Jagan: ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు క్షీణించాయని జగన్ ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున హత్యలు, ఆస్తుల విధ్వంసాలు జరిగాయని జాతీయస్థాయిలో గళమెత్తారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. నిరసన కార్యక్రమానికి జాతీయ పార్టీల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఈ దీక్ష విజయవంతం కావడంతో వైసిపి శ్రేణుల్లో జోష్ నెలకొంది. సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఠాక్రే శివసేన నాయకుడు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ నేత నదీముల్ హక్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఏడీఎంకే, ఇండియన్ ముస్లిం లీగ్ వంటి పార్టీ నేతలు పాల్గొన్నారు. వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఇప్పటివరకు ఎన్డీఏకు సానుకూలంగా ఉన్న జగన్ కు ఇండియా కూటమి నుంచి మద్దతు లభించడం విశేషం. దాదాపు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. వైసీపీకి సంఘీభావం తెలియజేశాయి. టిడిపి కూటమి సర్కార్ పాలనపై విమర్శలు చేశాయి. ధర్నా విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం కనిపిస్తోంది. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసిపి శ్రేణుల్లో ఒక రకమైన నైరాశ్యం కనిపిస్తోంది. అయితే ఈ ధర్నాతో వైసీపీ శ్రేణులు కొంత యాక్టివ్ అయ్యారు. మరోవైపు ఇండియా కూటమి నేతలు జగన్ కు బాహటంగా మద్దతు తెలపడంతో.. వైసిపి అధినేత సైతం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. టిడిపి, జనసేన ఎన్డీఏ కూటమిలో ఉండడంతో.. ఇండియా కూటమిలో చేరడం ఉత్తమమని వైసీపీ శ్రేణులు ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో కీలక నిర్ణయం దిశగా జగన్ ఆలోచన చేస్తున్నారు.
* చంద్రబాబుకు కౌంటర్
చంద్రబాబు వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు శ్వేత పత్రాలు విడుదల చేశారు. 2019 నుంచి 2024 మధ్య జగన్ విధ్వంసకర పాలన సాగించారని.. భారీ అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తొలి మూడు శ్వేత పత్రాలు మీడియా సమావేశం పెట్టి వెల్లడించగా.. మద్యం విధానం పై మాత్రం అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశారు. దానికి కౌంటర్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారు. చంద్రబాబు ఆరోపణలను, విమర్శలను తిప్పి కొట్టాలని నిర్ణయించారు.
* పవర్ పాయింట్ ప్రజెంటేషన్
తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. మీడియా ముందుకు రానున్నారు. గత ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వ హయాంలో వివిధ శాఖలు, విభాగాల్లో అక్రమాలపై చంద్రబాబు మాట్లాడుతున్నారు. దీనికి దీటుగానే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, శాంతిభద్రతలు, ప్రభుత్వం చేసిన అప్పులపై సమగ్రంగా ఇవ్వనున్నారు జగన్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవ పరిస్థితిని వివరించనున్నారు. 2014 నుంచి 2019 మధ్య టిడిపి పాలన, 2019 నుంచి 24 వరకు వైసిపి పాలనను బెరీజు వేస్తూ పలు అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు. జాతీయ మీడియాకు సైతం ఈ ప్రెస్ మీట్ కు ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* ఇండియా కూటమిలో చేరిక?
జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఢిల్లీలో ధర్నా సక్సెస్ కావడంతో జోష్ మీద ఉన్నారు జగన్. మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా తనపై కక్ష సాధింపునకు దిగుతుంది. అందుకే జాతీయస్థాయిలో ఏదో ఒక కూటమిలో చేరాల్సిన అనివార్య పరిస్థితి. ఇండియా కూటమిలో చేరడమా? లేకుంటే అంశాల వారీగా మద్దతు ఇవ్వడమా? అన్నది ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. కీలక ప్రకటన ఉంటుందని వైసీపీ వర్గాలు సైతం భావిస్తున్నాయి. మరి జగన్ ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తారో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More