Homeజాతీయ వార్తలుVegetables Prices: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. దేశంలో కూరగాయల బాధ తప్పేదెన్నడు?

Vegetables Prices: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. దేశంలో కూరగాయల బాధ తప్పేదెన్నడు?

Vegetables Prices: వర్షాకాలం ప్రారంభమైంది. వ్యవసాయ పనులు షురూ అయ్యాయి. రైతులు పండించే దిగుబడులు మొన్నటి వరకు మార్కెట్‌కు వచ్చాయి. కొన్ని పంటలు డిమాండ్‌కు మించి రావడంతో ధరలు బాగా తగ్గాయి. కానీ, ప్రస్తుతం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ కూరగాయ రేటు కూడా సామాన్యుడికి అందుబాటులో లేదు. మార్కెట్‌కు వెళ్లి ఏది అడిగినా కిలో రూ.50కిపైనే చెబుతున్నారు. టమాటా రేటుకు అయితే మళ్లీ రెక్కలు వచ్చాయి. కిలో టమాటా రూ.100కు చేరింది. దీంతో కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లిన కొనుగోలుదారులు ధరలు విని షాక్‌ అవుతున్నారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు కొనడం కన్నా నాలుగు కోడిగుడ్లు తెచ్చుకుని వండుకుందాం అని మాట్లాడుకోవడం కనిపిస్తోంది. ఇక ధరల నియంత్రణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న నామమాత్రంగానే ఉన్నాయి. ప్రజలకు ఎలాంటి ఉపశమనం ఇవ్వడం లేదు. మరోవైపు పండించిన రైతులకైనా లాభం కలుగుతుందా అంటే అదీ లేదు. రైతుల వద్ద తక్కువ ధరకే కూరగాయలు కొంటున్న మధ్య దళారులు.. వినియోగదారులకు మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో అటు రైతులకు, ఇటు ప్రజలకు కాకుండా మధ్య దళారులు ఎక్కువగా లాభపడుతున్నారు. కూరగాయల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా టమాటా ధర నియంత్రణకు మార్కెటింగ్‌ శాఖ ద్వారా రైతు బజార్లలో కిలో రూ.50కి విక్రయిస్తోంది. అయితే.. గంట రెండు గంటల వ్యవధిలోనే అమ్ముడవుతున్నాయి. దీంతో మార్కెట్లకు ఆలస్యంగా వచ్చేవారు ఉత్తచేతులతో వెళ్తున్నారు.

తెలంగాణలోనూ అంతే..
ఇక తెలంగాణ ప్రజలకు కూడా వెజ్‌ ట్రబుల్స్‌ తప్పడం లేదు. కూరగాయల రేట్లు.. జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఏ కూరగాయల రేటు అడిగినా కిలో రూ.100పైనే చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా రవాణా కష్టమవుతోందని, తోటలు దెబ్బతింటున్నాయని వ్యాపారులు, రైతులు చెబుతున్నారు. తెలంగాణలో ఏ మార్కెట్‌కు వెళ్లినా కిలో టమాట రూ.100కుపైనే పలుకుతోంది. మిర్చి కూడా రూ.100, చిక్కుడు రూ.120, కాకర, క్యారట్‌ రూ.90, క్యాలీఫ్లవర్, క్యాబేజీ రూ.80 పలుకుతున్నాయి. చౌకగా లభించే ఆకు కూరల రేట్లు కూడా మండిపోతున్నాయి. గతంలో రూ.300లకు వారానికి సరిపడా కూరగాయలు కొనేవారమని, ఇప్పుడు మూడు రోజులకు కూడా సరిపోవడం లేదని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు.

మరింత పెరిగే అవకాశం..
వర్షాలు ఇలాగే కురిస్తే.. కూరగాయల ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణకు ఆంధ్రా ప్రాంతం నుంచి ప్రస్తుతం కూరగాయలు దిగుమతి అవుతున్నాయని, వర్షాల కారణంగా రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. ప్రధానంగా టమాటా కర్నూలు, చిత్తూరు, నంద్యాల జిల్లాల నుంచి వస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ధర పెరిగిందని చెబుతున్నారు. ఇక వర్షాల కారణంగా తెలంగాణలో కూరగాయల పంటలు దెబ్బతినడంతో ఇతర కూరగాయలు కూడా దిగుబడి తగ్గి ధరలు పెరిగాయంటున్నారు. ఉల్లి రేటు కూడా ఘాటెక్కింది. అన్ని రకాల కూరగాయల ధరలు పెరుగుతున్నాయని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఇలా..
ఇక విశ్వనగరం హైదరాబాద్‌లోనూ కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. వర్షాలకు పంటలు దెబ్బతినడం.. సమయానికి పంట చేతికి అందకపోవడంతో దిగుబడులు తగ్గి కూరగాయల ధరలు పెరుగుతన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కిలో టమాట వంద రూపాయలకు పైనే పలుకుతోంది. దీంతో సామాన్యులు టామాటా కొనడానికి కూడా భయపడుతున్నారు. ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌కు నిత్యం 6 వేల క్వింటాళ్ల టమాటాలు వస్తుంటాయి. ప్రస్తుతం 2.5 నుంచి 3వేల క్వింటాళ్లే వస్తున్నాయి. దీంతో టమాటాకు డిమాండ్‌ పెరిగి ధర కొండెక్కింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular