నూనె రాయడం మంచిదని తెలుస్తోంది. కొబ్బరి, ఆలివ్ ఆయిల్ లేదా బాదం, ఉసిరి వంటి నూనెలను జుట్టుకు పట్టించడం వలన జుట్టు సమస్యలు తగ్గుతాయి.
అలాగే రాత్రి పడుకునే ముందు తలకు నూనెను బాగా పట్టించి ఉదయమే తలస్నానం చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా చేస్తే చుండ్రు తగ్గడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మీరు కూడా మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే.. ప్రతి రోజూ నూనెను తప్పక రాసుకోవాలి. అలా కుదరని పక్షంలో కనీసం వారానికి రెండు లేదా మూడుసార్లు అయినా నూనెను పట్టించి మసాజ్ చేసుకోవడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు.