Telangana Election Results 2023: జనసేన తెలంగాణ లో పోటీ చేసి పరువు పోగొట్టుకుందా ?

వాస్తవానికి జనసేన ఒంటరి పోరుకు ప్రాధాన్యమిచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే 33 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇంతలో బిజెపి నాయకత్వం పవన్ ను ఆశ్రయించింది.

  • Written By: Dharma
  • Published On:
Telangana Election Results 2023: జనసేన తెలంగాణ లో పోటీ చేసి పరువు పోగొట్టుకుందా ?

Follow us on

Telangana Election Results 2023: తెలంగాణ ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ స్పష్టమైన అధిక్యత కనబరిచింది. అధికార బీఆర్ఎస్ తో పాటు బిజెపికి తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. ముఖ్యంగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి దారుణమైన దెబ్బ తగిలింది. బిజెపికి సైతం ప్రజల తిరస్కరణ తప్పలేదు. కానీ గత ఎన్నికల కంటే ఓట్లు, సీట్లు పరంగా మెరుగుపడింది.అయితే బిజెపితో జత కట్టిన జనసేనకు మాత్రం ఝలక్ తగిలింది. ఆ పార్టీ పోటీ చేసిన ఎనిమిది సీట్లలో ఒక్కచోట కూడా గెలవలేదు. దీంతో రకరకాల విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.

వాస్తవానికి జనసేన ఒంటరి పోరుకు ప్రాధాన్యమిచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే 33 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇంతలో బిజెపి నాయకత్వం పవన్ ను ఆశ్రయించింది. మద్దతు తెలపాలని కోరింది. కానీ పొత్తు కుదుర్చుకుంటే ఓకే.. మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని జనసేన వర్గాలు అధినేత పై ఒత్తిడి తెచ్చాయి. దీంతో పవన్ సైతం పొత్తు కుదుర్చుకోవాలని డిసైడ్ అయ్యారు. బిజెపి హై కమాండ్ తో చర్చలు జరిపిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది స్థానాలను జనసేనకు కేటాయించారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి నియోజకవర్గంతో పాటు ఖమ్మం తదితర జిల్లాల్లో మిగతా సీట్లు కేటాయించారు. ఉమ్మడి అభ్యర్థుల తరఫున చివరి నిమిషంలో పవన్ ప్రచారం చేశారు. కానీ కూకట్పల్లిలో జనసేన అభ్యర్థి ఓటమి చవి చూడడం పవన్ కు షాక్ ఇచ్చినట్లు అయింది. తెలుగుదేశం పార్టీతో పాటు సెటిలర్స్, బిజెపి మద్దతు లభిస్తుందని భావించినా.. అటువంటిదేమీ లేకుండా పోయింది. జనసేన అభ్యర్థులు ఓటమి చవిచూడక తప్పలేదు.

తెలంగాణలో జనసేన ఓటమితో ఏపీలో పొత్తు పై ప్రభావం చూపుతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏపీలో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో మద్దతు ఇవ్వకపోవడంపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. ఇదే నా పొత్తు ధర్మం అని ప్రశ్నిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఓట్లు కాంగ్రెస్ కు గుంప గుత్తిగా పడినట్లు ఫలితాలు తెలియజేస్తున్నాయి. విశ్లేషకులు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో పవన్ ఏపీ విషయంలో పునరాలోచనలో పడతారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కానీ అటువంటి పరిస్థితి ఉండదని పవన్ ముందుగానే సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ, ఏపీ రాజకీయ పరిణామాలను వేర్వేరుగా చూపే ప్రయత్నం చేశారు. ఏపీలో జగన్ గద్దె దించడమే తమ ధ్యేయమని చెప్పుకొచ్చారు. ఎవరి రాజకీయ వ్యూహాలు వారికి ఉంటాయని.. ఎవరిని తక్కువ చేసి మాట్లాడవద్దని పార్టీ శ్రేణులకు ఇప్పటికే సంకేతాలు పంపారు.

అయితే తెలంగాణలో పోటీ చేసే విషయంలో పవన్ తప్పటడుగులు వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ మాదిరిగా ఏ పార్టీకి మద్దతు తెలపకుండా ఉండి ఉంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కనీసం బిజెపికి బయట నుండి మద్దతు తెలిపి ఉంటే ఈ స్థాయి ఓటమి ఎదురయ్యేది కాదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే దీనిని పవన్ ముందుగానే లైట్ తీసుకున్నారు. ఎన్డీఏ లో ఉండడంతో బిజెపితో కలవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. కేవలం ఏపీలో వ్యూహం కోసమే తెలంగాణలో జనసేన పోటీ చేసిందన్నకామెంట్ కూడా ఉంది. తెలంగాణలో ఎదురైన చేదు ఫలితాలతో బిజెపి ఒక మెట్టు దిగుతుందని.. ఏపీలో టిడిపి జనసేన కూటమితో కలిసి వస్తుందని.. అందుకే అక్కడ స్నేహాన్ని పవన్ అందించారని.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఆ మూడు పార్టీలు కలిసే వెళ్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో జనసేనకు ఓటమి ఎదురైనా.. బిజెపితో కలిసి వెళ్లడం ద్వారా.. ఏపీలో తాను అనుకున్నది పవన్ సాధించగలుగుతారని.. జగన్ అధికారం నుంచి దూరం చేయగలుగుతారని విశ్లేషణలు వస్తున్నాయి. మరి ఈ పరిణామాలు ఎటు తీసుకెళ్తాయో చూడాలి.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు