HomeతెలంగాణBRS: తెలంగాణలో కారు టైర్లు పంక్చర్‌.. పార్టీ ఉనికే ప్రశ్నార్థకం!

BRS: తెలంగాణలో కారు టైర్లు పంక్చర్‌.. పార్టీ ఉనికే ప్రశ్నార్థకం!

BRS: ఓడలు బండ్లు అవుతాయి.. బండు ఓడలు అవుతాయి అన్నది సమెత. ఈ సామెత తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రస్తుతం సరిగ్గా సరిపోతుంది. పదేళ్లు తెలంగాణలో నంబర్‌వన్‌గా, తిరుగులేని శక్తిగా ఉన్న పార్టీ.. ఆరు నెలల క్రితం ఓటరు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు రాజకీయంగా నిలదొక్కుకోవడమే ప్రశ్నార్థకమైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కారు స్పీడ్‌కు బ్రేకులు వేయగా.. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికలు.. కారును పంక్చర్‌ చేసింది.

అసెంబ్లీ ఎన్నికల నుంచే పతనం..
పదేళ్లు తెలంగాణకు తాను ప్రభువును అన్నట్లు వ్యవహరించిన కేసీఆర్‌ అతని కుటుంబాన్ని ప్రజాస్వామ్యంతో తమకున్న ఓటు అనే ఆయుధంతో కిందకు దించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ నేతల్లో అహంకారం తగ్గలేదు. ఇదే తరుణంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌ బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన స్కామ్‌లు, కుంభకోణాలను వెలికితీయడం మొదలు పెట్టింది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఢిల్లీ లిక్క స్కాం కేసులో కీలకంగా ఉన్న కేసీఆర్‌ కూతురును అరెస్టు చేసి జైలుకు పంపింది. దీంతో బీఆర్‌ఎస్‌కు చెందిన నేతలు ఇక ఆ పార్టీలో భవిష్యత్‌ లేదని కాంగ్రెస్, బీజేపీబాట పట్టారు.

లోక్‌సభ ఎన్నికల్లో జీరో..
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. లోక్‌సభ ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ భావించారు. దీంతో ఆయనే స్వయంగా బస్సుయాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేశారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని గత ప్రభుత్వం చేసిన అన్ని కుంభకోణాలను అనతికాలంలోనే బయటపెట్టింది. ఇది లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమైంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మోదీ వేవ్‌ బాగా పనిచేసింది. కవితను అరెస్టు చేయకుండా అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పుంజుకుంది. అధికార కాంగ్రెస్‌తో సమానంగా సీట్లు గెలుచుకుంది. దీంతో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు కూడా దక్కించుకోలేక చతికిలపడింది.

కేసీఆర్‌ తప్పు చేసినట్లు భావించి..
ఒకవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఈ రెండు జాతీయ పార్టీలో దూకుడును ఉదుర్కొనేందుకు కేసీఆర్‌ ప్రయత్నం చేసినా.. తెలంగాణ ఓటర్లు బీఆర్‌ఎస్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. కేసీఆర్‌ పదేళ్లలో తప్పు చేశారని భావించారు. మరోవైపు ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ను గెలిపించినా లాభం లేదన్న అభిప్రాయం తెలంగాణలో ఏర్పడింది. ఫలితంగా లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేదు. కేసీఆర్‌ బస్సుయాత్ర కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ సున్నా సీట్లు గెలుచుకుంది.

గులాబీ నేతల పక్క చూపులు..
అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే చాలా మంది నేతలు బీఆర్‌ఎస్‌ను వీడారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో పార్టీ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. దీంతో ఆ పార్టీలో ఉన్న నేతలు కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో టచ్‌లోకి వెళ్లారు. ఈ పరిస్థితిలో పార్టీని నిలబెట్టుకోవడం కేసీఆర్‌ ముందు ఉన్న పెద్ద సవాల్‌.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular