Jagan London Tour: ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. భార్య భారతి తో కలిసి విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో జగన్ లండన్ వెళ్లారు. అయితే అక్కడ విమాన ల్యాండింగ్ కు అనుమతి లభించకపోవడంతో అమెస్టర్ డం వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి తిరిగి లండన్ వచ్చినట్లు సమాచారం. శుక్రవారం అర్ధరాత్రి విజయవాడ నుంచి జగన్ బయలుదేరి వెళ్లారు. ఓ ప్రైవేటు విమానంలో మాత్రమే వెళుతున్నారని బయటకు చెప్పారు. అయితే ఆ విమాన వివరాలేవీ బయటకు రాలేదు. శనివారం ఉదయం 12 గంటల సమయంలో జగన్ ప్రయాణిస్తున్న విమానం లండన్ కు చేరింది. అక్కడే జగన్ కుటుంబం ప్రయాణించిన విమానం తాలూకా ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. వాస్తవానికి విజయవాడలోనే దీనికి ఫోటోలు తీయాలని మీడియా ప్రయత్నించినా వీలు కాలేదు.
ఈ విమానం లండన్ చేరుకున్నాక.. రన్వేపై ఆగిన తర్వాత ఎవరో ఫోటో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆలీ కలర్ రంగు, రెడ్ టేప్ తో ఉన్న ఈ విమానం నుంచి సీఎం జగన్ కిందకు దిగుతున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. అయితే వెంట మందీ మార్బలం ఏది కనిపించకపోవడం విశేషం. జగన్ తన చేతిలో రెడ్ కలర్ లో ఉన్న ఒక స్వెటర్ను తీసుకుని విమానం నుంచి కిందకు దిగిన దృశ్యం మాత్రం కనిపించింది. అప్పటికే లండన్ వెళ్లిన భద్రత సిబ్బంది ఆయనను అనుసరించడం.. వారు సమకూర్చిన కారులో వెళ్లిపోవడం జరిగిపోయింది.
సీఎం జగన్ తో పాటు సతీమణి భారతి, కుమార్తెలు హర్ష, వర్షాలు ఉన్నారు. రెండు వారాల పాటు వీరు లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో గడపనున్నారు. కాగా లండన్ విమానాశ్రయంలో జగన్కు ఘన స్వాగతం లభించింది. జగన్ ను చూసేందుకు లండన్ లోని వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, ఎన్నారై విభాగం నాయకులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి రావడం గమనార్హం. జగన్ కుటుంబం నాలుగు రోజులపాటు లండన్ లోనే గడపనుంది. తరువాత స్విట్జర్లాండ్ వెళ్లనుంది. అటు తరువాత ఫ్రాన్స్ కు వెళ్లి.. కొద్దిరోజుల పాటు విడిది చేసి ఏపీకి రానున్నట్లు సమాచారం.