Allu Arjun : పవన్ కళ్యాణ్ కి ఆయన పార్టీ జనసేనకు టాలీవుడ్ నుండి అంతకంతకు మద్దతు పెరుగుతుంది. పిఠాపురం నుండి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గెలవాలని పలువురు చిత్ర ప్రముఖులు భావిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో స్టార్ హీరో అల్లు అర్జున్ చేరారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పై ‘తగ్గను బ్రదర్’ అంటూ వ్యతిరేకంగా కామెంట్స్ చేసి అల్లు అర్జున్ ఆయన అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కానీ కీలకమైన ఏపీ ఎన్నికల వేళ మామ పవన్ గెలుపు కోసం ముందుకొచ్చారు. పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని ఆయన సోషల్ మీడియా వేదికగా కోరుకున్నారు. బీజేపీ+టీడీపీ+జనసేన కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ కి కేటాయించారు.
అక్కడ వైసీపీ అభ్యర్థిగా వంగ గీత పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి మద్దతుగా జబర్దస్త్ కమెడియన్స్, సీరియల్ నటులు రంగంలోకి దిగారు. ఇంటింటికి ప్రచారం చేశారు. చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సైతం ప్రచారం నిర్వహించారు. చిత్ర పరిశ్రమ నుండి పవన్ కళ్యాణ్ కి గట్టి మద్దతు లభిస్తుంది.
తమ్ముడు పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని చిరంజీవి ఎమోషనల్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి చేతులెత్తి పిఠాపురం ప్రజలకు మొక్కాడు. రామ్ చరణ్ సైతం సోషల్ మీడియా వేదికగా తన మద్దతు తెలియజేశాడు. మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ మాత్రమే పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలని ఏ విధంగా చెప్పలేదు. ఈ విషయంలో కొంత నిరాశలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఆయన జోష్ నింపారు.
ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజలకు సేవ చేయాలని మీరు ఎంచుకున్న మార్గం, నన్ను గర్వపడేలా చేస్తుంది. ఒక కుటుంబ సభ్యుడిగా నా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది. మీరు అనుకున్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను… అని అల్లు అర్జున్ కామెంట్ చేశారు. అల్లు అర్జున్ మద్దతు నేపథ్యంలో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
My heartfelt wishes to @PawanKalyan garu on your election journey. I have always been immensely proud of the path you've chosen, dedicating your life to service. As a family member, my love and support will always be with you. My best wishes for achieving all that you aspire for.
— Allu Arjun (@alluarjun) May 9, 2024