RK Kothapaluku: ఆర్కే కొత్త పలుకు: ఈ సూక్తి ముక్తావళి సరే.. మీ ప్యాకేజీల మాటేమిటి?

సాధారణంగా ఎన్నికలు వస్తే రాజకీయ నాయకులకు ఇబ్బంది ఉంటుంది. మీడియా యాజమాన్యాలకు మాత్రం పంట పండుతుంది. అడ్డగోలుగా సంపాదిస్తుంటారు.

  • Written By: Bhanu Kiran
  • Published On:
RK Kothapaluku: ఆర్కే కొత్త పలుకు: ఈ సూక్తి ముక్తావళి సరే.. మీ ప్యాకేజీల మాటేమిటి?

Follow us on

RK Kothapaluku: “తెలంగాణలో ధన తంత్రం” ఉదయం ఆంధ్రజ్యోతి పేపర్ తిరుగేస్తుంటే దాని ఓనర్ వేమూరి రాధాకృష్ణ నాలుగవ పేజీలో రాసిన ఎడిటోరియల్ కు పెట్టిన శీర్షిక.. దాదాపు మూడవ వంతు పేజీలో ఆయన తన వర్తమాన రాజకీయ విశ్లేషణను రాసుకుంటూ పోయారు. తెలంగాణ ఎడిషన్లో తెలంగాణ రాజకీయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక ఆంధ్ర ఎడిషన్ లో అయితే జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు.. పనిలో పనిగా చంద్రబాబు నాయుడు కేసులను ప్రస్తావించి సింపతి కార్డ్ ప్లే చేశాడు. ఇదేం జర్నలిజమో ఆయనకే తెలియాలి. సరే ఈ విషయాలు పక్కన పెడితే తెలంగాణలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం నాటికి ప్రచారం కూడా ముగియబోతోంది. ఎన్నికలు చాలా ఖరీదుగా మారాయని, దీనంతటికీ కేసీఆర్ మాత్రమే కారణమని ఆర్కే తేల్చేశారు. గతంలో అభ్యర్థులకు ప్రజలే స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చేవారని, ఇప్పుడు వారికి ఎదురు డబ్బులు ఇచ్చి అభ్యర్థులు ఓట్లు కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. సరే చదవడానికి ఈ ఎడిటోరియల్ సూక్తి ముక్తావళి లాగా కనిపించినప్పటికీ.. మరి తెర వెనుక రాధాకృష్ణ చేస్తున్నది ఏమిటి?

ప్యాకేజీలు

సాధారణంగా ఎన్నికలు వస్తే రాజకీయ నాయకులకు ఇబ్బంది ఉంటుంది. మీడియా యాజమాన్యాలకు మాత్రం పంట పండుతుంది. అడ్డగోలుగా సంపాదిస్తుంటారు. (అంతటి ఈనాడు కూడా పెయిడ్ ఆర్టికల్స్ రాస్తుందని మీడియా సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.) ఇక ఆంధ్రజ్యోతి విషయానికొస్తే బ్రాంచ్ మేనేజర్లు, బ్యూరో లు, స్టాఫ్ రిపోర్టర్ లు, ఎడిషన్ ఇన్చార్జ్ లు కలిసి ఎమ్మెల్యే అభ్యర్థులతో బేరసారాలు మాట్లాడేశారు. నెగిటివ్ వార్తలు రాయకుండా ఉండడానికి లక్షల్లో ప్యాకేజీలు కుదుర్చుకున్నారు. మొన్నటి దాకా భారత రాష్ట్ర సమితి మీద ఎగిరిపడిన ఆంధ్రజ్యోతి.. ఇప్పుడు ఆ స్థాయిలో స్పేస్ ఇవ్వడం వెనుక కారణం ఇదే.. రాత్రికి రాత్రే అభ్యర్థుల దగ్గరికి వెళ్ళటం.. వాళ్లు ఇచ్చిన డబ్బులు తీసుకోవడం.. అభ్యర్థి స్థాయిని బట్టి ప్యాకేజీ నిర్వహించి.. దర్జాగా వసూలు చేసుకోవడం పరిపాటిగా మారింది. గతంలో ఇందులో 5% డెస్క్ లో పనిచేసే వారికి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని కూడా గాలికి వదిలేశారు. స్థానికంగా ఉండే రిపోర్టర్ తో సంబంధం లేకుండానే జిల్లాలో ఉండే వారు అభ్యర్థుల దగ్గరికి వెళ్లి ప్యాకేజీలు కుదుర్చుకుంటున్నారు. వార్తలు రాయడమేమో రిపోర్టర్ల వంతవుతోంది. ఆ వార్తలను కాలాల వారిగా విభజించి కూర్చడం సబ్ ఎడిటర్ల పనవుతోంది. కానీ అంతిమంగా యాజమాన్యం మాత్రమే ఇక్కడ లాభపడుతోంది. వాస్తవానికి ఎన్నికలు అంటే మీడియాలో పనిచేసే వారికి కొద్దో గొప్పో డబ్బులు అందుతాయి. వారికి లైన్ ఎకౌంట్ లాంటివి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం.. చివరికి ఆరోకొరో వచ్చే పైసలు కూడా యాజమాన్యం లాక్కోవడం ఇప్పుడు నయా ట్రెండ్ గా మారింది.

ఇవేనా విలువలు

తెలంగాణలో ఎన్నికలు ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయని వాపోయిన రాధాకృష్ణ.. మరి ఈ ప్యాకేజీల గురించి ఏం మాట్లాడుతారు? యాజమాన్యానికి తెలియకుండానే అందులో పని చేసే ఉద్యోగులు ప్యాకేజీలు వసూలు చేస్తున్నారా? జిల్లా స్థాయిలో ఉండే ఉద్యోగులు నేరుగా ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తే అక్కడ పనిచేసే విలేకరుల పరిస్థితి ఏమిటి? రేపటినాడు వారికి ఏమైనా విలువ ఉంటుందా? అంటే అటు లైన్ ఎకౌంట్ ఇవ్వపోగా, ఇటు అంతకొంత దొరికే పైసల పై కూడా యాజమాన్యమే కక్కుర్తి పడితే వారు ఎలా బతకాలి? ఇక పెద్ద పత్రికల విషయానికొస్తే ఈనాడు, సాక్షి, చివరికి నమస్తే తెలంగాణ కూడా లైన్ ఎకౌంట్ ఇస్తోంది. కానీ విలువల సారం బోధించే రాధాకృష్ణ మాత్రం రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఈయన తనది దమ్మున్న పత్రిక అని చెప్పుకుంటాడు. పోనీ ఇలా వసూలు చేసిన డబ్బులు ఉద్యోగుల జీతాల లో ఉపయోగిస్తాడా అంటే అది కూడా ఉండదు. ఏడాది గా ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లేవు. కోవిడ్ టైంలో అడ్డగోలుగా ఉద్యోగులను తొలగించాడు.. డిజిటల్ మీడియా ఉంది కాబట్టి వారు బతికి బట్ట కట్టారు. లేకుంటే వారి పరిస్థితి ఎలా ఉండేదో.. ఇవాళ తెలంగాణలో అధికార పక్షం ప్రతిపక్షం అని తేడా లేకుండా ప్యాకేజీలు కుదుర్చుకున్న ఆంధ్రజ్యోతి.. రేపటి నాడు ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితిని కొనసాగిస్తుంది. అందులో లేషమాత్రమైనా అనుమానం లేదు. ఆయన మాత్రం ఎక్కడినుంచని తెచ్చి పత్రిక నిర్వహిస్తాడు అనే ప్రశ్న రావచ్చు. పెట్టిన పెట్టుబడికి రాబడి తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే.. తక్కువ పెట్టుబడి పెట్టి అటు ఉద్యోగులను హింసించి, బయట బెదిరింపులకు పాల్పడటం జర్నలిజం సూత్రం అనిపించుకోదు.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు