Revanth Reddy And Chandrababu: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయింది. అయినా విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం (జూన్ 6న) సమావేశం కాబోతున్నారు. ఇందుకు తెలంగాణ ప్రగతి భవన్ వేదిక కానుంది. అయితే పెండింగ్ సమస్యల్లో చాలా వరకు క్లిష్టమైనవే. వీటికి ఒక్క సమావేశంలో పరిష్కారం దొరకడం అసాధ్యం. కాకపోతే పరిష్కారానికి రోడ్ మ్యాచ్ పడుతుందని ఇరు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు.
సెంటిమెంటు రాజేస్తూ పబ్బం గడిపిన కేసీఆర్..
ఇదిలా ఉంటే తెలంగాణకు పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ విభజన సమస్యల పరిష్కారానికి ఏనాడూ కృషి చేయలేదు. కేంద్రం చొరవ చూపినా సమావేశాలకు వెళ్లలేదు. మరోవైపు ఈ సమస్యలను అడ్డు పెట్టుకుని సెంటిమెంటు రాజేయడం, పార్టీ కోసం వాడుకోవడం బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అవే సమస్యలతో మరోమారు సెంటిమెంటు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణపై మళ్లీ ఆంధ్రా పెత్తనం మొదలైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు గులాబీ నేతలు.
కేసీఆర్ సెంటిమెంట్‌కు బ్రేక్..
ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి–చంద్రబాబు సమావేశంలో కేసీఆర్ సెంటిమెంటు రాజకీయాలకు చెక్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. సమస్యలను ముందుగా రాజకీయాల నుంచి వేరు చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఉన్నతాధికారులు, నిపుణులు, మేధావులతో కమిటీలు ఏర్పాటు చేసి పెండింగ్ సమస్యలు పరిష్కరించుకోవాలనే ఆలోచనలో ఇరు రాష్ట్రాల సీఎంలు ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా కేసీఆర సెంటిమెంటు రాజకీయాలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు.
రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా..
విభజన సమస్యల పరిష్కారంతో రెండు రాష్ట్రాలకు మేలు జరగాలన్న ఆలోచనలో రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ఉన్నట్లు సమాచారం. సమస్యల పరిష్కారంతోపాటు ఇన్నాళ్లూ సమస్యల పేరు చెప్పుకుని పబ్బం గడిపిని బీఆర్‌ఎస్, వైసీపీలకు కూడా ఇకపై ఛాన్స్ లేకుండా చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూస్తున్నారు.