Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీలో సందడి లేదు. వర్గ పోరాటం కారణంగానే తీవ్రంగా నష్టపోయిన ఆ పార్టీలో.. ఫలితాల తర్వాత కూడా వర్గపోరు కొనసాగుతోంది. మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ప్రస్తుత అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వర్గాల మధ్య కొన్ని రోజుల క్రితం మొదలైన ముసలం.. ఇప్పుడు తీవ్ర స్థాయిలో జరుగుతోంది.
సంజయ్‌ను తప్పించి చతికిల పడి..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కొంత మంది నేతల ఒత్తిడితో బీజేపీ అధిష్టానం అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించింది. ఈమేరకు ఒత్తిడి తెచ్చిన నేతలుగా ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, ఎంపీ అర్వింద్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇక కిషన్‌రెడ్డి సారథ్యంలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. కానీ, పూర్తిగా చతికిలపడింది. బండి సంజయ్‌ను తప్పించేందుకు యత్నించిన నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. బండి సంజయ్ సారథిగా కొనసాగిఉంటే కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ఉండేదన్న సరికొత్త వాదనలు ఆయన అనుచరవర్గం తెరపైకి తీసుకొచ్చింది. దీంతో బండి సంజయ్ అనుచరులకు కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈటల రాజేందర్ అనుచరులు. తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్న వారికి బండి సంజయ్ వారిని కూడా గెలిపించుకోలేకపోయారని విమర్శిస్తున్నారు. చివరకు తన పార్లమెంట్ పరిధిలోకూడా ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయారని ఈటల అనుచరులు ఫైర్ అవుతున్నారు.
శృతి మించుతున్న సోషల్ వార్..
ఒకవైపు బండి, మరోవైపు ఈటల అనుచరుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు శృతి మించుతుండడంతో ఈటల రాజేందర్ స్పందించారు. సోషల్ మీడియాలో తన పేరుతో.. తన అనుచరుల పేరుతో పెడుతున్న పోస్టులన్నీ ఫేక్ అని ప్రకటించారు. అయితే ఈ సోషల్ మీడియా వార్ బండి, ఈటలకు మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్‌రెడ్డిని సైతం వదలడం లేదు. పార్టీ ఓటమికి కారణం ఆయనేనని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనిని కంట్రోల్ చేయాల్సిన నేతలు మాత్రం మౌనం వహిస్తున్నారు.
బండికి మళ్లీ బాధ్యతలు..?
బండి సంజయ్‌కు మళ్లీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో దానిపై పార్టీ కార్యకర్తలు వెటకారంగా పోస్టులు పెడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి సీనియర్ నేతలంతా సైలెంట్ అయ్యారు. దీనికి కారణం తాము టిక్కెట్లు ఇప్పించుకున్న వారు ఓడిపోవడమే. కిషన్‌రెడ్డి అంబర్‌పేట నియోజకవర్గంలో బీజేపీని గెలిపింలేకపోయారు. పార్లమెంట్ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో మూడు నెలల్లోనే ఉన్నాయి. మరోవైపు బీజేపీలో ముసలం ముదురుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కొంత మంది సీనియర్లు ఆ పార్టీ వైపు చూసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More