HomeతెలంగాణKCR: బీఆర్‌ఎస్‌ ప్రక్షాళన.. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్న కేసీఆర్‌.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా..?

KCR: బీఆర్‌ఎస్‌ ప్రక్షాళన.. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్న కేసీఆర్‌.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా..?

KCR: భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) అలియాస్‌ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) పార్టీ పుట్టిన నాటి నుంచి సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. వరుస విజయాలతో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడంతోపాటు, సొంత రాష్ట్రంలో రెండుసార్లు పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా తన కొడుకు కల్వకుంట్ల తారకరామారావును నియమించారు. అయితే 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించడంలో విఫలమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ను ఓడించి అధికారం చేపట్టింది. దీంతో అప్పటి నుంచే బీర్‌ఎస్‌ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న చర్చ జరుగుతోంది.

లోక్‌సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యం..
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. 39 సీట్లు సాధించామన్న ధీమాతో కనిపించిన గులాబీ బాస్‌ కేసీఆర్‌.. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ఉనికి కాపాడుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార బాధ్యతలను స్వయంగా తన భుజాలపై వేసుకున్నారు. బస్సు యాత్ర ద్వారా దాదాపు 14 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. సభలు, రోడ్‌షోలతో హోరెత్తించారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న క్యాడర్‌లో ఉత్సాహం తెచ్చారు. తన పాత స్టైల్‌లో మాటలతో మెస్మరైజ్‌ చేసే ప్రయత్నం చేశారు.

ఫలితం ‘సున్నా’..
బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, పదేళ్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ స్వయంగా ప్రచారం చేసినా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని లెక్కలోకి తీసుకోలేదు. ఈ ఎన్నికలు రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మధ్యనే జరిగాయి. దీంతో ఆ రెండు పార్టీలు చెరో 8 లోక్‌సభ స్థానాలు గెలిచాయి. ఎంఐఎం హైదారాబాద్‌ స్థానం నిలబెట్టుకుంది. బీఆర్‌ఎస్‌ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. పోటీచేసిన 17 స్థానాలకు 14 స్థానాల్లో మూడో స్థానానికి పరిమితమైంది.

పార్టీ ప్రక్షాళనపై దృష్టి..
ఎన్నికల ఫలితాల దృష్ట్యా తన వైఫల్యాన్ని గుర్తించిన కేసీఆర్‌.. ఇప్పుడు పార్టీ ప్రక్షాళనపై దృష్టిపెట్టారు. అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకోవాలని భావిస్తున్నారు. కారు స్టీరింగ్‌ను కొత్తవారికి అప్పగించాలని యోగిస్తున్నారు. ఈ క్రమంలో తన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీశ్‌రావు, కూతురు కవిత పేర్లను తన సన్నిహితుల ముందు ప్రతిపాదించారు. కొడుకు ఇప్పటికే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కూతురు లిక్కస్కాం కేసులో జైలుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో వారికి పార్టీ బాధ్యతలు అప్పగించడం సరికాదని సూచించారు. దీంతో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గౌరవ అధ్యక్షడిగా కేసీఆర్‌..
ఇక పార్టీ అధ్యక్షడిని మార్చిన తర్వాత పార్టీ వ్యవస్థాపకుడిని అయిన తాను గౌరవాధ్యక్షుడిగా కొనసాగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడితోపాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతల నుంచి తన కొడుకును కూడా తప్పించాలని నిర్ణియించినట్లు సమాచారం. ఆ పదవిని మాజీ ఐసీఎస్, ఇటీవలే బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular