Iran President: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ ప్రమాదానికి గురైంది. దట్టమైన అడవిలో క్రాష్ అయింది. ఈ ఘటనతో ఇరాన్ ఉలిక్కి పడింది. అధ్యక్షుడు క్షేమంగా తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు కూడా సందేశాలు పంపించారు.
డ్యాం ప్రారంభోత్సవానికి వెళ్లొస్తుండగా..
ఇరాన్–అజర్‌బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఇబ్రహీం రైసీ వెళ్లారు. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరిగి టెహ్రాన్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈస్ట్ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని వర్జాఖాన్ – జోల్ఫా మధ్య విస్తరించి ఉన్న దట్టమైన డిజ్మర్ అడవుల్లో హెలిక్యాప్టర్ క్రాష్ అయింది. ప్రమాద సమయంలో హెలిక్యాప్టర్‌లో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతోపాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హోసైన్స్ అమీరబ్దుల్లాహియాన్, ఈస్ట్ అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ వారి భద్రతా సిబ్బంది ఉన్నారు.
ప్రతికూల వాతావరణంతో..
దట్టమైన పొగమంచు కారణంగా హెలిక్యాప్టర్ క్రాష్ అయినట్లు ఇరాన్ హోం మంత్రి అహ్మద్ వహీదీ ప్రకటించారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలిక్యాప్టర్‌ను ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా కుప్పకూలి ఉంటుందని తెలిపారు.
ఘటన స్థలానికి రెస్క్యూటీంలు..
దట్టమైన అడవిలో ప్రమాదం జరుగడం, వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో సహాయక, భద్రతా సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోవడం ఆలస్యమైంది. ప్రమాదం జరిగిన స్థలాన్ని గుర్తించడంలో కూడా జాప్యం జరిగింది. సోమవారం ఉదయం 40 రెస్క్యూ టీంలు డ్మిర్ అడవుల్లో హెలిక్యాప్టర్ ఆచూకీ కనుగొన్నారు. హెలిక్యాప్టర్ శకలాలను గుర్తించి ఘటన స్థలికి చేరుకున్నారు.
అందరూ మరణించినట్లు ప్రకటన..
హెలిక్యాప్టర్ క్రాష్ అయిన ఘటనలో అందరూ దుర్మరణం చెందినట్లు టెహ్రాన్ ప్రకటించింది. అధ్యక్షుడు కూడా మరణించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.