Cotton Farmer In Telangana: ప్రోత్సాహం లేదా కేసీఆర్ సార్.. ఇలా చేయడం న్యాయమేనా?

ఏవోలు, ఏఈవోలు గ్రామాల్లో తిరిగి అవగాహన సదస్సులు నిర్వహించారు. కొందరు ఏఈవోలు ఇంటింటికీ తిరిగి మరీ అధిక సాంద్రత పత్తి సాగుచేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

Cotton Farmer In Telangana: ప్రోత్సాహం లేదా కేసీఆర్ సార్.. ఇలా చేయడం న్యాయమేనా?

Cotton Farmer In Telangana: “అబ్ కీ బార్ కిసాన్ సర్కార్”.. అనే నినాదంతో దేశవ్యాప్తంగా చక్రాలు తిప్పాలని.. కేసీఆర్ తలపోస్తున్నారు. మహారాష్ట్రలో మూడు చోట్ల సమావేశాలు నిర్వహించారు. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అక్కడి స్థానిక ప్రభుత్వాలను దునుమాడుతున్నారు. కానీ ఇదే సమయంలో సొంత రాష్ట్రంలో జరుగుతున్న దానిని మరుగున పడేస్తున్నారు. అధిక వర్షాలు కురిసి మక్క రైతులు నిండా మునిగినప్పటికీ ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు. రైతుబంధు పేరుతో డబ్బులు ఇస్తున్నామని చెప్పి మిగతా అన్ని పథకాలకు పంగనామాలు పెట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాల్లోనూ రైతులకు అన్యాయం జరుగుతోంది. ఇవన్నీ విషయాలు పక్కన పెట్టి కేవలం రాజకీయ ప్రాపకం కోసం అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ నినాదాలు చేస్తోంది. ధాన్యం సకాలంలో కొనుగోలు చేయక మిల్లర్లకు దోచిపెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేస్తున్న రైతుల నోట్లో మట్టి పోసింది. మొదట్లో ప్రోత్సాహం ఇస్తామని ఆశపెట్టి తీరా ఇప్పుడు నిండా ముంచింది.

రైతులకు షాక్ ఇచ్చింది

అధిక సాంద్రత పత్తి సాగు చేస్తే ఎకరానికి రూ.4 వేలు ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. తీరా పంట వేసిన తర్వాత రైతులకు షాకిచ్చింది. ప్రోత్సాహకం లేదు.. ఏమీ లేదు.. అంతా తూచ్‌.అని స్వయానా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తేల్చేశారు. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులు తన వద్ద మరోసారి ప్రస్తావించొద్దని, ప్రోత్సాహకం ఇచ్చేది లేదని రైతులకు స్పష్టంగా తెలియజెప్పాలని మంత్రి ఆదేశించారు. దీంతో పత్తి రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. సంప్రదాయ పత్తి సాగుకు భిన్నంగా ఎక్కువ మొక్కలతో ఎక్కువ కాయలు, ఎక్కువ దిగుబడి సాధించాలనే లక్ష్యంతో ‘అధిక సాంద్రత పత్తి’ సాగు విధానాన్ని వ్యవసాయ శాఖ అమలులోకి తెచ్చింది. సంప్రదాయ పత్తి సాగులో ఎకరానికి 7,400 మొక్కలు నాటితే.. కొత్త తరహాలో 25 వేల వరకు నాటే అవకాశం ఉంది. మొక్కల సంఖ్య మూడింతలు పెరిగితే.. సహజంగానే పత్తి దిగుబడి 50 శాతం వరకు పెరుగుతుందని రైతులను ప్రోత్సహించారు. అంతేకాదు ఎకరానికి రూ.4 వేల చొప్పున ప్రోత్సాహకం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో 2022-23 వానాకాలంలో 50 వేల ఎకరాల్లో ఈ తరహా పత్తిని సాగు చేయించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ లక్ష్యం పెట్టుకుంది. రైతుల నుంచి స్పందన రాకపోవటంతో టార్గెట్‌ను 20 వేల ఎకరాలకు కుదించింది.

అవగాహన సదస్సులు నిర్వహించారు

ఏవోలు, ఏఈవోలు గ్రామాల్లో తిరిగి అవగాహన సదస్సులు నిర్వహించారు. కొందరు ఏఈవోలు ఇంటింటికీ తిరిగి మరీ అధిక సాంద్రత పత్తి సాగుచేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కానీ అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. కేవలం 8,425 ఎకరాల్లోనే రైతులు అధిక సాంద్రత పత్తిని సాగు చేశారు. ఐదు విత్తన ప్యాకెట్లతో పాటు.. మొక్కలు ఎక్కువ ఎత్తు, గుబురుగా పెరగకుండా నియంత్రించేందుకు గ్రోత్‌ రెగ్యులేటర్‌ వినియోగం, కూలీల ఖర్చు, వీడింగ్‌, కాంటిజెన్సీ, అదనపు ఖర్చులన్నీ కలిపి ఎకరానికి రూ.4 వేలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో నిర్వహించిన పత్తి రైతుల అవగాహన సదస్సుల్లో కూడా ఎకరానికి రూ.4 వేలు ఇస్తామని వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. నగదు బదిలీ చేయడానికి రైతుల బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్‌ నంబర్లను ఏఈవోలు సేకరించారు. కానీ ఇంత వరకు పత్తి రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయలేదు.

ఇప్పటివరకూ ప్రోత్సాహం ఇవ్వలేదు

గత జూన్‌లో రైతులు పత్తి సాగు ప్రారంభిస్తే.. ఇప్పటికి ఏడాదైనా పట్టించుకునే పరిస్థితి లేదు. సీజన్‌ ప్రారంభంలో విత్తనాలు కొనేటప్పుడో, నాటేటప్పుడు కూలీల ఖర్చుల కోసమో, మందులు పిచికారీ చేసేటప్పుడో రైతులకు రూ.4 వేల ప్రోత్సాహకాన్ని అందించాల్సి ఉంది. సాధారణ పెట్టుబడి కంటే అధిక సాంద్రత పత్తి సాగుకు కనీసం 10-15 శాతం పెట్టుబడి పెరిగింది. కానీ ప్రభుత్వం నుంచి నయాపైసా ఆర్థిక సాయం అందలేదు. దీంతో రైతులు ఏఈవోలు, ఏవోల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రూ.4 వేలు ఎప్పుడు ఖాతాల్లో జమచేస్తారని నిలదీస్తున్నారు. కేవలం 8,425 ఎకరాలకు రూ.4 వేల చొప్పున రూ. 3.37 కోట్లు పంపిణీ చేస్తే సమస్య తీరిపోయేది. ఇంత చిన్న మొత్తాన్ని ప్రభుత్వం రైతులకు ఎందుకు ఇవ్వడం లేదో ఎవరికీ అంతు చిక్కటం లేదు. ఏడీఏలు, డీఏవోలు రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్‌కు పలుమార్లు లేఖలు రాశారు. కానీ సమాధానం రాలేదు. తాజాగా మంత్రి నిరంజన్‌రెడ్డి వద్ద వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

వ్యవసాయ మంత్రి కఠిన వ్యాఖ్యలు

‘ఇప్పటికే రైతు బంధు పథకంలో ఎకరానికి రూ.5 వేల చొప్పున ఇస్తున్నాం. మళ్లీ ప్రత్యేకంగా రూ.4 వేల ప్రోత్సాహకం ఇవ్వడమేంటి..? అనవసరంగా రైతులకు ఆశలు కల్పించొద్దు’ అని అధికారులను హెచ్చరించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయి అధికారులకు కూడా వెంటనే సమాచారం చేరవేయాలని, ప్రోత్సాహకమనే అంశానికి ఇంతటితో తెర వేయాలని ఆదేశించినట్లు అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు