Gulf Countries : విదేశీ కొలువుల కలలు కల్లలుగా మారుతున్నాయి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. విదేశీ ఉద్యోగాల ఆశలు నిలువునా మునిగేలా చేస్తున్నాయి. విదేశాల్లో ఆకర్షణీయమైన ఉద్యోగాల పేరిట ఊరిస్తున్న అందమైన ప్రకటనలు బాధితులను ఊహించని చిక్కుల్లో పడేస్తున్నాయి. రోజురోజుకు ఈ తరహా మోసాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో తెలుగు యువత ఎడారి బతుకుల్లో మగ్గిపోతున్నారు. టూరిస్ట్ వీసా పై తీసుకెళ్లి విదేశాల్లో యువతను అమ్మకానికి పెడుతున్నారు. మరోవైపు విదేశాల్లో బంధించి హింసలకు గురి చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇటీవల గల్ఫ్ దేశాలకు తీసుకెళ్లి యువతను చిత్రహింసలు పెడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మొన్న శివ అనే యువకుడు.. నిన్న మరో యువకుడు సోషల్ మీడియాలో ఆర్తనాదాలు చేశారు. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం వారిని స్వస్థలాలకు తెప్పించింది. ఇప్పుడు తాజాగా ఓ మహిళ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. నాలుగు నెలల కిందట ఒమన్ వెళ్లిన ఆమె.. ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఆమెకు అనారోగ్యంగా ఉన్నా పనిచేయించుకుంటున్నారు. రాత్రి 2 గంటల వరకు విడిచిపెట్టడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అక్కడే ఉంటే తాను చనిపోతానని కన్నీరు మున్నీరవుతోంది. మంత్రి లోకేష్ స్పందించాలని వేడుకుంటుంది. ఏజెంట్ మధ్యలో వదిలేశాడని.. ఇప్పుడు ఫోన్ చేసినా స్పందించడం లేదని చెబుతోంది. ప్రభుత్వమే స్పందించి తనను స్వగ్రామానికి తీసుకెళ్లాలని కోరుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇటీవల ఇటువంటి వీడియోలు వైరల్ కావడం.. దానికి ప్రభుత్వం స్పందించడం.. వారిని క్షేమంగా తీసుకురావడంతో ఎక్కువమంది సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు.
* భారత్ నుంచి వలసలు అధికం
గల్ఫ్ దేశాలలో ఒమన్, సౌదీ అరేబియా, కువైట్, బెహ్రేయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ తదితర దేశాలు ఉన్నాయి. 1981 లోనే ఓ కౌన్సిల్ గా ఏర్పడ్డాయి. గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ అని పేరు పెట్టుకున్నాయి. అయితే ఆసియా దేశాల నుంచి జిసిసికి వలసలు ఎక్కువ. మన దేశం నుంచి 90 లక్షల మంది వలస వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా కువైట్లో తెలుగు వారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉపాధి లేక ఎక్కువమంది వలస బాట పడుతున్నారు. గతంలో బాగానే ఉన్నా.. ఇటీవల దళారులు ఎంటర్ అయ్యారు. రకరకాల పనులు పేరు చెప్పి దేశం కాని దేశం తీసుకెళ్తున్నారు. బందీలుగా మార్చి.. ఎడారిలో మగ్గేలా చేస్తున్నారు.
* ఇప్పుడంతా దళారులు
గతంలో విదేశీ కంపెనీలు వచ్చి నైపుణ్యం గల వారిని తీసుకెళ్లేవి. విమాన ఖర్చులు సైతం భరించేవి. కానీ ఇప్పుడు ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. మ్యాన్ పవర్ పేరిట కొన్ని సంస్థలు సైతం పుట్టుకొచ్చాయి. ఎక్కడికక్కడే ఏజెంట్లను నియమించుకొని యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. టూరిస్ట్ విసాపై తీసుకెళ్లి వారితో పనులు చేయిస్తున్నాయి. ఇలా తీసుకెళ్లిన చాలామంది నిబంధనలకు విరుద్ధంగా ఆయా దేశాల్లో పని చేస్తుండడంతో.. కేసులు కూడా చుట్టుముడుతున్నాయి. చాలామంది జైలు జీవితం కూడా గడపాల్సి వస్తోంది.
* వెట్టి చాకిరితో సతమతం
అయితే ప్రధానంగా గల్ఫ్ కంట్రీస్ లో వెట్టి చాకిరి అధికం. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మందిని తీసుకెళ్తున్నారు. వారికి ఎడారిలో ఒంటెలు, జంతువులు, పక్షులకు సంరక్షించే పని అప్పగిస్తున్నారు. మహిళలకు ఇళ్లలో పనులు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో వారిపై లైంగిక దాడులు కూడా జరుగుతున్నాయి. మరోవైపు వ్యభిచార కూపంలోకి కూడా దించుతున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చాక ఇలా చిక్కుకున్న వారి విషయంలో చొరవ చూపుతున్నారు. దీంతో బాధితులు ధైర్యంతో ముందుకు వస్తున్నారు.
* పవన్ అనుమానం నిజమవుతోంది
గతంలో విపక్ష నేతగా పవన్ ఉన్నప్పుడు మహిళల అక్రమ రవాణాపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని.. దీని వెనుక మిస్టరీ ఉందని కూడా నాడు పవన్ చెప్పుకొచ్చారు. అయితే అప్పట్లో పవన్ మాటలను తేలిగ్గా తీసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇప్పుడు మహిళలు విదేశాల్లో చిక్కుకొని సహాయాన్ని అర్ధిస్తుండటం.. వాస్తవమేనని తేలుతోంది. మరోవైపు టిడిపి కూటమి ప్రభుత్వంలో కొత్తగా విదేశీ వ్యవహారాల శాఖను కూడా కేటాయించారు. ఎప్పుడైనా విదేశాల్లో ఏపీ యువత చిక్కుకున్నా, విదేశాల్లో ఉన్న విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైనా.. వేగంగా స్పందించేలా ఒక శాఖను ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇప్పుడు నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో.. విదేశాల్లో చిక్కుకున్న వారు క్షేమంగా బయటపడుతున్నారు. అయితే విదేశాల్లో ఇబ్బంది పడుతున్న వారు క్షేమంగా స్వస్థలాలకు చేరుకునే విధంగా ఒక ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: A womans video is viral in the gulf countries
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com