Chandrababu: ఏపీలో హోరాహోరీ ఫైట్ నడిచింది. ఎవరికి వారే గెలుపు పై ధీమాతో ఉన్నారు. పోలింగ్ శాతం పెరగడం తమకు అనుకూలమని టిడిపి కూటమి విశ్వసిస్తోంది. అయితే అదంతా పాజిటివ్ ఓటింగ్ అని వైసిపి భావిస్తోంది. సీఎంగా జగన్ విశాఖలో జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స ప్రకటించారు. అదే సమయంలో టిడిపి నుంచి కూడా అదే ధీమా వ్యక్తం అవుతోంది. చంద్రబాబు తప్పకుండా సీఎం గా ప్రమాణస్వీకారం చేస్తారని కూటమి పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇటువంటి సమయంలో ఆపద్దర్మ సీఎంగా జగన్ తక్షణ చర్యలకు ఉపక్రమించాలి.కానీ ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. కుటుంబంతో సహా విహారయాత్రలకు యూరప్ వెళ్లారు.
ఇటువంటి సమయంలో చంద్రబాబు తెరపైకి వచ్చారు. వరుసగా సమీక్షలు జరుపుతున్నారు. గవర్నర్ తో పాటు ఎలక్షన్ కమిషన్కు వరుసగా లేఖలు రాస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని తెలియజేస్తున్నారు. దీంతో చంద్రబాబు సీఎం పదవిలో పరకాయ ప్రవేశం చేశారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. శాసనసభలో తనకు జరిగిన అవమానంపై చంద్రబాబు కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. మళ్లీ తాను సీఎం గానే హౌస్ లో అడుగు పెడతానని శపధం చేశారు. ఇప్పుడు అది జరిగి తీరుతుందని టిడిపి శ్రేణులు నమ్మకంగా చెబుతున్నాయి. ఇప్పటికే బాస్ ఎంటర్ అయ్యారని టిడిపి సోషల్ మీడియా తెగ ప్రచారం చేసుకుంటుంది.
మూడు కీలక అంశాలపై చంద్రబాబు సమీక్షలు జరిపారు. గవర్నర్ తో పాటు ఎన్నికల కమిషన్కు విన్నవించారు. సంక్షేమ పథకాలకు సంబంధించి సీఎం జగన్ బటన్ నొక్కిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసమే అదంతా చేశారని నాడు విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఖాతాల్లో నగదు జమ కాలేదు. పోలింగ్ జరిగిన తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే సంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ప్రభుత్వం పావులు కదిపింది. దీంతో చంద్రబాబు నేరుగా గవర్నర్కు లేఖ రాశారు. తక్షణం సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయాలని కోరారు. దీంతో గవర్నర్ ఆదేశాల మేరకు ఆ నిధులు విడుదలయ్యాయి.
ఏపీలో అల్లర్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్కు చంద్రబాబు ప్రత్యేకంగా లేఖ రాశారు.ఏపీలో కేంద్ర బలగాలను పెట్టాలని కోరారు. దీంతో ఈసీ స్పందించింది. ఎన్నికల ఫలితాల అనంతరం రెండు వారాలపాటు కేంద్ర బలగాలు ఏపీలో కొనసాగేలా ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ప్రభుత్వ జీవోలు దాచుకునే ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అయితే జీవోలను తొలగించేందుకేనని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. తప్పుడు నిర్ణయాలు, జీవోలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. తక్షణం ఆ పనులు నిలిపివేయాలని చంద్రబాబు కోరారు. దీనిపై స్పందించిన ఈసీ ఆ ప్రక్రియను నిలిపి వేయించింది. ఇలా చంద్రబాబు సమీక్షలు జరిపి కోరడం.. వాటికి గవర్నర్ తో పాటు ఈసీ ఆమోదముద్ర వేయడంతో.. చంద్రబాబు సీఎం పదవిలోకి పరకాయ ప్రవేశం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది.