CM Revanth Reddy: పంచాయతీలే దేశానికి పట్టుగొమ్మలు.. పంచాయతీ అభివృద్ధే దేశ అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. గ్రామ స్వరాజ్యం వర్ధిల్లాలని పిలుపునిచ్చారు. ఆమేరకే రాజ్యాంగంలో స్థానిక సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వబడింది. పంచాయతీల ద్వారా గ్రామాల అభివృద్ధికి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కానీ, పాలకుల నిర్లక్ష్యం కారణంగా.. పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. పల్లెలకన్నా.. పట్టణాల అభివృద్ధికే పాలకులు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇప్పటికీ చాలా గ్రామాల్లో కనీస సదుపాయాలు లేవు. కరెంటు లేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం పాలకుల నిర్లక్ష్యమే. పాలకవర్గాలు ఉంటే.. సమస్యలు కాస్తో కూస్తో పరిష్కారం అవుతాయి. ప్రస్తుతం తెలంగాణలో ఐదు నెలలుగా పంచయతీలకు పాలకవర్గాలు లేవు. ప్రత్యేక అధికారులు పాలనా బాధ్యతలు చూస్తున్నారు. దీంతో పల్లెల్లో సమస్యలు పెరుగుతున్నాయి. అభివృద్ధి కుంటుపడుతోంది. మౌలిక సదుపాయాలు కూడా కల్పించేవారు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం(జూలై 26)న సమీక్ష చేయాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. కులగణన జరిగితేనే రిజర్వేషన్ల పెంపు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీసీ గణన, గణన లేకుండా రిజర్వేషన్ల పెంపుపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
గత సమీక్షలో బీసీ గణనకు నిర్ణయం..
ఇదిలా ఉంటే.. పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జూలై 15న సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ (వెనుకబడిన తరగతుల) కోటాను పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు నివేదిక ఇవ్వాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకు నిధులు కూడా కేటాయించింది. అయితే కుల గణనకు కనీసం ఐదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి ఆరు నెలలు కావస్తోంది. కులగణన చేపడితే మరో ఆరు నెలలు ఎన్నికలు లేకుండానే పంచాయతీల పాలన సాగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జూలై 26న నిర్వహించే సమీక్షలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది.
నిలిచిన కేంద్రం నిధులు..
ఇదిలా ఉంటే.. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం విడదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. ఎన్నికలు జరిగేతేనే నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇక నిధుల కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడాదిగా నిధులు విడుదల చేయడం లేదు. దీంతో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. సమస్యలు పేరుకుపోతున్నాయి. చేపట్టిన పనులకు బిల్లులు రావడం లేదు. ఇప్పటికే గత పాలకవర్గాలకు భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ సమస్యలన్నింటికీ నిధుల కేటాయింపే పరిష్కారం. అందుకు ముందుగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కులగణన చేయకుండానే రిజర్వేషన్ల పెంపు అంశంపై సీఎం సమావేశంలో కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది.
రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు తాజా సమావేశానికి ఎలాంటి ప్రతిపాదనతో వస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం, రానున్న పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరును అధికారులు సమావేశంలో వివరించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. కర్ణాటకలో 2015లో, బిహార్‌లో 2023లో బీసీ గణన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ 2023లో బీసీ కుల గణన చేశారు. కానీ ఫలితాలు వెల్లడించలేదు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Cm revanth reddy key decision on telangana panchayat election
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com