BRS: కారును చీరి చింతకు కట్టింది అందుకే..

అధికారంలోకి వచ్చిన మొదటి టర్మ్ లో కెసిఆర్ ప్రభుత్వం బాగానే పని చేసింది. అధికారులతో సక్రమంగా పని చేయించుకుంది. పథకాలను ప్రవేశపెట్టింది.

  • Written By: Bhanu Kiran
  • Published On:
BRS: కారును చీరి చింతకు కట్టింది అందుకే..

Follow us on

BRS: ఉద్యమ పార్టీగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. తెలంగాణ ఏర్పాటయిన తర్వాత రెండుసార్లు అధికారంలోకి వచ్చింది.. చాలా వరకు విమర్శలున్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేసింది. అభివృద్ధి పనులు కూడా చేపట్టింది. హైదరాబాద్ బ్రాండ్ ను విస్తరింపజేయడంలో తన వంతు పాత్ర పోషించింది.. కానీ మూడోసారి అధికారంలోకి వస్తుంది అని అనుకుంటుండగా… ప్రజల చేతిలో తిరస్కారానికి గురైంది.. దక్షిణాది రాష్ట్రాలలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన ఘనతను కేసీఆర్ కు దక్కకుండా చేసింది. ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ బాపుగా గౌరవం పొందిన కేసీఆర్ పాచికలు ఈ ఎన్నికల్లో ఎందుకు పారలేదు? కామారెడ్డి లో పోటీ చేస్తే ఆయనను అక్కడి ఓటర్లు ఎందుకు ఓడించారు? ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానం ఈ కథనం.

సిస్టం రిలాక్స్ అయింది

అధికారంలోకి వచ్చిన మొదటి టర్మ్ లో కెసిఆర్ ప్రభుత్వం బాగానే పని చేసింది. అధికారులతో సక్రమంగా పని చేయించుకుంది. పథకాలను ప్రవేశపెట్టింది. అయితే ఈ తరుణంలోనే విమర్శలు రావడంతో ముందస్తుగా ఎన్నికలకు వెళ్ళింది. ప్రజలు మరొకసారి 88 సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చారు. అయితే మొదటి దఫా అధికారంలో టిడిపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కెసిఆర్ పార్టీలో విలీనం చేసుకున్నారు. రెండవసారి అధికాతంలోకి వచ్చిన తర్వాత కూడా కెసిఆర్ కాంగ్రెస్ పార్టీ, టిడిపి ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్నారు. తెలంగాణ శాసనసభలో టిడిపి నే లేకుండా చేశారు.. అయితే మొదటి దఫా లో సక్రమంగా పనిచేసిన సిస్టం.. తర్వాత రిలాక్స్ అవడం మొదలుపెట్టింది. ఇది అనేక దుష్పరిణామాలకు కారణమైంది. ప్రస్తుతం టిఆర్ఎస్ ఎదుర్కొన్న ఓటమి కూడా దాని ప్రభావం వల్లే. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కేసిఆర్ ఎలా అయితే కఠినంగా ఉన్నారో.. రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు అంత మెత్తగా అయిపోయారు. జాతీయస్థాయిలో పార్టీని విస్తరించుకోవాలనుకోవడం, ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద కేసులు పెట్టడం, వారిని అత్యంత అవమానకరంగా జైళ్లకు పంపడం, ప్రశ్నించే పాత్రికేయులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇక సంక్షేమ పథకాల్లో సొంత పార్టీ నాయకుల అవినీతి.. నిండు శాసనసభలో అడ్డగోలుగా మాట్లాడటం, ప్రభుత్వ ధనాన్ని సొంత పార్టీ కార్యకర్తలకు వినియోగించడం.. వంటి పరిణామాలు కెసిఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకున్నాయి.

ప్రజలకు దూరం

వాస్తవానికి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన రాజీనామా చేసే వరకు కెసిఆర్ ప్రజలను కలిసింది అత్యంత తక్కువ. ఎన్నికల ప్రచారం మినహా ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాలను కలియ దిరిగింది లేదు. పైగా సొంత పార్టీ నాయకుల దోపిడీ పెరిగిపోయింది. అవినీతి తారస్థాయికి చేరింది. ప్రతిపక్షాలపై దాడుల సంస్కృతి పెరిగింది. స్థూలంగా చెప్పాలంటే ఎలాంటి తెలంగాణ కావాలి అని ప్రజలు అనుకున్నారో..అది నెరవేరకుండా వేరే వేరే సవాళ్లు పుట్టుకొచ్చాయి. దీనికి తోడు ఆకృత్యాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్లు ఇవ్వడంతో జనాల్లో ఆగ్రహం పెరిగింది. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల మీద పడింది. ఉమ్మడి ఖమ్మం, మహ బూబ్ నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలో భారత రాష్ట్ర సమితి ఏమాత్రం ప్రభావం చూపించలేదు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకంగా కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాలు గెలుచుకుంది అంటే ప్రజల్లో ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన అతి పెద్ద పొరపాటు. అసలే స్థానికుల్లో ఆగ్రహం ఉండడం.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి టికెట్లు ఇవ్వడంతో జనాల్లో కసి బాగా పెరిగింది. అందువల్లే వారు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కేటీఆర్ గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్దుడే అన్నారు కానీ.. జనం ఈ స్థాయిలో గులుగుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారని ఊహించలేకపోయారు. మేము చెప్పిందే చేస్తారు అనుకున్నారేమో గానీ.. రేపు ఓట్ల లెక్కింపు అనగా తుపాకీ ఎక్కిపెట్టిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే చాలామంది కూడా 2018 ఫలితాలు పునరావృతమవుతాయని అనుకున్నారు. చివరికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే నిజమయ్యాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయి. ఇక ఈ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఈ పది సంవత్సరాల కాలంలో చేసిన తప్పులను పున: సమీక్షించుకుంటేనే భారత రాష్ట్ర సమితికి భవిష్యత్తు బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు