YS jagan : జగన్ తరచూ బెంగళూరు వెళ్లడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఆయన పొలిటికల్ ఎంట్రీ సమయంలో బెంగళూరు నుంచే రాకపోకలు సాగించేవారు. గాలి జనార్దన్ రెడ్డి లాంటి నేతలతో సయోధ్య ఉండేది. వ్యాపారాలు బెంగళూరు కేంద్రంగా సాగేవి. అటు కడప ఎంపీగా ఉన్న సమయంలో సైతం బెంగళూరు నుంచి ఎక్కువగా కార్యకలాపాలు సాగించేవారు. వైసిపి ఆవిర్భావం నుంచి మాత్రం బెంగళూరు రాకపోకలు తగ్గాయి. గత ఐదేళ్ల కాలంలో ఆయన బెంగళూరు వెళ్ళింది కూడా చాలా తక్కువ. అక్కడ భారీ ప్యాలెస్ తో పాటు వ్యాపార సామ్రాజ్యం ఉంది. కానీ అటువైపు వెళ్లిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత.. 50 రోజుల వ్యవధిలోనే మూడుసార్లు బెంగళూరు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక రకరకాల చర్చ నడుస్తోంది. ఇండియా కొట్టిన వైపు అడుగులు వేస్తున్న జగన్.. కాంగ్రెస్ తో సయోధ్య కోసమే బెంగళూరు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఉండడంతో.. అటువైపు దృష్టి పెట్టినట్లు టాక్ నడుస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ఏపీ, తెలంగాణ కంటే కర్ణాటక శ్రేయస్కరమని జగన్ భావిస్తున్నారు. అక్కడ ఉండేందుకు మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాదులో లోటస్ ఫండ్, తన మీడియా కార్యాలయాలు, ఇతర వ్యాపారాలు ఉన్నా.. కర్ణాటక వైపు మొగ్గు చూపడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ కంటే బెంగళూరు సేఫ్ జోన్ గా ఆయన భావించడం వెనుక రకరకాల కథనాలు, వార్తలు వస్తున్నాయి.
* పులివెందుల టూ బెంగళూరు
జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అదే నెల 12న సీఎం గా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ తో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ జగన్ మాత్రం తన సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లారు. అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు. వారం రోజులు పాటు అక్కడే గడిపారు. తరువాత తాడేపల్లి కి చేరుకున్నారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించి ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ దానిని ఉన్నపలంగా వాయిదా వేసి బెంగళూరు వెళ్ళిపోయారు. అటు నుంచి వచ్చిన ఆయన తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపిస్తూ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఢిల్లీలో ధర్నా చేపట్టి తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు. ఇప్పుడు బెంగళూరు మరోసారి వెళ్తున్నారు.
* వైసీపీ శ్రేణుల్లో అనుమానం
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని జగన్ ఆరోపిస్తున్నారు. వైసీపీ శ్రేణులపై దాడులు కొనసాగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సమయంలో పార్టీ శ్రేణులకు ఆయన అండగా నిలవాలి. కానీ ఆయన రాష్ట్రంలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. బయట రాష్ట్రాల్లోనే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది పార్టీ శ్రేణులకు సైతం మింగుడు పడటం లేదు. ఇటువంటి క్లిష్ట సమయంలో అందుబాటులో ఉండాల్సింది పోయి.. తరచు వెళ్ళిపోతుండడాన్ని వారు తప్పుపడుతున్నారు.
* రోజుల వ్యవధిలోనే..
ఒక పార్టీ అధినేతగా రాజకీయ పర్యటన చేసుకునే హక్కు జగన్ కు ఉంది. అయితే ఆయన పర్యటన ఎలాంటిదైనా.. రోజుల వ్యవధిలోనే తిరిగి బెంగళూరు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు వేస్తున్నారనిప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా ఉన్న కర్ణాటక కు తరచూ వెళ్తుండడం మాత్రం చర్చకు దారితీస్తోంది.ముఖ్యంగా డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి దగ్గర ఎందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నది ఒక ఆరోపణ. శివకుమార్ వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిపీసీసీ పగ్గాలు తీసుకోవడానికి ఆయనే కారణం. అందుకే ఇప్పుడు డీకే శివకుమార్ ద్వారా ఇండియా కూటమితో పాటు కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలన్నది జగన్ ప్రయత్నం గా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే అటువంటిదేమీ లేదని డీకే శివకుమార్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. మరి జగన్ బెంగళూరు తరచూ వెళ్తోంది ఎందుకో ఆయనకే తెలియాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More