Hyderabad: విశ్వనగరంగా హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే తాజా బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు మంత్రి భట్టివిక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. వీటితోపాటు మెట్రో వాటర్ వర్స్ కోసం రూ.3,385 కోట్లు, జీహెచ్ఎంసీకి రూ.3,065 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రూ.1,525 కోట్లు.పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, శంషాబాద్ విమానాశ్రయం కోసం రూ. 100 కోట్లు, హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ. 500 కోట్లు, హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు కేటాయించారు. మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, ఎంఎంటీఎస్ రూ. 50 కోట్లు కేటాయించారు. బడ్జెట్ ప్రసంగంలో భట్టి మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం హైదరాబాద్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఉద్యోగ, ఉపాధి పొందుతున్నవారికి కార్యాలయాలకు దగ్గరగా, శాటిలైట్ టౌన్షిప్ నిర్మాణాన్ని నగరం చుట్టూ ప్రోత్సహిస్తామన్నారు. ఈ టౌన్షిప్‌లలో సరసమైన ధరల్లో పేద, మధ్యతరగతి వారికి అనుకూలమైన గృహాలు నిర్మస్తామన్నారు. ప్రస్తుతం మూడు ట్రాఫిక్ కారిడార్లలో మెట్రో సౌకర్యం ఉందని, వివిధ వర్గాల అవసరాలను తీర్చడంతోపాటు నగరంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో, ప్రభుత్వం 78.4 కి. మీ. పొడవున్న 5 అదనపు కారిడార్లను రూ.24,042 కోట్లతో అభివృద్ధి పరుస్తుందని తెలిపారు. ఇందులోభాగంగా మెట్రో రైలును పాతనగరానికి పొడిగించి దానిని శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేస్తామన్నారు. ప్రస్తుతమున్న కారిడార్లను నాగోలు నుంచి ఎల్బీ నగర్ వరకు విస్తరిస్తామన్నారు. నాగోలు, ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట స్టేషన్లను ఇంటర్ ఛేంజ్ స్టేషన్లగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. మియాపూర్ నుంచి పటాన్ చెరువుకు, ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించాలని కూడా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.
కోర్ అర్బన్ రీజిన్‌గా గుర్తింపు..
హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాలను కోర్ అర్బన్ రీజియన్‌గా గుర్తించి వాటి అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఔటర్ రింగు రోడ్డును నగర సరిహద్దుగా పరిగణిస్తామని తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలో విపత్తుల నిర్వహణకు ఒక ఏకీకృత సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. పట్టణ విపత్తులను నివారించడానికి, వాటిని ఎదుర్కొనడానికి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడంతో పాటు, ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొని తక్షణ రక్షణ చర్యలు తీసుకొనే విషయంలో జాతీయ, రాష్టేతర సంస్థలతో సమన్వయం చేస్తామన్నారు. ఈ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యత హైదరాబాద్ విపత్తు నివారణ, ఆస్తుల పరిరక్షణ సంస్థ (హైడ్రా) చేస్తుందని తెలిపారు. ఈ సంస్థలో ఆస్తుల పరిరక్షణకు, విపత్తుల నిర్వహణకు ప్రత్యేక విభాగాలు ఉంటాయని వెల్లడించారు.
మూసీ అభివృద్ధి..
ఇక హైదరాబాద్‌లోని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా సుమారు 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతం పునరుజ్జీవనం, నదీ తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య, నివాస కేంద్రాలు, పాత హెరిటేజ్ ప్రాంతాలకు కొత్త సొబగులు అద్దుతామని తెలిపారు. మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులో రిక్రియేషన్ జోన్లు, పాదచారుల జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్స్ థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్ల అభివృద్ధి చేస్తామన్నారు. లండన్ నగరంలో ఉన్న థేమ్స్ నది పరీవాహక అభివృద్ధి తరహాలో మూసీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూ.1,500 కోట్లు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.
నగరాభివృద్ధికి పెద్దపీట..
ఇక హైదరాబాద్ నగర ప్రాధాన్యం దృష్ట్యా నగరాభివృద్ధికి మరింత ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపేట వేసింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు కేటాయించింది. హెచ్‌ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు. విశ్వనగరం హైదరాబాద్‌తో తాగునీటి సమస్య పరిష్కారానికి, నగరమంతా తాగునీరు సరఫరా చేయడానికి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్‌్సకు రూ.3,385 కోట్లు కేటాయించింది. హైడ్రాకి రూ.200 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ట్రిపుల్ ఆర్ అభివృద్ధికి..
ఇక రీజనల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్)తో అభివృద్ధి మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తర ప్రాంతంలోని 158.6 కి.మీ. పొడవున్న సంగారెడ్డి- తూప్రాన్- గజ్వేల్ చౌటుప్పల్ రోడ్డును. దక్షిణ ప్రాంతంలోని 189 కి.మీ.ల పొడవున్న చౌటుప్పల్ -షాద్ నగర్-సంగారెడ్డి రోడ్డును, జాతీయరహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. రీజనల్ రింగు రోడ్డు హైదరాబాద్ నగర ఉత్తర-దక్షిణ ప్రాంతాలనూ, తూర్పు-పశ్చిమ ప్రాంతాలనూ కలుపుతూ జాతీయరహదారి నెట్వర్క్ అనుసంధానం చేస్తామన్నారు. ఎక్స్‌ప్రెస్‌వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించాని నిర్ణయించారు. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత నాలుగు లేన్లతో నిర్మించి దానిని ఎనిమిది లేన్ల సామర్థ్యానికి విస్తరిస్తామని తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ట్రిపుల్ ఆర్ ఉత్తర ప్రాంత అభివృద్ధికి రూ.13,522 కోట్లు, దక్షిణ ప్రాంతాభివృద్ధికి రూ.12,980 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రస్తుత బడ్జెట్‌లో రూ.1,525 కోట్లు ప్రతిపాదించారు.
హైదరాబాద్ పై కాంగ్రెస్ నిధుల వరద వెనుక కారణం అదే
హైదరాబాద్ పై కాంగ్రెస్ బడ్జెట్ లో నిధుల వరద పారించడానికి కారణం ఇక్కడ ఒక్క సీటు గెలవకపోవడమే.. హైదరాబాద్ పరిధిలో మొత్తం ఎమ్మెల్యే సీట్లు అన్నీ కూడా బీఆర్ఎస్ గెలిచింది. మిగిలింది బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ అస్సలు ప్రభావం చూపలేదు. అందుకే నగర ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికే హైదరాబాద్ కు ఏకంగా 10వేల కోట్లను ఖర్చు పెట్టేసి కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక చొరవ చూపుతోంది. దీంతోనైనా బీఆర్ఎస్ ను ఇక్కడ బలం పుంజుకోనీయకుండా చేయాలని ప్లాన్ చేస్తోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: 10 thousand crores for the development of hyderabad in the state budget
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com