AP Legislative Council: ఏపీలో శాంతిభద్రతలపై ఢిల్లీలో వాయిస్ వినిపించింది వైసిపి. జాతీయ స్థాయి నాయకులు సంఘీభావం తెలపడంతో ఈ ధర్నా సక్సెస్ అయ్యింది. వైసీపీలో సైతం ఒక రకమైన జోష్ కనిపిస్తోంది.జాతీయస్థాయిలో ఇండియా కూటమి తమకు అండగా నిలబడుతుందన్న నమ్మకం ఏర్పడింది. ఢిల్లీ పరిణామాలు అలా ఉండగా.. ఏపీలో మాత్రం వైసీపీకి షాక్ తగిలింది. కీలక బిల్లులను ఆమోదం తెలుపుతుంది కూటమి ప్రభుత్వం.అసెంబ్లీలో ఎలాగు బంపర్ మెజారిటీ కూటమికి ఉంది. కానీ మండలిలో మాత్రం వైసీపీ దే పై చేయి. మండలి చైర్మన్ ఆ పార్టీ వారే. దీంతో టీడీపీ కూటమికి చుక్కలు చూపిస్తామని జగన్ భావించారు. కానీ ఫస్ట్ ఛాన్సే మిస్ చేసుకున్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులు శాసనమండలిలో ఇట్టే పాసయ్యాయి.శాసనసభలో ఆమోదం పొందిన ఈ బిల్లులు..శాసనమండలికి వెళ్లాయి.అక్కడ కూడా సభ్యులు ఆమోదం తెలపడంతో.. మండలి చైర్మన్ పాస్ చేయక తప్పలేదు. దీంతో జగన్ ఆశలకు గండి పడినట్లు అయ్యింది. ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉన్నారు.అందులో 38 మంది వైసీపీ వారే. వైసిపి అధికారం కోల్పోయిన మండలిలో మాత్రం ఆధిపత్యం కొనసాగుతోంది. వైసిపి అధికారానికి దూరం కావడంతో శాసనమండలిలో ఆ పార్టీ విపక్ష నేత ఎంపిక అనివార్యంగా మారింది. శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కకున్నా.. శాసనమండలిలో మాత్రం ఆ చాన్స్ దక్కించుకుంది వైసిపి. ఇటీవలే లేళ్ల అప్పిరెడ్డి శాసనమండలి వైసిపి విపక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను శాసనమండలిలో అడ్డుకోవాలని జగన్ ప్లాన్ చేశారు. ఎమ్మెల్సీలకు కూడా ఇటీవల హితబోధ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఢిల్లీ బాట పట్టారు జగన్. తన వెంట ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు రావాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో వారంతా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా.. అధినేత జగన్ వెంట ఢిల్లీ వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులకు శాసనమండలిలో ఎమ్మెల్సీలు ఆమోదం తెలిపారు. శాసనమండలి చైర్మన్ హోదాలో ఉన్న మోషేన్ రాజు పాస్ చేయక తప్పలేదు.
* జగన్ ధీమా
ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. టిడిపి కోటమి ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించింది. వై నాట్ 175 అని సౌండ్ చేసిన వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అయితే తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. నైరాశ్యం లోకి వెళ్లిపోయాయి. అప్పుడే జగన్ మేల్కొన్నారు. పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. రాజ్యసభలో 11 మంది, శాసనమండలిలో 38 మంది బలం తమకుందని.. 15 మంది ఎంపీలు ఉన్నారని.. రాష్ట్రంలో సైతం 50 మంది వరకు ప్రజాప్రతినిధులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా రాజ్యసభ తో పాటు శాసనమండలిలో తమ సత్తా చాటుతామని ప్రకటించారు. శాసనమండలిలో ఎటువంటి బిల్లులు కూడా టిడిపి ప్రభుత్వం పాస్ చేయకుండా చూడాలని కూడా భావించారు. కానీ ఇప్పుడు ఏకంగా రెండు బిల్లులు పాస్ అయ్యాయి.
* అప్పట్లో టిడిపి పట్టు బిగించింది
2019లో జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు శాసనమండలిలో వైసీపీకి కనీస బలం లేదు. అప్పట్లో టిడిపి పట్టు బిగించింది. కీలక బిల్లులు పాస్ కాకుండా అడ్డుకుంది. ఇప్పుడు కూడా అదే మాదిరిగా అడ్డుకుంటామని జగన్ భావించారు. కానీ పరిస్థితి చూస్తే అలా లేదు. అప్పట్లో టిడిపి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. నేడు వైసీపీలో ఆ వ్యూహం కనిపించలేదు. కీలక బిల్లులు శాసనమండలిలో ప్రవేశపెడతారని తెలిసి కూడా.. ఎమ్మెల్సీలను తీసుకొని జగన్ ఢిల్లీ బాట పట్టడం విమర్శలకు తావిస్తోంది.
* ఎమ్మెల్సీల పక్క చూపులు
శాసనమండలిలో చాలామంది ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి బయటకు వస్తారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ లతా జగన్ వెంట ఢిల్లీ వెళ్ళగా.. ఓ ఇద్దరు మాత్రం సభకు హాజరయ్యారు. తోట త్రిమూర్తులు లాంటి వారు బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. శాసనమండలిలో వైసీపీ పక్ష నేత పదవి లభించకపోవడంతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సైతం ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. దాదాపు పది నుంచి 20 మంది ఎమ్మెల్సీలు పార్టీ మారుతారని టాక్ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో వైసిపి ఎమ్మెల్సీలు లేకుండా కీలక బిల్లులు పాస్ కావడం విశేషం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More