Homeఆంధ్రప్రదేశ్‌RK Kothapaluku: అర్కే కొత్త పలుకు: మోడీ ముందు తల వంచండి

RK Kothapaluku: అర్కే కొత్త పలుకు: మోడీ ముందు తల వంచండి

RK Kothapaluku: మోడీ ముందు ఎవరూ నిలబడ లేరు. రేపు అయోధ్య లో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. దేశం మొత్తం రామ నామంతో ఓలలాడుతోంది. ఎక్కడ చూసినా జై మోడీ, జై శ్రీరామ్ అనే పేరు వినబడుతున్నది. మోడీ దెబ్బకు 2024 లో ప్రధాని కావాలి అనే తన కలను 2029 కి రాహుల్ గాంధీ వాయిదా వేసుకొన్నాడు. అంటే అప్పటికి నరేంద్ర మోడీకి 80 వస్తాయి. మహాభారతంలో అస్త్ర సన్యాసం చేస్తే తప్ప భీష్ముడిని నిలువరించలేమని శ్రీకృష్ణుడు చెబుతాడు. ప్రస్తుత దేశంలోని రాజకీయ రణం లో నరేంద్ర మోడీ ఉన్నంతవరకు ఆయనను ఎవరూ ఢీ కొని నిలబడ లేరు. ఇదీ ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక ఓనర్ వేమూరి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులో మచ్చుకు కొన్ని వాక్యాలు. వర్తమాన రాజకీయాలపై సొంత వ్యాఖ్యానాలు చేసే రాధాకృష్ణ.. తెర వెనుక జరిగే విషయాలను బయట పెట్టడంలో ఏమాత్రం వెనుకాడడు. అయితే ఇందులో కొన్ని నిజాలు ఉంటాయి. కొన్ని సత్యదూరాలు ఉంటాయి.. కానీ అంతిమంగా మాత్రం ఒక చర్చకు దారి తీస్తాయి.

మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో దేశంలో చోటుచేసుకుంటున్న రాజకీయాల దగ్గర నుంచి మొదలుపెడితే తెలుగు రాష్ట్రాల్లో పరిణామాల వరకు రాధాకృష్ణ రాసుకు వచ్చాడు. కెసిఆర్ దగ్గర డబ్బు లేదని, గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలు రాష్ట్రాల్లో అపాత్ర దానంగా డబ్బులు ఇచ్చారని.. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారని రాధాకృష్ణ వాపోయాడు. అంతేకాదు గతంలో ఎంతో మంది నాయకులను కలిసిన కేసిఆర్.. ఇప్పుడు తాను ఆ దుస్థితిలో ఉంటే ఏ ఒక్క నాయకుడు కూడా పరామర్శించడం లేదని.. మిగతా నాయకులకు వారి నలుపు కడుక్కోవడమే సరిపోతుందని రాధాకృష్ణ రాసుకొచ్చాడు.. ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ తన దగ్గర డబ్బు ఏమీ మిగుల్చుకోకుండా కెసిఆర్ దానం చేశాడా? అలాగైతే కెసిఆర్ డబ్బులు తీసుకున్న నాయకులు కొంతలో కొంతైనా కృతజ్ఞత చూపిస్తారు కదా? తమిళనాడు నుంచి జార్ఖండ్ వరకు కేసీఆర్ సొంత ఖర్చులతో ఏమైనా వెళ్ళాడా? గాల్వాన్ లోయలో చనిపోయిన జవాన్లకు పరిహారం ఇచ్చింది తెలంగాణ ఖజానా నుంచే కదా? చివరికి తన జాతీయ రాజకీయాల కోసం కూడా ప్రభుత్వ ఖజానా నుంచే డబ్బులు ఖర్చు పెట్టాడు కదా? అలాంటప్పుడు కెసిఆర్ చేసిన అపాత్ర దానం ఏముంది? కెసిఆర్ ప్రస్తుతం మంచం మీద ఉన్నాడు కాబట్టి.. ఎలాగూ గతంలో తన స్నేహితుడు కాబట్టి రాధాకృష్ణ వెనుకేసుకొస్తున్నాడా?

జాతీయ, తెలంగాణ రాజకీయాలను మాత్రమే కాకుండా ఏపీ రాజకీయాలను కూడా రాధాకృష్ణ ప్రస్తావించాడు. ఏపీలో బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ లేకుండా పోయిందని.. అందుకే జగన్ భుజం మీద తుపాకీ పెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టారని రాధాకృష్ణ బాధపడిపోయాడు.. చంద్రబాబుకు భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుందని.. అందుకే పార్టీ క్యాడర్ చెక్కుచెదరకుండా కాపాడుకుంటున్నారని రాధాకృష్ణ వెనుకేసుకు వచ్చాడు. చంద్రబాబు కు గట్టి క్యాడర్ ఉంటే ఇతర పార్టీల నుంచి నాయకులను తన పార్టీలోకి ఎందుకు ఆహ్వానిస్తున్నారు? చంద్రన్న పిలుస్తున్నాడు రా కదలిరా అని ఎందుకు పిలుపునిస్తున్నాడు? వైసీపీ నుంచి నాయకులు వస్తుంటే ఇంకా రండి అని ఎందుకు ఆహ్వానం పలుకుతున్నాడు? బలమైన క్యాడర్ ఉన్న నాయకుడు ఇలాంటి చేరికలకు ఎందుకు ప్రాధాన్యమిస్తున్నాడు? అలాంటి బలమైన నాయకుడే అయితే నరేంద్ర మోడీతో ఎందుకు పొత్తును కోరుకుంటున్నాడు? ఎన్ డీ ఏ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ తో ఎందుకు సంధి కుదుర్చుకుంటున్నాడు? ఇలాంటి వాటిని రాధాకృష్ణ రాయడు. పైగా జగన్ బిజెపితో అంట కాగుతున్నాడు.. జగన్ ఏపీ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నప్పటికీ మోడీ పట్టించుకోవడంలేదని మాత్రం రాధాకృష్ణ రాశాడు. తనకు నచ్చిన, తాను మెచ్చిన చంద్రబాబు గొప్పోడు.. మిగతా పార్టీ వాళ్లు మాత్రం చెడ్డవాళ్ళు. అంతేనా రాధాకృష్ణా.. ఇదేనా వర్తమాన అంశాలపై రాసే కొత్త పలుకు? చంద్రబాబు ప్రస్తావన వస్తే చాలు రాధాకృష్ణ మారిపోతాడు. ఆయన రాతలు కూడా మారిపోతాయి..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular