Huzurabad: ఓటరు పల్స్‌ : హుజూరాబాద్‌లో ‘ఈటల’ గట్టి పోటీ.. ఓట్లు చీల్చనున్న కాంగ్రెస్‌ అభ్యర్థి!

హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు పాడి కౌషిక్‌రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు కాంగ్రెస్‌ టికెట్‌పై ఈటలతో తలపడ్డారు. కానీ రెండుసార్లు ఓడిపోయారు. ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌పై పోటీ చేస్తున్నారు.

  • Written By: Raj Shekar
  • Published On:
Huzurabad: ఓటరు పల్స్‌ : హుజూరాబాద్‌లో ‘ఈటల’ గట్టి పోటీ.. ఓట్లు చీల్చనున్న కాంగ్రెస్‌ అభ్యర్థి!

Follow us on

Huzurabad: తెలంగాణలో కీలకమైన మరో నియోజకవర్గం హుజూరాబాద్‌. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, బీజేపీ ఎలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ సొంత నియోజకవర్గం ఇది. ఇక్కడి నుంచి ఈటల రాజేందర్‌ ఇప్పట ఇరకు ఏడుసార్లు విజయం సాధించారు. ప్రతీసారి తిరుగులేని మెజారిటీ సాధిస్తూ.. హుజూరాబాద్‌ గడ్డ.. ఈటల అడ్డా అన్నట్లుగా మార్చేశారు. కానీ, మూడు దశాబ్దాల తర్వాత ఇక్కడ ఈటల గట్టి పోటీ ఎదుక్కొంటున్నారు. బీజేపీ తరఫున హుజూరాబాగ్, గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌ ఈసారి రెండుచోట్ల గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ గ్రౌండ్‌ రిపోర్ట్‌ ఇందుకు విరుద్ధంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. స్థానిక ఓటర్లు ఈసారి మార్పు కోరుకుంటున్నారు. మరోవైపు ఈసారి ఇక్కడి నుంచి బరిలో దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి భారీగా ప్రభుత్వ వ్యతిరే ఓట్లను చీలుస్తారని తెలుస్తోంది. దీంతో ఈసారి ఈటల గెలుపు అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కౌషిక్‌.. అలుపెరుగని యుద్ధం..
హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు పాడి కౌషిక్‌రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు కాంగ్రెస్‌ టికెట్‌పై ఈటలతో తలపడ్డారు. కానీ రెండుసార్లు ఓడిపోయారు. ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఈటలను ఓడించాలని సర్వశకక్తులు ఒడ్డుతున్నారు. చివరకు తన భార్య, బిడ్డను కూడా ప్రచారంలోకి దించాడు. కౌషిక్‌రెడ్డి భార్య అయితే ఏకంగా కొంగుచాపి తన భర్తకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని అర్థిస్తోంది. ఇక కౌషిక్‌రెడ్డి 12 ఏళ్ల కూతురు కూడా తండ్రిని గెలిపించాలని ప్రచార సభల్లో ప్రసంగిస్తోంది. మా నాన్నను గెలిపిస్తే హుజూరాబాద్‌ను హైదరాబాద్‌లా మారుస్తాడని చెబుతోంది. అదే విధంగా రామక్క పాటకు రీల్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ప్రచారం నిర్వహిస్తోంది. దీంతో ఈసారి కౌషిక్‌కు సానుభూతి ఓట్లు పడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఒడితెల ప్రణవ్‌..
ఇక ఈసారి కాంగ్రెస్‌ కూడా బలమైన అభ్యర్థిని హుజూరాబాద్‌ బరిలో దించింది. ఉప ఎన్నికల్లో బల్మూరి వెంకట్‌ను ఈటలపూ పోటీ చేయించింది. కానీ డిపాజిట్‌ కూడా రాలేదు. దీంతో ఈసారి ఒడితెల ప్రణవ్‌. టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు మనుమడు ప్రణవ్‌. నియోజకవర్గ పునర్విభజనకు ముందు హుస్నాబాద్, హుజూరాబాద్‌ కమలాపూర్‌ నియోజకవర్గంలో ఉండేవి. కమలాపూర్‌లో కెప్టెన్‌కు మంచి పట్టు ఉంది. దీంతో ఈసారి కాంగ్రెస్‌ పార్టీ కెప్టెన్‌ మనుమడిని హుజూరాబాద్‌ బరిలో నిలిపింది. దీంతో భారీగా ఓట్లు చీలుస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రణవ్‌ కూడా బీఆర్‌ఎస్, బీజేపీకి దీటుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోతో గెలుపుపై ధీమాతో ఉన్నారు.

‘ఈటల’కు అంత ఈజీ కాదు..
ఒకవైపు కౌషిక్‌రెడ్డి, మరోవైపు ఒడితెల ప్రణవ్‌.. ఈసారి హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. మరోవైపు ఈటల ఈసారి హుజూరాబాద్‌ కంటే.. గజ్వేల్‌పైనే ఎక్కువ దృష్టిపెట్టారు. ఇక్కడ ఆయన సతీమణి జమునారెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే బీజేపీ అధికారంలోకి వస్తే ఈటల ముఖ్యమంత్రి అవుతాడన్న ప్రచారం హుజూరాబాద్‌లో విస్తృతంగా జరుగుతోంది. అదొక్కటే ఈటలకు పాజిటివ్‌. ఇక ప్రణవ్‌ ఓట్లను చీలుస్తారని భావిస్తుండడంతో అటు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కౌషిక్‌రెడ్డి, ఇటు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ టెన్షన్‌ పడుతున్నారు. ప్రణవ్‌ ఎవరి ఓట్లు చీలుస్తాడో అన్న ఆందోళన రెండు పార్టీల్లో కనిపిస్తోంది.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు