Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత లోయలో ప్రశాంత వాతావరణం కనిపించింది. దీంతో భారతీయులు స్వేచ్ఛగా కశ్మీర్‌కు రాకపోకలు సాగించారు. మరోవైపు విదేశీ పెట్టుబడులు కశ్మీర్‌కు వస్తున్నాయి. అయితే రెండుళ్లుగా కశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర కదలికలు పెరిగాయి. కార్యకలాపాలు పెరుగుతున్నాయి. రెండేళ్ళలో ఉగ్రవాదుల దాడుల్లో 48 మంది సైనికులు వీరమరణం పొందారు. ఇదిలా ఉంటే.. తాజాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత, త్వరలో కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. లోయలో అశాంతి, అభద్రత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల ఏరివేతకు భారత ఆర్మీ సిద్ధమైంది సర్ప్ వినాశ్ 2.0 పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించింది. గడిచిన 21 ఏళ్లలో సైన్యం చేపట్టిన అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఇదే. దీనిని నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది. 55 మంది ఉగ్రవాదులను ఏరివేయడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం. ఇక ఈ ఆపరేషన్‌లో భాగస్వాములైన అధికారులు నేరుగా భద్రతా సలహాదారుకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కేంద్రం కూడా ఉగ్రవాదులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, సరిహద్దు దాటి వచ్చిన వారు కచ్చితంగా లొంగిపోవాలని, అరెస్టు కావాలని సూచించింది. లేకుండా లేపేయడం ఖాయమని స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి నితాయనందరాయ్ రాజ్య సభలో తేల్చి చెప్పారు.
ఉంటే జైల్లో.. లేదంటే నరకానికి..
ఇక రాజ్య సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మోదీ నేతృత్వంలోని కేంద్రం ఉగ్రవాదాన్ని ఉపేక్షించదని స్పష్టం చేశారు. కశ్మీర్‌లో కొన్ని రోజులుగా జరుగుతున్న ఉగ్రదాడులకు త్వరలోనే ముగింపు పలుకుతామని తెలిపారు. ఇప్పటికే ఆపరేషన్ మొదలైందని స్పష్టం చేశారు. ఉగ్రవాద రహిత కశ్మీరే తమ లక్ష్యమని వెల్లడించారు. గడిచిన కొన్ని రోజుల్లో 28 మంది ఉగ్రవాదులను లేపేశామని వెల్లడించారు.
త్వరలో కశ్మీర్ ఎన్నికలు..
ఇదిలా ఉంటే.. కశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం తెలిపింది. ఈమేరకు సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నేపత్యంలో వరుస ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. అనంత్‌నాగ్–రాజౌరీ, పూంచ్‌తోపాటు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. లోక్‌సభ ఎన్నిక ఫలితాల తర్వాత ఉగ్రదాడులు పెరిగాయి..
అస్థిరతే లక్ష్యంగా..
భారత్‌లో అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను పెంచుతున్నారు. 2014, 2019లో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఇక 2024లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వరుస దాడులతో కశ్మీర్‌లో అశాంతి సృష్టిండం ద్వారా సంకీర్ణంలో ముసలం పుడుతుందని, తద్వారా ప్రభుత్వం అస్థిర పడుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సైనికులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. ప్రజల జోలికి వెళ్లడం లేదు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే తాము స్థానికంగా ఉండలేమన్న భావనతో పోలీసులు, సైన్యమే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత సైలెంట్ అయిన ఉగ్రవాదులు ఈ ఏడాది జనవరి నుంచి దాడులు పెంచారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా ఉగ్ర వాదులను ఏరివేసే చర్యలు చేపట్టింది. సర్ప్ వినాశ్ 2.0 పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో 55 మంది కీలక ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More