Revanth Reddy: 22 ఏళ్లకు ప్రేమ.. 24వ ఏట పెళ్లి.. 17 ఏళ్ల రాజకీయ అనుభవానికి సీఎం!

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో 1969 నవంబర్ 8న నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు రేవంత్ రెడ్డి జన్మించారు.

  • Written By: Suresh
  • Published On:
Revanth Reddy: 22 ఏళ్లకు ప్రేమ.. 24వ ఏట పెళ్లి.. 17 ఏళ్ల రాజకీయ అనుభవానికి సీఎం!

Follow us on

Revanth Reddy: అనుముల రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా రేపు హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాబోతున్నారు. తెలంగాణ ఇచ్చిన 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి వంటి వారు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేవంత్ రెడ్డి వర్గీయులు కూడా రెట్టించిన ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి గురించి అనేక చర్చలు నడుస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రేవంత్ రెడ్డి ఇక్కడిదాకా ఎలా ఎదిగారు? ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు? 24 ఏళ్లకే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆయన.. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి నుంచి ఎటువంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఈ కథనం

కొండారెడ్డి పల్లి లో జననం

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో 1969 నవంబర్ 8న నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు రేవంత్ రెడ్డి జన్మించారు. రేవంత్ రెడ్డికి ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ప్రాథమిక విద్య మొత్తం ప్రభుత్వ పాఠశాలలోనే రేవంత్ రెడ్డి పూర్తి చేశారు. ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివారు. హైదరాబాద్ ఏవీ కాలేజీలో బిఏ చదివారు. చిన్నతనంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేపథ్యంతో డిగ్రీ చేస్తున్న సమయంలో ఏబీవీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసి ఆర్టిస్టుగా మారారు. ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారు. కొంతకాలానికి స్థిరాస్తి వ్యాపారం లోకి ప్రవేశించారు. రేవంత్ రెడ్డిది ప్రేమ వివాహం. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దివంగత జైపాల్ రెడ్డి తమ్ముడు పురుషోత్తం రెడ్డి కుమార్తె గీతారెడ్డి ని రేవంత్ రెడ్డి ప్రేమించారు. రేవంత్ రెడ్డి ప్రేమించినప్పుడు గీతారెడ్డి ఇంటర్ చదువుతున్నారు. ఇంటర్ అనంతరం గీతారెడ్డి ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ కోర్సులో జాయిన్ అయ్యారు. డిగ్రీ పూర్తి అయిన తర్వాత పెద్దలను ఒప్పించి 1992లో వారు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకునే నాటికి రేవంత్ వయసు 24 సంవత్సరాలు. రేవంత్ రెడ్డి, గీతారెడ్డికి నైమిశా రెడ్డి అనే కూతురు ఉన్నారు.

జై పాల్ రెడ్డి నో చెప్పారు

రేవంత్ రెడ్డి, గీతా రెడ్డి వివాహానికి జైపాల్ రెడ్డి నో చెప్పారు. కారణాలు తెలియదు గాని రేవంత్ రెడ్డి అంటే జైపాల్ రెడ్డికి ఎందుకో అంత ఇష్టం ఉండేది కాదు. పురుషోత్తం రెడ్డి కూతురు గీతారెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వస్తుంటే జైపాల్ రెడ్డి మొదట్లో ఇష్టపడలేదు. రేవంత్ రెడ్డి జెడ్పిటిసి గా విజయం సాధించిన తర్వాత ఆయన కల్వకుర్తి రాజకీయాల్లో కీలకంగా మార్చుతారా అని విలేకరులు ప్రశ్నిస్తే గుర్రాన్ని, గాడిదను ఒకే గాటన కడతారా అంటూ జైపాల్ రెడ్డి ఒకింత విసురుగా సమాధానం చెప్పారు. అయితే జైపాల్ రెడ్డి సమాధానానికి రేవంత్ రెడ్డి కొంత నొచ్చుకున్నారు. ఆ తర్వాత తాను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవుతానని, ఉమ్మడి పాలమూరు ప్రజల బాధను పార్లమెంటులో వినిపిస్తానని అప్పట్లో ఆయన శబ్దం చేశారు. అనుకున్నట్టుగానే దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు స్థానమైన మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే జయపాల్ రెడ్డి చనిపోక ముందు రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు.

సులభంగా దక్కలేదు

రేవంత్ రెడ్డి జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వచ్చినప్పటికీ మంచి కష్టాలు ఎదుర్కొన్నారు. ఇంటి వద్ద నుంచి డబ్బు కోసం ఆశించకుండా సొంత సంపాదన పై దృష్టి సారించారు. జాగృతి అనే పత్రికలో విలేకరిగా తన జీవితాన్ని ప్రారంభించారు. ఆర్టిస్టుగా పనిచేశారు. ప్రింటింగ్ ప్రెస్ నడిపారు. ముఖ్యంగా స్క్రీన్ ప్రింటింగ్ లో అద్భుతాలు సృష్టించారు.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.. తన మామ సోదరుడు జయపాల్ రెడ్డికి ఆ రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకు ముఖ్యమంత్రి పదవి వచ్చినట్టే వచ్చి చేజారి పోయింది. అందుకు జైపాల్ రెడ్డి మనస్తత్వం కూడా ఓ కారణమని ఆయన అంతరంగికులు అంటుంటారు. అయితే జైపాల్ రెడ్డికి కలగానే మిగిలిన ముఖ్యమంత్రి పదవిని ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి నెరవేర్చారు.

సోదరులే బలగం

రేవంత్ రెడ్డి జీవితంలో, రాజకీయాల్లో ఎదిగేందుకు ప్రధాన కారణం ఆయన కుటుంబం. ఆయన సోదరుడే కొండంత బలం.. కష్టాల్లో సుఖాల్లో రేవంత్ రెడ్డికి అండగా ఆయన సోదరులు ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఏడుగురు సోదరులు, ఒక సోదరి. పెద్దన్న భూపాల్ రెడ్డి ఎస్సైగా పనిచేసి పదవి విరమణ పొందారు. రెండవ సోదరుడు కృష్ణారెడ్డి సర్పంచ్ గా పని చేశారు.. రేవంత్ రెడ్డి సోదరి సుమతమ్మ జంగారెడ్డిపల్లి సర్పంచ్ గా పనిచేశారు. మరో సోదరుడు తిరుపతిరెడ్డి వ్యాపారం చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గం లో రేవంత్ రెడ్డి విజయ వెనుక తిరుపతిరెడ్డి పాత్ర అత్యంత కీలకం. ఇక ఇంకొక సోదరుడు జగదీశ్వర్ రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. ఆయనకు అక్కడ అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి. మరో సోదరులు కొండల్ రెడ్డి, కృష్ణారెడ్డి హైదరాబాదులో వ్యాపారం చేస్తున్నారు. వీరిద్దరు కూడా రేవంత్ రెడ్డి వ్యవహారాలలో పర్యవేక్షిస్తుంటారు. కొండల్ రెడ్డి కూడా కొంతకాలం అమెరికాలో ఉండి వచ్చారు. ఆయనకు రాజకీయ సంబంధాలు చాలా ఎక్కువ.. ఇటీవల కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయన ప్రచార బాధ్యతలు మొత్తం కొండల్ రెడ్డి చూశారు. కొండల్ రెడ్డి చూడ్డానికి రేవంత్ రెడ్డి లాగానే ఉంటారు. రేవంత్ రెడ్డి లాగానే దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు